Site icon HashtagU Telugu

Peddireddy Vs Chandrababu : కుప్పం కురుక్షేత్రంలో..ఇద్ద‌రూ ఇద్ద‌రే.!

CBN Kuppam

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ఏపీ ప్ర‌తిపక్ష‌నేత చంద్ర‌బాబునాయుడు ఇద్ద‌రూ రాజ‌కీయ స‌మ‌కాలీకులు. విద్యార్థి రాజ‌కీయాల నుంచి వ‌చ్చిన నేత‌లు. ఎస్వీ యూనివ‌ర్సిటీలో ఆయా సామాజిక వ‌ర్గాల‌కు నాయ‌క‌త్వం వ‌హించారు. ఆనాటి నుంచి ఇద్ద‌రి ఎత్తుగ‌డ‌లు, వ్యూహాలు ఒక‌రికొక‌రు తెలుసుకోగ‌ల‌రు. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల మీద ఇద్ద‌రూ ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. నువ్వా..నేనా? అన్న‌ట్టు రాజ‌కీయ పావులు క‌దుపుతున్నారు.
విద్యార్థి ద‌శ నుంచి స‌మాంత‌ర రాజ‌కీయాలు న‌డిన‌ప్ప‌టికీ వ్య‌క్తిగ‌త వైరం పెద్ద‌గా బ‌య‌ట‌ప‌డేది కాదు. కానీ, 2014 ఎన్నిక‌ల త‌రువాత నుంచి ఇద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయంగా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భంగుమంటోంది. అదికాస్తా..2019 ఎన్నిక‌ల వ‌చ్చేట‌ప్ప‌టికి మ‌రింత రాజుకుంది. ఫ‌లితంగా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు మెజార్టీని 2019 ఎన్నిక‌ల్లో పెద్దిరెడ్డి త‌గ్గించ‌గ‌లిగారు. ఆనాటి నుంచి పైచేయిగా నిలుస్తూ వ‌స్తూ..స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాడు.
ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో దారుణంగా టీడీపీ ఓడిపోయింది. కేవ‌లం మూడు ఎంపీటీసీల ను మాత్ర‌మే చంద్ర‌బాబు వ‌ర్గీయులు గెలుచుకోగ‌లిగారు. ఒక్కరు కూడా జ‌డ్పీటీసీగా గెలువ‌లేక‌పోయారు. ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో ఘోరంగా టీడీపీ ఓడిపోతుంద‌ని పెద్దిరెడ్డి స‌వాల్ చేస్తున్నాడు. ఒక వేళ టీడీపీ కుప్పంలో గెలిస్తే, రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటానంటూ శ‌ప‌థం చేస్తున్నాడు. అంతేకాదు, ఈసారి చిత్తూరు జిల్లాలో ఎక్క‌డ నుంచి పోటీ చేసినా చంద్ర‌బాబును ఓడిస్తాన‌ని పెద్దిరెడ్డి స‌వాల్ చేస్తున్నాడు. ఒక వేళ ఓడించ‌లేక‌పోతే రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు.

Also Read : నేత‌ల `బూతు` సంస్కారం

స్థానిక ఎన్నిక‌లను వాస్త‌వంగా టీడీపీ బ‌హిష్క‌రించింది. ఆ మేర‌కు చంద్ర‌బాబునాయుడు ఆనాడు నిర్ణ‌యం తీసుకున్నాడు. ఫలితంగా వైసీసీ కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీల‌ను గెలుచుకోగ‌లిగింది. ఆ విష‌యాన్ని బాబు వ‌ర్గీయులు చెబుతున్నారు. కానీ, ఈసారి కుప్పం ఎన్నిక‌లో విజ‌యం సాధించ‌డానికి బాబు ద‌గ్గ‌రుండి వ్యూహాలు ర‌చిస్తున్నారు. తాజాగా లోకేష్ కుప్పం వెళ్లాడు. అక్క‌డ కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ ప‌ర‌చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఆ క్ర‌మంలో కుప్పంలో గురువారం ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.నెల్లూరు కార్పొరేష‌న్ స‌హా 14 మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. మిగిలిన‌వ‌న్నీ ఒక ఎత్తు అయితే కుప్పం మాత్రం మ‌రోఎత్తుగా క‌నిపిస్తోంది. అక్క‌డ గెలిచినా..ఓడినా పెద్ద‌గా తెలుగుదేశం పార్టీకి ఓరిగేది ఏమీ లేదు. కాక‌పోతే, చంద్ర‌బాబునాయుడును విమ‌ర్శించ‌డానికి అక్కడి ఓట‌మి వైసీపీకి ఉప‌యోగ‌ప‌డుతుంది. పైగా వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌పైన దాని ప్ర‌భావం ఉంటుంద‌ని ప్ర‌త్య‌ర్థుల అభిప్రాయం. అలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా ప‌నిచేయాల‌ని టీడీపీ క్యాడ‌ర్ కు చంద్ర‌బాబు దిశానిర్దేశం చేస్తున్నాడు.

Also Read : విప్ల‌వం నీడ‌న `గోండుల‌` వ్య‌ధ‌

కుప్పం క్షేత్ర‌స్థాయి బాధ్య‌త‌ల‌ను ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ మంత్రి అమ‌ర్నాథ‌రెడ్డికి అప్ప‌గించారు. ప్ర‌తిరోజూ జ‌రిగే ప‌రిణామాల‌పై వాళ్లిద్ద‌రూ స‌మీక్షిస్తున్నారు. ఇటీవ‌ల పోలీసులు వాళ్లిద్ద‌రిపై కేసులు పెట్టారు. గృహ‌నిర్భందం కూడా చేశారు. ఇదంతా అధికార దుర్వినియోగంగా నిర్వ‌చిస్తూ చిత్తూరు క‌లెక్ట‌ర్ కు చంద్ర‌బాబు లేఖ రాశాడు. పైగా చంద్ర‌బాబు నిల‌బెట్టిన అభ్య‌ర్థి ప్ర‌కాశ్ కిడ్నాప్ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగిచింది. ఆ త‌రువాత టీ క‌ప్పులో తుఫాన్ మాదిరిగా ఆ సంఘ‌ట‌న‌ను వైసీపీ చ‌ల్లార్చింది. ఇలా..ప్ర‌తి విష‌యంలోనూ ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటోన్న చంద్ర‌బాబు, పెద్దిరెడ్డి మ‌ధ్య జ‌రుగుతున్న కుప్పం వార్ ఎటువైపు దారితీస్తుందో చూడాలి.