Site icon HashtagU Telugu

Pawan Kalyan: కర్నూలు జిల్లాలో ‘పవన్’ కౌలు రైతు భరోసా యాత్ర!

Pawan

Pawan

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది కర్నూలు జిల్లాలోనే. సుమారు 373 మంది కౌలు రైతులు గత మూడేళ్ల కాలంలో బలవన్మరణాలకు పాల్పడ్డార’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ కౌలు రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాల్లో భరోసా నింపేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 8వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలో కౌలు రైతుల భరోసా యాత్ర చేపడతారని… శిరివెళ్ల మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

సోమవారం మధ్యాహ్నం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “తొలి విడతలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 130 మంది కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ సాయం చేయనున్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తారు. మే 8వ తేదీ ఉదయం 9.30 గంటలకు పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లా రానున్నారు. శిరివెళ్ల మండల కేంద్రంలో రచ్చబండ సభ నిర్వహిస్తారు. రెండో విడతలో మిగిలిన వారికి సాయం అందిస్తాం. కౌలు రైతులకు ఆర్థికంగా సాయపడే ఈ గొప్ప కార్యక్రమం గురించి జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు ప్రతి రైతుకీ తెలియజెప్పాలి. వారికి మనం చేస్తున్న సాయం గురించి వివరించండి. రైతులకు తన వంతు సాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గొప్ప ఆలోచనను ప్రజలకు చెప్పాలి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద రాష్ట్ర మంత్రులు, వైసీపీ నేతలు చౌకబారు విమర్శలు మాని రైతులకు సాయం అందించే పనిపై దృష్టిపెట్టాలి. రైతు భరోసా యాత్ర రైతులకు కొండంత నమ్మకాన్ని కలిగిస్తున్న విషయాన్ని గ్రహించే వైసీపీ నేతలు ఇలాంటి చౌకబారు విమర్శలకు దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర మొదలు పెట్టగానే అదరాబాదరాగా రైతు కుటుంబాల ఖాతాల్లో లక్ష రూపాయలు వేస్తున్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా వారికి రూ.7 లక్షల సాయం అందాలి. ఈ పూర్తి సాయం అందే వరకు జనసేన పార్టీ పోరాటం ఆగదు. చిత్తశుద్ధి నిరూపించుకొని ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారం మీద దృష్టిపెట్టాలి” అన్నారు నాదెండ్ల మనోహర్.

Exit mobile version