కోనసీమ జిల్లాలోని కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బుధవారం పర్యటించారు. పవన్ కళ్యాణ్ రాకతో జనం పోటెత్తడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అభిమానులు, పోలీసులు విసిగి వేసారిపోవడం కనిపించింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కు దగ్గరగా విధులు నిర్వహిస్తున్న పి. గన్నవరం సీఐ ప్రశాంత్ కుమార్ కు చెమటలు పట్టి కాస్త అలసటగా కనిపించారు. ఇది గమనించిన పవన్ కళ్యాణ్ సీఐ ప్రశాంత్ కుమార్ కు ఎనర్జీ డ్రింక్ ఇచ్చారు. దానిని తీసుకున్న సీఐ వెంటనే డ్రింక్ తాగి కాస్త ఉపశమనం పొందారు.
పవన్ కళ్యాణ్ ఓ పోలీసు అధికారికి డ్రింక్ అందిస్తున్న ఫోటో, వెంటనే ఆ పోలీస్ అధికారి డ్రింక్ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో హల్‌చల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ మానవత్వం సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతోంది.
Also Read: SI Attacks Woman: తన భార్యకు బస్సులో సీటు ఇవ్వలేదని మహిళను కొట్టిన ఎస్ఐ.. విచారణకు ఆదేశించిన ఎస్పీ
పవన్ కళ్యాణ్ మొదట అకాల వర్షానికి కడియపు లంకలో తీవ్రంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు జనసేన అధినేతకు తమ ఇబ్బందులను తెలిపారు. కల్లాలలోనే ధాన్యం మొలకెత్తి తీవ్రంగా నష్టపోయామని, ఈ మొలకెత్తిన ధాన్యం ప్రభుత్వం కొనే పరిస్థితి లేదని వాపోయారు. ఆ తరువాత అక్కడి నుంచి భారీ ర్యాలీగా రావులపాలెం చేరుకున్నారు. అక్కడి నుంచి కొత్తపేట మండలంలోని అవిడి ప్రాంతంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటపొలాలతోపాటు మొలకెత్తిన ధాన్యం రాశులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. అక్కడి నుంచి మళ్లీ పి.గన్నవరం చేరుకుని అక్కడ రాజుపాలెం ప్రాంతంలో రైతులతో మాట్లాడి దెబ్బతిన్న పంటను పరిశీలించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట పార్టీ ముఖ్య నాయకులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శెట్టిబత్తుల రాజబాబు, తదితరులు ఉన్నారు.