Pawan Kalyan: పవన్ ‘వారాహి’ యాత్రకు సర్వం సిద్ధం!

పవన్ కల్యాణ్ కార్యక్రమాలన్నీ సినిమా ప్రమోషన్లను తలపిస్తుంటాయి.

Published By: HashtagU Telugu Desk
Varahi

Varahi

వచ్చే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలిపోనివ్వను అని తేల్చేసిన పవన్ దూకుడుగా వ్యవహరించబోతున్నారు. తన సినీ గ్లామర్ ను ఈ యాత్రకు మైలేజ్ ఇచ్చేలా కసరత్తులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 14నుంచి ఉభయగోదావరి ఉమ్మడి జిల్లాల్లో వారాహి యాత్ర అంటూ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పోస్టర్ ను రిలీజ్ చేశారు జనసేన నాయకులు. ఈ యాత్రకు సంబంధించి ఇప్పటికే పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా యాత్రకోసం ఇన్ చార్జ్ లను ఏర్పాటు చేశారు. వారి పర్యవేక్షణలో యాత్ర జరుగుతుంది. యాత్రలో వారాహి వాహనంపై ఎవరెవరుండాలి, ఎక్కడెక్కడ వాహనం ఆపి ప్రసంగించాలి అనే విషయాలపై కసరత్తు జరుగుతోంది.

పవన్ కల్యాణ్ కార్యక్రమాలన్నీ సినిమా ప్రమోషన్లను తలపిస్తుంటాయి. వారాహి (Varahi) వాహనం విషయంలో కూడా ముందు టీజర్లు వదిలినట్టు వాహనం ఫొటోలను బయటకు వదిలారు. ఆ తర్వాత వాహనంతో పవన్ కల్యాణ్ ఫొటోషూట్, చివరకు పూజా కార్యక్రమాల రోజు సినిమా రిలీజ్ చేసినంత హడావిడి చేశారు. ఇప్పుడు వారాహి యాత్ర సందర్భంగా కూడా అదే జరుగుతోంది. ముందుగా నాదెండ్ల మనోహర్ యాత్ర గురించి ప్రకటించారు, ఇప్పుడు పోస్టర్ విడుదల చేశారు. త్వరలో వారాహి పాటలు సిద్ధమవుతాయి, ఆ తర్వాత యాత్ర మొదలవుతుంది.

యాత్రలో భాగంగా రోజూ ఉదయం 9 గంటలకు ప్రజా వినతులు స్వీకరించి, పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేకంగా మాట్లాడతారని కూడా చెప్పారు. అయితే గతంలో నిర్వహించిన జనవాణిలో కూడా పవన్‌ వినతులు స్వీకరించారు. సమస్యలపై వచ్చిన వినతుల ఆధారంగా ఏదైనా కార్యాచరణ ప్రకటిస్తారా? వినతులకు పరిష్కారం చూపించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? భవిష్యత్తులో తమ ప్రభుత్వం వస్తే ఆ సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? వంటి విషయాల్లో కూడా ఈ యాత్ర ద్వారా ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది. యాత్రలో రోజూ స్థానిక జనసైనికులు, వీర మహిళలతో పార్టీ బలోపేతం మీద దిశానిర్దేశం ఉంటుందని కూడా చెప్తున్నారు. పార్టీ నిర్మాణ లోపాల వల్ల గత పదేళ్లలో జనసేనానితో కలిసి దగ్గరగా పని చేసే అవకాశం రాలేదు. ఈ యాత్ర ద్వారా పవన్‌ కార్యకర్తలతో అనుబంధం పెంచుకోవాలి. తాను అందరి వాడినని పవన్‌ ఈ యాత్ర ద్వారా తెలియజేయాల్సి అవసరం ఉంటుంది.

Also Read: Biggest Ever Drug Raid : వేలకోట్ల డార్క్ వెబ్ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు

  Last Updated: 06 Jun 2023, 11:40 AM IST