CM Chandrababu : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు, కొంతమంది అధికారుల తీరుపైన చంద్రబాబు మంత్రులతో చర్చించారు. గత ప్రభుత్వంలో విమర్శలు ఎదుర్కొన్నా అధికారుల తీరు మారలేదని మండిపడ్డారు. అలాంటి అధికారుల తీరు కారణంగానే మనం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మంచిగా ఉండొచ్చు..కానీ మెతకగా ఉండకూడదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రులు పనితీరును మెరుగుపరచుకోవాలని ఈ మేరకు ముఖ్యమంత్రి సూచించారు. . చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్‌నెస్ రావడం లేదని.. కొంత మంది మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలో సోషల్ మీడియా లో రాష్ట్ర ప్రభుత్వం పై జరుగుతున్న దుష్ప్రచారం పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చ లేవనెత్తారు. కొంతమంది వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా పోస్టులు పెడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం చంద్రబాబు దృష్టికి పవన్ కళ్యాణ్ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. గత ప్రభుత్వం వల్లే ఏపీ పోలీసులు ఇలా తయారయ్యారని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్‌కు చెప్పారు. కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారనీ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థ ను దారిలోకి తెస్తానని పవన్‌కు చంద్రబాబు చెప్పారు. లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు చూపిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు.