Pawan Politics: ఏపీతో పవన్ ఆట, మచిలీపట్నంలో రిహార్సల్స్

తెలుగుదేశం మీద డేంజర్ గేమ్ పవన్ ఆడుతున్నారు. ఆయన వలలో టీడీపీ పడిపోయింది. జనసేన పొత్తు లేకపోతే అధికారంలోకి రావడం కష్టం అనే భావానికి ప్రజల్ని పవన్...

  • Written By:
  • Updated On - March 14, 2023 / 12:22 PM IST

తెలుగుదేశం మీద డేంజర్ గేమ్ పవన్ (Pawan Kalyan) ఆడుతున్నారు. ఆయన వలలో టీడీపీ పడిపోయింది. జనసేన పొత్తు లేకపోతే అధికారంలోకి రావడం కష్టం అనే భావానికి ప్రజల్ని పవన్ తీసుకెళ్లారు. ఇప్పుడు సీట్ల విషయంలో బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. ఇరవై కాదు 60 కావాలనే సంకేతాలు పరోక్షంగా పంపారు. కనీసం 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నా సీఎం కావాలని ఆరాట పడుతున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి అదృష్టాన్ని జనసేన గుర్తు చేసుకుంటుంది. అపార అనుభవం ఉన్న చంద్రబాబు, ఎంతో కొంత రాజకీయ పరిజ్ఞానం ఉన్న జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసారు. ఇక ఇప్పుడు పవన్ వైపు ఏపీ ఓటర్లు చూస్తే రాష్ట్రం పరిస్థితి ఏమిటి? యూత్, కులం కార్డ్ వెరసి పవన్ రాజకీయం. అందుకే ఆయన కాపు, బలిజ కాంబినేషన్ కార్డ్ ను బయటకు తీశారు. కష్టం లేకుండా అధికారంలోకి రావాలని పవన్ వేస్తున్న ఎత్తుగడ టీడీపీ ని, రాష్ట్ర భవిష్యత్తును కార్నర్ చేయగలిగారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నడూ లేని విధంగా నాలుగు రోజుల పాటు మంగళగిరి పార్టీ ఆఫీసులో వరస మీటింగ్స్ పెట్టారు. అలాగే జనసేన ఆవిర్భావ సభకు ప్రిపరేషన్స్ గట్టిగానే సాగుతున్నాయి. అయితే పవన్ ఈ సభ ద్వారా ఏమి చెప్పబోతున్నారు. అసలు వచ్చే ఎన్నికల్లో పవన్ మార్క్ స్ట్రాటజీ ఏంటి అన్న దాని మీద ఇప్పటికైతే సొంత పార్టీ వారికి కూడా పూర్తిగా అవగాహన లేదని అంటున్నారు. పవన్ సొంత సామాజికవర్గం కాపులు మాత్రం వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే బెటర్ అని సూచిస్తున్నారు. జై కాపు సేన సారధి చేగొండి హరిరామజోగయ్య అయితే వైసీపీతో పాటు టీడీపీని గట్టిగా విమర్శించాలని పవన్ని సభాముఖంగానే కోరారు. కాపు మేధావులు అయితే స్వతంత్ర వైఖరినే అనుసరించడం ఇపుడున్న రాజకీయ పరిస్థితుల్లో అవసరం అని నొక్కి చెబుతున్నారు. అయితే ఈ విషయంలో పవన్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారా అన్న సందేహాలు అయితే వస్తున్నాయి. ఎందువల్లనంటే పవన్ ఎంతో గౌరవించే హరిరామజోగయ్య వంటి వారు సొంత వైఖరి అని గట్టిగా చెప్పినా పవన్ మాత్రం ఆచీ తూచీ మాట్లాడారు. తాను కాపుల ఆత్మగౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించను అని అంటున్నారు. అంటే కేవలం ఇరవై సీట్లు ఇస్తే పొత్తులు ఉండవని కాపుల నేతల మాటలకు పవన్ బదులు ఇచ్చారనుకోవాలంటున్నారు. అదే టైం లో ఆ సంఖ్య ఒక నలభై దాకా వెళ్తే కచ్చితంగా జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని అంటున్నారు. ఇక నలభై సీట్లు తెలుగుదేశం ఇస్తుందా అన్నది వేరే చర్చ. ఇక తెలుగుదేశం వరకూ చూస్త పదిహేను నుంచి మొదలెట్టి చివరికి ఇరవై మరీ డిమాండ్ పెడితే పాతికకు పొత్తులను తెగ్గొట్టాలని చూస్తున్నారని అంటున్నారు.

బొత్తిగా పాతిక సీట్ల కోసం పొత్తులు పెట్టుకుంటారా అంటే అక్కడే జనసేన ఊగిసలాటలో ఉంది అంటున్నారు. ఏపీలో వైసీపీని అధికారం నుంచి దించేయాలన్నది పవన్ అభిమతంగా చెబుతున్నారు. అదే టైం లో తాను సీఎం అవుతానా లేక చంద్రబాబా అన్నది సెకండరీ టార్గెట్ అని అంటున్నారు. అయితే అధికారంలో వాటా కోరాలీ అంటే అరవై దాకా సీట్లను డిమాండ్ చేస్తే అందులో యాభై దాకా గెలుచుకుంటే అపుడు ఒక లెవెల్ లో పొత్తుల కథ జనసేన నెగ్గినట్లు ఉంటుందని బలమైన సామాజికవర్గం నుంచి వస్తున్న వాదన.

మరో వైపు చూస్తే జనసేనలో పవన్ (Pawan Kalyan) తరువాత స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ వైఖరి మీద కాపులు గుస్సా అవుతున్నారు అని అంటున్నారు. తెలుగుదేశంతో పొత్తులకు ఆయనే ఉత్సాహపడుతున్నారని అంటున్నారు. ఆయన వల్లనే కీలకమైన కాపు నాయకులు పార్టీని వదిలేసి వెళ్లిపోయారని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ణి సీఎం గా ఈసారి చూడాలి అన్నదే వారి కోరిక.

అయితే పొత్తులలో అది సాధ్యపడుతుందా అన్నది కూడా సందేహంగా ఉందిట. అందువల్ల సొంతంగా పోటీ చేసి హంగ్ అసెంబ్లీని తీసుకురాగలిగితే కర్నాటకలో కుమారస్వామి మాదిరిగా ఏ పాతిక ముప్పయి సీట్లు తెచ్చుకున్నా పవన్ సీఎం అవుతారు అని అంటున్నారు. కానీ అలా జరగాలంటే గట్టిగా ఇప్పటి నుంచే జనంలో జనసేన ఉండాలి. ఆ దిశగా కార్యాచరణ ఉండాలి. మరి జనసేన ఆవిర్భావ సభలో పవన్ కచ్చితంగా వచ్చే ఎన్నికల మీద యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తారు అని అంటున్నారు. దాన్ని బట్టి ఏపీలో రాజకీయం ఏ మలుపు తిరుగుతుంది అన్నది చూడాలని అంటున్నారు.

Also Read:  Janasena: నేడే జనసేన ఆవిర్భావ సభ.. సభ వేదికకు పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా నామకరణం..!