Pawan Kalyan: నర్సాపురం సభలో ‘జగన్’ పై ‘పవన్’ ఫైర్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మత్స్యకార అభ్యున్నతి సభలో ఆయన పాల్గొన్నారు.

  • Written By:
  • Updated On - February 20, 2022 / 09:00 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మత్స్యకార అభ్యున్నతి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వమే టార్గెట్ గా పవన్ నిప్పులు చెరిగారు. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసేలా వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన జీవో నెం. 217ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. బహిరంగ సభలో జీవో 217 ప్రతులను చింపి ఆయన నిరసన వ్యక్తం చేశారు. జీవో చింపినందుకు తనను జైలుకు పంపించినా సిద్ధమేనని స్పష్టం చేశారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం జనసేన అండగా ఉంటుందని హామీనిచ్చిన పవన్… తాను మాటల వ్యక్తిని కాదని, చేతల వ్యక్తినని అన్నారు. గంగవరంలో జెట్టీ పేరుతో మత్స్యకారులను నిరాశ్రయులను చేశారని జనసేనాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన అన్యాయానికి మత్స్యకారులు ఎదురొడ్డి పోరాడాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్.

మత్స్యకారుల సమస్యలను చాన్నాళ్లుగా వింటున్నానని తెలిపిన జనసేనాని…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 32 మత్స్యకార కులాలు, ఉపకులాలు ఉన్నాయని పేర్కొన్నారు. 65 నుంచి 70 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారని వెల్లడించారు. దోపిడీ చేసే చట్టాలను ఉల్లంఘించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ సర్కార్ జీవో 217తో లక్షలమంది పొట్టకొడుతుందని ధ్వజమెత్తారు.

మరబోట్లు రాకముందు సముద్రతీరం అంతా మత్స్యకారులదేనన్న పవన్… మరబోట్లు వచ్చాక మత్స్యకారులకు అనేక సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. లేని సమస్యను సృష్టించడంలో వైసీపీ నేతలు ఉద్ధండులని చెప్పారు. సమస్య పరిష్కారం పేరుతో మళ్లీ అనేక ఇబ్బందులు పెడతారని పవన్ గుర్తుచేశారు. మూడేళ్లలో 64 మత్స్యకార కుటుంబాలకే పరిహారం ఇచ్చారని చెప్పారు జనసేనాని. అమలుకాని హామీలు ఎందుకు ఇస్తున్నారని పాలకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు పవన్. చట్టాలు పాటించేలా ముందు వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలను నిలదీయాలని సూచించారు. గంగపుత్రులకు ఇల్లు కట్టుకునేందుకు గతంలో రూ.70 వేలు ఇచ్చేవారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. మత్స్యకారుల కష్టాలు తీరుద్దామనే యోచన వైసీపీ నేతలకు ఉందా అని పవన్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్య సమాజంలో ఫ్యూడల్ భావాలు ఉంటే ఎలా అన్న జనసేనాని… మీ పనులను సహనంతో భరిస్తున్నాం.. భయంతో కాదని జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇకపోతే, వైసీపీ నాయకుల బెదిరింపులకు జనసైనికులు భయపడరని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాను ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా కూడా… ఎంతో ఆలోచించి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. అక్రమ కేసులతో జనసేన కార్యకర్తలను హింసిస్తే…. తెగించి రోడ్డుపై నిలబడతానని హెచ్చరించారు.
మత్స్యకారుల కోసం జనసేన మేనిఫెస్టోలో ప్రత్యేక విధానాలు రూపొందిస్తామని పవన్ వెల్లడించారు. తనపై కేసులు పెట్టినా… భయపడే ప్రసక్తే లేదని, అవసరమైతే మత్స్యకారుల కోసం క్షేత్రస్థాయిలో పోరాటం చేసేందుకు సిద్దంగానే ఉన్నట్లు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు.