AP Assembly : జ‌గ‌న్ స‌ర్కార్ `డేటా చోరీ`పై టీడీపీ అటాక్‌

అసెంబ్లీలో జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌వేశ‌పెట్టిన పెగాసిస్ మ‌ధ్యంత‌ర నివేదిక‌పై టీడీపీ రివ‌ర్స్ అటాక్ చేసింది

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 03:42 PM IST

అసెంబ్లీలో జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌వేశ‌పెట్టిన పెగాసిస్ మ‌ధ్యంత‌ర నివేదిక‌పై టీడీపీ రివ‌ర్స్ అటాక్ చేసింది. ఆ నివేదిక‌లోని లోపాల‌ను ఎత్తిచూపింది. మధ్యంతర నివేదికలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? లేదా? అనే దానికి సంబంధించి ఒక్క పదం కూడా లేదని టీడీపీ ప‌య్యావుల నిల‌దీశారు. అసలక్కడేమీ జరగలేదు కాబట్టే, అధికారపక్షం తమ నివేదికలో ఏమీ చెప్పలేకపోయిందని విమర్శించారు. పెగాసస్ వాడలేదని స్ప‌ష్టంగా చెప్ప‌గ‌ల‌మ‌ని అన్నారు. ఇప్పుడున్న‌ ప్రభుత్వమే డేటా చోరీ చేస్తోందని, ఇంటింటికీ వాలంటీర్లను పంపించి ఆధార్ కార్డులు సేకరించి, టీడీపీ వాళ్ల ఆధార్ కార్డులను ఓటర్ లిస్టులకు అటాచ్ చేయవద్దని చెబుతోందని ఆరోపించారు. గడప గడపకు వెళ్లినప్పుడు ఎవరికి ఏ లబ్ది చేకూరిందని, ఏ పథకం ఎవరికి ఇచ్చారని మీ పార్టీకి ఎలా సమాచారం వచ్చింది. ఇది డేటా చౌర్యం కాదా? అని పయ్యావుల నిలదీశారు.

పెగాసస్ పై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరుపుతోంది. దమ్ము, చిత్తశుద్ధి ఉంటే ఏమీ లేని ఈ మధ్యంతర నివేదికను, ఈ మూడేళ్ల పాలనలో జరిగిన వ్యవహారాలను సుప్రీంకోర్టుకు నివేదించండ‌ని సవాల్ విసిరారు.
ఇలాంటి నివేదికలను సభలో సమర్పించేటప్పుడు పలు కాపీలను ప్రింట్ చేసి ఉంచుతారని, కానీ పెగాసస్ మధ్యంతర నివేదికను రెండు కాపీలే ఉన్నాయని అన్నారు. అసెంబ్లీలో నిల‌దీస్తే ఇచ్చారని పయ్యావుల వెల్లడించారు. లేకపోతే ఈ నివేదిక కూడా బయటికి వచ్చేది కాదని, ఏదో జరిగిపోయిందనే ఒక భ్రమను కలిగించేవారని అన్నారు.

అసెంబ్లీలో జ‌రిగిన డేటా చౌర్యంపై మీడియా పాయింట్ వ‌ద్ద టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్ పయ్యావుల కేశవ్ క‌మిటీ నివేదిక‌ను త‌ప్పుబ‌ట్టారు. రాష్ట్ర డేటా సెంటర్ నుంచి ఆ డేటా ఎక్కడికి వెళ్లిందని వారు గూగుల్ ను అడిగారని, ప్రపంచంలోనే టెక్నాలజీ జెయింట్ గా ఉన్న గూగుల్ కూడా ఆ డేటా ఎక్కడికి వెళ్లిందో తాము గుర్తించలేమని చెప్పిందని, నివేదికలో ఈ విషయాన్నే చెప్పారని వెల్లడించారు.

నివేదిక‌లో పేర్కొన్న‌ అడ్రస్ లను ఎవరికీ కేటాయించలేదని గూగుల్ ఎంతో స్పష్టంగా చెప్పిందని అన్నారు. దీన్నిబట్టి కొండను తవ్వి దోమను కూడా పట్టలేకపోయారన్న విషయం అర్థమవుతోందని అన్నారు. సున్నితమైన సమాచారం చోరీకి గురైందని అధికార పక్షం చెబుతోందని, ఆ సున్నితమైన సమాచారం ఏంటో చెప్పే ధైర్యం వారికి లేదని విమ‌ర్శించారు.