Kanaka Durga Temple : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తన కుమార్తె ఆద్యతో కలిసి ఈరోజు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. తొలుత ఆలయం వద్ద అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. పవన్‌తో పాటు హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. అంతకుముందు మరో మంత్రి నిమ్మల రామానాయుడు దుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. నేడు మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. పవన్ రాక సందర్భంగా ఆలయం వద్ద పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
Read Also: Rahul Gandhi : రాహుల్ గాంధీ పౌరసత్వం రద్దు పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టు విచారణ
కాగా.. ఉదయం 9 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరిన డిప్యూటీ సీఎం.. రోడ్డు మార్గంలో ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. ఇదిలా ఉంటే ఈ రోజు సీఎం చంద్రబాబునాయుడు కూడా అమ్మవారిని దర్శించుకోనున్నారు. కొద్ది సేపటి క్రితమే ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన చంద్రబాబు మధ్యాహ్నానికి విజయవాడ చేరుకోనున్నారు. అనంతరం 2 గంటల సమయంలో ఇంద్రకీలాద్రి చేరుకుని సరస్వతీ స్వరూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకోనున్నారు.