CM Jagan Strict: గ్రాఫ్ పడితే నో టికెట్ !కుప్పం మనదే!!

ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తామని, వాటి ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుందని వైసీపీ చీఫ్ జగన్ తేల్చేసారు.

  • Written By:
  • Publish Date - April 27, 2022 / 09:21 PM IST

ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తామని, వాటి ఆధారంగా సీట్లు కేటాయింపు ఉంటుందని వైసీపీ చీఫ్ జగన్ తేల్చేసారు. స్థానికంగా గ్రాఫ్ పెరగకపోతే, అభ్యర్ధిని మార్చక తప్పదని హెచ్చరించారు. పార్టీ గెలుపు ముఖ్యమని జగన్ స్పష్టం చేసారు. వారంలో 2,3 రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండాలని దిశానిర్దేశం చేసారు. గెలవడానికి అన్ని వనరులు సమకూరుతాయని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది

నేతలకు జగన్ టార్గెట్

2024 రూట్ మ్యాప్ డిసైడ్ చేసారు జగన్. వచ్చే ఎన్నికల్లో కుప్పం తో సహా 175సీట్లు గెలవాలని నిర్దేశించారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం తిప్పికొట్టాలని ఆదేశించారు. మే 10వ తేదీ నుంచి గడప గడపకు వైసీపీ నిర్వహణకు నిర్ణయించాలని ఆదేశించారు. కుప్పంలోనూ ఈ సారి గెలవబోతున్నామంటూ చెప్పుకొచ్చారు. మంత్రులు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో నిర్వహించిన సమావేశంలో జగన్ పలు కీలక అంశాలపైన స్పష్టత ఇచ్చారు.
మే నుంచి పూర్తి స్థాయిలో 2024 దిశగా అడుగులు వేయాలని స్పష్టం చేసారు. మే 10వ తేదీ నుంచి గడప గడపకు వైసీపీ కార్యక్రమం అమలు చేయాలని నిర్దేశించారు. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు..వారికి అందుతున్న పథకాల గురించి వివరించాలని సూచించారు. చంద్రబాబు,దత్తపుత్రుడు, మీడియా కలిసి చేస్తున్న ప్రచారాన్ని ప్రతీ స్థాయిలోనూ తిప్పి కొట్టాలని జగన్ స్పష్టం చేసారు.

జిల్లా అధ్యక్షులకు కాబినెట్ హోదా

జిల్లా అధ్యక్షుల్ని జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్లుగా చేస్తున్నాం, వారికి కేబినెట్‌ హోదా ఇస్తున్నామని జగన్ ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల అవుతాయన్నారు. ఇక, జిల్లా కమిటీలను సైతం జూలై 8 న నిర్వహించే ప్లీనరీ లోగా పూర్తి చేయాలని సీఎం జగన్ నిర్దేశించారు.
జిల్లా అధ్యక్షులకు కేబినెట్ హోదా ఇవ్వడమే కాదు, జిల్లా కమిటీల్లో 50 శాతం బీసీ-ఎస్సీ-ఎస్టీ-మైనార్టీ వర్గాలకు..అందునా 50 శాతం మహిళలకు ఇవ్వాలని ఆదేశించారు. అందరం ఒకే పార్టీ, ఒకే కుటుంబంగా ఉండాలని, విభేదాలు పక్కన పెట్టాలని తేల్చి చెప్పారు. ప్రతీ గ్రామంలోని సచివాలయాన్ని ఎమ్మెల్యే సందర్శించాలని అక్కడ చేయాల్సినవి అక్కడే ఉండే పుస్తకంలో రికార్డు చేయాలని సూచించారు. ప్రతీ గ్రామంలో సోషల్ మీడియా వారియర్లు ఉండేలా చూడాలని నిర్దేశించారు. సచివాలయలకు చేయాల్సిన పనుల గురించి సూచనలు – సలహాలు ఇవ్వాలన్నారు. తమ నియోజకవర్గాల్లో నాడు – నేడు కింద పూర్తయిన స్కూళ్లను ప్రారంభించాలని సీఎం సూచించారు. మొత్తం మీద 2024 దిశగా జగన్ దిశానిర్దేశం చేశారు.