Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయాన్ని సాధించి నేటికి సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భంగా జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రజా తీర్పు ప్రజా చైతన్యానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతీకగా నిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. 2024 జూన్ 4వ తేదీ భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అయిదేళ్ల నిరంకుశ పాలనకు ప్రజలు తమ ఓటుతో ముగింపు పలికారని, ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించిన ఘనత ప్రజలదేనని ఆయన గుర్తు చేశారు.
Read Also: TG TET 2025 : జూన్ 18 నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు.. ఏ సబ్జెక్టు ఎప్పుడంటే?
ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ దృఢ నాయకత్వం, నాలుగున్నర దశాబ్దాల అనుభవం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజ్ఞతా మార్గదర్శనం, జనసైనికులు మరియు వీరమహిళల త్యాగాల స్పూర్తి ఇవన్నీ కలిసికట్టుగా ఈ విజయాన్ని సాధించాయి అని వివరించారు. ఎన్డీయే కూటమి సాధించిన చారిత్రక విజయానికి జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విశేషంగా ఆకర్షణగా నిలిచిందని, ఆ విజయానికి ఏడాది పూర్తయినందుకు హర్షం వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును అపారమైన బాధ్యతగా తీసుకుని, గత ప్రభుత్వ పాలనలో చేసిన తప్పులను సరిదిద్దే కృషిలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాం. స్వర్ణాంధ్ర 2047 దిశగా రాష్ట్రాన్ని నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించేందుకు ఎన్డీయే కూటమి కట్టుబడి ఉన్నది అని ఆయన వివరించారు.
రాజకీయాలకు అతీతంగా, ఆంధ్ర ప్రజల ఆకాంక్షలే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేస్తూ, జనసేన, తెలుగుదేశం, బీజేపీల కూటమి సమిష్టిగా ప్రజా పాలనను మెరుగుపరచేందుకు చురుగ్గా పనిచేస్తోందని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలనను అందించడమే తమ ప్రాధాన్యత అని, అభివృద్ధి, సంక్షేమం రెండు పుంజాలు తమ పాలనకు మూల స్తంభాలని స్పష్టంగా చెప్పారు. ఈ విజయంలో భాగస్వాములైన జనసైనికులకు, వీరమహిళలకు, తెలుగుదేశం మరియు బీజేపీ కార్యకర్తలకు, మూడు పార్టీల నాయకత్వానికి పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమిష్టి శ్రమ, పట్టుదల వల్లే ఈ ఘనవిజయం సాధ్యమైంది అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయ దినోత్సవం సందర్భంగా, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే బాధ్యతను మరింతగా ఎరుకపెట్టుకుంటామని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా పాలన సాగిస్తామని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు.
Read Also: Ambati Rambabu : గుంటూరు కలెక్టరేట్ వద్ద అంబటి రాంబాబు హల్‌చల్