Pawan Kalyan Yagam: ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం కోసం ‘పవన్’ యాగం!

ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన పవర్ ఏమిటో చూపించాలనుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 

Published By: HashtagU Telugu Desk
Pawan

Pawan

తెలుగు రాష్ట్రాల్లో (Telangana And AP) అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ నేతలు తమ శక్తిని కూడదీసుకుంటున్నారు. జన బలమే కాకుండా దైవ బలం అవసరమని బలంగా నమ్ముతారు. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ (CM Jagan) రాజశ్యామల యాగం చేయగా, తెలంగాణ  సీఎం కేసీఆర్ సైతం యాగాలు నిర్వహించేందుకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన (Janasena) పవర్ ఏమిటో చూపించాలనుకుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

ఈ నేపథ్యంలో ధర్మ పరిరక్షణ.. ప్రజా క్షేమం.. సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) యాగం చేపట్టారు. మంగళగిరిలో జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ యాగం జరుగుతోంది. ధర్మో రక్షతి రక్షితః అనే ధార్మిక సూత్రాన్ని మనసా వాచా కర్మణా విశ్వసించే పవన్ కళ్యాణ్.. ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి యాగానికి గణపతి పూజతో స్వయంగా అంకురార్పణ చేశారు.

ఉదయం 6:55 గంటలకు సంప్రదాయబద్ధంగా పట్టువస్త్ర ధారణలో యాగశాలలో జనసేనాని దీక్ష చేపట్టారు. ప్రజలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆకాంక్షతో దేవతామూర్తులకు ప్రణతులు అర్పించారు. యాగశాలలో అయిదుగురు దేవతామూర్తులను ప్రతిష్టాపన చేశారు. ఈ ఐదు దేవతా మూర్తులకు అభిముఖంగా యంత్ర స్థాపన జరిగింది. విగ్రహం, యంత్రం, హోమం ఆలంబనగా నేటి ఉదయం ప్రారంభమైన యాగం రేపు కూడా కొనసాగుతుందని‌ ప్రకటన వెలువడింది. ఎటువంటి హడావిడి, ఆర్భాటం లేకుండా కేవలం రుత్వికులు మాత్రమే సంప్రదాయబద్ధంగా పవన్ కళ్యాణ్ యాగం నిర్వహిస్తుండటం విశేషం.

కాగా యాగాలు, పూజ‌ల‌కు తోడుగా ఇప్పుడు ద‌శాబ్ది ఉత్స‌వాల‌ను జ‌రుపుకోవ‌డానికి 105 కోట్ల‌కు పైగా నిధుల‌ను సీఎం కేసీఆర్ కేటాయించిన విషయం తెలిసిందే.  వ‌చ్చే ఎన్నిక‌లు ప్ర‌ధానంగా యాగాలు, పూజ‌లు, పండుగ‌ల చుట్టూ తిప్ప‌డానికి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పార్టీలు ప్లాన్ చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆ ఒర‌వ‌డి ప్ర‌స్తుతం కొనసాగుతోంది.

Also Read: AP Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 దుర్మరణం!

  Last Updated: 12 Jun 2023, 01:18 PM IST