Site icon HashtagU Telugu

Pegasus Spyware: టీడీపీ ఇరుక్కుంటుందా..?

Tdp Pegasus Spyware

Tdp Pegasus Spyware

దేశంలో దుమారం రేపిన పెగాసస్ స్పైవేర్ అంశం ఇప్పుడు ఏపీలో కలకలం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీకి సమస్యగా మారింది. ఈ క్ర‌మంలో పెగాస‌స్ వ్యవహారం పై నిగ్గు తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వం హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ చేసిన ఆరోప‌ణ‌ల‌తో ఇరుకున‌ప‌డిన టీడీపీ ఇప్పుడు పాతివ్ర‌త్యం నిరూపించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

2019ల‌కు ముందు ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందని మమతా బెనర్జీ ఆరోపణలు చేసింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజ‌కీయాల్లో పెనుదుమారం రేప‌డంతో, ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో కూడా చర్చ సాగింది. ఈ క్ర‌మంలో అధికార వైసీపీ, ప్ర‌తిప‌క్ష టీడీపీ స‌భ్యుల‌ మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీలో చర్చించాలని వైసీపీ సభ్యులు కోరగా ముందుగా నోటీసు ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ సూచించారు. ప్రభుత్వ ఛీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి నోటీసు ఇవ్వడంతో చర్చకు స్పీకర్ త‌మ్మినేని అనుమతిచ్చారు.

పెగాసస్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశముందని..అందుకే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టిందని రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. తెలుగుదేశం మాత్రం పెగాసస్ స్పైవేర్ కొనుగోలుకు ప్రతిపాదన వచ్చినా..తిరస్కరించామంటోంది. అధికార పార్టీ కావాలనే ఉద్దేశ్యపూర్వకంగా బురద జల్లేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ నేత నారా లోకేష్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై చర్చ అనంతరం దర్యాప్తు కోసం హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

ఈ నేప‌ధ్యంలో నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇజ్రాయిల్ దేశపు ఎన్ఎస్ఓ గ్రూపుకు చెందిన వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ కొనుగోలు జరిగిందా లేదా..జరిగితే ఎలా ఎప్పుడు వినియోగించారనేది దర్యాప్తు చేయనున్నారు. త్వ‌ర‌లోనే హౌస్ కమిటీ సభ్యుల్ని ప్రకటిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై చర్చ అనంతరం దర్యాప్తు కోసం హౌస్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అంటే నాడు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇజ్రాయిల్ దేశపు ఎన్ఎస్ఓ గ్రూపుకు చెందిన వివాదాస్పద పెగాసస్ స్పైవేర్ కొనుగోలు జరిగిందా లేదా, ఒక‌వేళ జరిగితే, ఎవ‌రు ఎప్పుడు ఎలా వినియోగించారనేది దర్యాప్తు చేయనున్నారు. దీంతో పెగాసస్ వ్యవహారం టీడీపీ మెడకు చుట్టుకోనుందా లేదా అనేది చూడాలి.