PK Politics: బీజేపీ రోడ్ మ్యాప్ లో పవన్ కల్యాణ్ ట్విస్ట్? టీడీపీకి లాభమా, నష్టమా?

పవన్ కల్యాణ్ స్పీచ్ తో జనసేనలో ఊపొచ్చింది. వైసీపీలో కలవరం మొదలైంది. బీజేపీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది.

  • Written By:
  • Publish Date - March 16, 2022 / 08:47 AM IST

పవన్ కల్యాణ్ స్పీచ్ తో జనసేనలో ఊపొచ్చింది. వైసీపీలో కలవరం మొదలైంది. బీజేపీ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. ఇవి రెండు రోజులుగా రాష్ట్రమంతా వస్తున్న స్టేట్ మెంట్లు. కానీ పవన్ కల్యాణ్ స్పీచ్ ను జాగ్రత్తగా గమనించినవాళ్లకు ఒక్క విషయం మాత్రం అర్థమవుతుంది. జనసేనాని చెబుతున్న రాజ్యాధికారం కోసం… టీడీపీ-జనసేన ఒక్కటిగా ప్రజల ముందుకు వెళతాయని! ఇది అందరికీ తెలిసిందేగా.. మరి బీజేపీ రోడ్ మ్యాప్ సంగతేంటి అనుకోవచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్.

బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే పని మొదలుపెట్టుడే లేటు అని జనసేనాని చెప్పుండొచ్చు. దాని అర్థం. తాను ఎప్పుడు ఎలా ఉండాలో, ఏ సమయంలో ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అంతా బీజేపీ చెప్పినట్టు చేస్తానని అర్థం కాదు. ఏపీలో ఉన్న విపక్షాలన్నింటినీ కలుపుకుంటూ వెళతాం.. మీరు రోడ్ మ్యాప్ ఇస్తే ఓకే.. లేదంటే.. తన ప్రయాణం మాత్రం ఆగదని కమలనాథులకే సంకేతాలు పంపించారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

గత సార్వత్రిక ఎన్నికల తరువాత పవన్ కల్యాణ్.. బీజేపీతోనే కలిసి ముందుకు వెళుతున్నారు. కానీ ఆయన ఫేస్ వేల్యూని ఉపయోగించుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని ప్రయత్నిస్తున్న కమలనాథులు.. జనసేనానికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తి జనసేన పార్టీ వర్గాల్లో కనిపిస్తోందని పొలిటికల్ టాక్ నడుస్తోంది. అందుకే పొత్తుల విషయంలో ఆయన.. ముందే క్లారిటీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఒకవేళ బీజేపీ కాని టీడీపీతో కలవడానికి సిద్ధపడకపోతే అప్పుడేంటి పరిస్థితి అనుకోవచ్చు.

ఏపీలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు అన్నీ ఒక్కటవ్వాలనుకుంటున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి టీడీపీ అవసరం ఉంది. అందుకే పవన్ కల్యాణ్ తో కలిసి.. టీడీపీతో పొత్తుకు సిద్ధపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవేళ అదే జరిగితే.. పవన్ కల్యాణ్ కు, జనసేనకు కచ్చితంగా తగిన ప్రాధాన్యం ఉంటుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే గత ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేకపోవడం వల్ల ఏం జరిగిందో టీడీపీకి అర్థమైంది. అందుకే ఈసారి ముందే జాగ్రత్తపడింది.