Site icon HashtagU Telugu

Pegasus Spyware: చంద్ర‌బాబును వెంటాడుతున్న పెగాస‌స్

CBN Social Media

Chandrababu Pegasus

ప్ర‌పంచ దేశాల‌తో పాటు ఇండియాను కుదిపేసిన పెగాస‌స్ స్పైవేర్ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్ని హీటెక్కిస్తోంది. ప్ర‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ రేపిన దుమారం, రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష తెలుదేశంపార్టీని డిఫెన్స్‌లో ప‌డేసింది. ఏక్క‌డో దేశం కాని దేశం ఇజ్రాయిల్‌లోని ఓ కంపెనీ నిఘా సాఫ్ట్‌వేర్, మ‌రోవైపు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీలో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోప‌ణలు.. ఈ రెండింటి ప్ర‌భావం ఏపీలో తెలుగుదేశంపార్టీని ఇరుకున పెడుతోంది.

వాస్త‌వానిని పెగాసస్ వ్య‌వ‌హారం ఇండియాలో దాదాపుగా సైడ్ ట్రాక్ ఎక్కేసింది. అయితే తాజాగా అసెంబ్లీలో ప‌శ్చిమ‌ బెంగాల్ దీదీ మ‌మ‌తా వ్యాఖ్య‌ల‌తో మ‌రోసారి పెగాస‌స్ వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. ముఖ్యంగా ఏపీలో చంద్ర‌బాబు అండ్ టీడీపీ త‌మ్ముళ్ళ‌ను పెగాస‌స్ అంశం బాగా ఇరుకున పెట్టింది. పెగసస్ స్పైవేర్‌ను అప్పటి టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందనేది తాజాగా మమతా బెనర్జీ చేసిన ఆరోపణ.

అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్లో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఇదే అంశం పై అప్ప‌టి ఇంటెలిజెన్స్ ఐజీ వెంక‌టేశ్వ‌ర‌రావు స‌స్పెండ్ అయ్యారు. దేశ ర‌క్ష‌ణ‌కు సంబంధించిన వ్య‌వ‌హారాల్లో ఇజ్రాయిల్ కంపెనీతో లోపభూయిష్టమైన కొనుగోళ్లు జరిపిందనే అభియోగాలతో ఆయన సస్పెండ్ అయ్యారు. ఆ త‌ర్వాత ఈ పెగాస‌స్ అంశం స‌ద్దుమ‌ణిగింది. అయితే ఇప్పుడు మమతా పేల్చిన బాంబుతో చంద్ర‌బాబు అండ్ త‌మ్ముళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిప‌డ‌గా, వైసీపీ శ్రేణులు చేస్తున్న‌ వాదనకు బలం చేకూరుతోంది.

పెగాసస్ స్పైవేర్ ఉపయోగించడం ద్వారా నాడు ప్రతిపక్షంలో ఉన్న తమ ఫోన్లను టీడీపీ ప్రభుత్వం ట్యాప్ చేసిందని, ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు అబ్బయ్య చౌదరి, గుడివాడ అమర్‌నాధ్ రెడ్డి ఆరోపించారు. ఈ క్ర‌మంలో చంద్రబాబు కుట్రను బయటపెట్టిన మమతా బెనర్జీపై పరువు నష్టం దావా వేస్తామని టీడీపీ బ్యాచ్ ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. మ‌మ‌తా విషయాలు నూటికి నూరుపాళ్లు నిజం కాబట్టే, చంద్రబాబు సమాధానం చెప్పలేకపోతున్నారని వైసీపీ నేత‌లు అంటున్నారు.

ఇక ఇదే విష‌యంపై తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా టీడీపీని ఇరుకున‌పెట్టేలా వైసీపీ వ్య‌హం ర‌చించింది. స‌భ‌లో వైసీపీ స‌భ్యులు పెగాస‌స్ పై చ‌ర్చ‌కు డిమాండ్ చేయ‌డంతో టీడీపీ స‌భ్యులు డిఫెన్స్‌లో ప‌డ్డారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లో దీదీ క‌దిపిన తేనెతుట్టె, ఏపీలో టీడీపీని వెంటాడుతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏది ఏమైనా అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌తిప‌క్ష తెలుగు దేశం పార్టీని ఇరుకున పెట్టేందుకు, అధికార వైసీపీ ప‌క్కా వ్యూహం ర‌చించింద‌ని, రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.