Site icon HashtagU Telugu

PK on Fuel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు హర్షణీయం… కేంద్ర మార్గాన్ని వైసీపీ ప్రభుత్వం అనుసరించాలి – ‘ పవన్ కళ్యాణ్’

Pawan Kalyan Telangana

Pawan Kalyan Telangana

రోజు రోజుకీ పెరుగుతున్న ధరల దాడికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు పెట్రోలు, డీజిల్ రేట్ల తగ్గింపు ఉపశమనం ఇస్తుందని భావిస్తున్నాను అని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పెట్రోలు, డీజిల్ మీద ఎక్సైజ్ సుంకం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వంలోని అధినాయకత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మనసారా ఆహ్వానిస్తున్నాను.

ఫలితంగా పెట్రోలు రూ.9.50 పైసలు, డీజిల్ రూ.7 వరకు తగ్గడం హర్షణీయం. నిత్యావసర ధరల పెరుగుదలకు ఇంధన రేట్లే కారణమన్న సంగతి తెలిసిందే. బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో నిత్యావసర వస్తువుల ధరలు కొంత వరకు తగ్గే అవకాశం ఉండడం అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలకు కొంత స్వాంతన కలిగిస్తుందని భావిస్తున్నాను. పీఎమ్ ఉజ్వల యోజన పథకంలో అందించే గ్యాస్ సిలిండర్లపై రూ.200 తగ్గించడం పేదవారికి ఆర్థికంగా మేలు చేకూరుస్తుంది.

కేంద్ర ప్రభుత్వ బాటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని కోరుతున్నాను. ఇంధన ధరలపై స్థానిక పన్నులు అన్ని రాష్ట్రాలలో కంటే ఆంధ్రప్రదేశ్ లోనే అధికంగా ఉన్నాయి. అసలే అస్తవ్యస్థమైపోయి ధ్వంసమైన రోడ్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయాణం భారంగా మారి వాహనాలు మరమ్మతులకులోనై అల్లాడిపోతున్నారు. పెట్రోలు, డీజిల్ కొనుగోలుపై రోడ్డు సెస్ పేరుతో ప్రజల నుంచి ఏటా రూ.600 కోట్లు వసూలు చేస్తోంది. అయినా రోడ్లను బాగు చేసే పరిప్థితి ప్రస్తుతం ఎలాగూ కనిపించడం లేదు. కనీసం పెట్రోలు, డీజిల్ పై స్థానిక పన్నులను తగ్గించి ఊరట కలిగించాలని ప్రజలు చేస్తున్న డిమాండును వైసీపీ సర్కారు నెరవేర్చాలని కోరుతున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్.