Janasena chief Pawan Kalyan: అజ్నాత `పొత్తుల‌` వాసి

జ‌న‌సేనాని, బీజేపీకి మ‌ధ్య ఏం జ‌రుగుతుంది? ఎందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు బీజేపీ దూరం పెడుతుంది? ఉద్దేశ పూర్వ‌కంగా జ‌న‌సేన పార్టీని టార్గెట్ చేస్తుందా?

  • Written By:
  • Updated On - August 9, 2022 / 04:49 PM IST

జ‌న‌సేనాని, బీజేపీకి మ‌ధ్య ఏం జ‌రుగుతుంది? ఎందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను బీజేపీ దూరం పెడుతుంది? ఉద్దేశ పూర్వ‌కంగా జ‌న‌సేన పార్టీని టార్గెట్ చేస్తుందా? విలీనం కోసం భారీ వ్యూహాన్ని ర‌చించిందా? పొత్తు అంటూనే అడుగ‌డుగునా ఎందుకు ప‌వ‌న్ ను అవ‌మాన ప‌రిచేలా బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోంది. `ఆజాదీ కా అమృత మ‌హోత్స‌వ్ `వేడుక‌ల‌కు క‌నీసం ఆహ్వానాన్ని కూడా ప‌వ‌న్ అందుకోలేక‌పోయారు. ఇదే ఏపీలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.ఏపీలో బీజేపీ, జ‌న‌సేన పొత్తు ఉంద‌ని ఆ రెండు పార్టీల నేత‌లు చెబుతుంటారు. రెండేళ్లుగా ఏ ఒక్క కార్య‌క్ర‌మంలోనూ ఆ రెండు పార్టీల‌ లీడ‌ర్లు ఒక వేదిక‌పై క‌నిపించ‌లేదు. ప‌లు సంద‌ర్బాల్లో ప‌వ‌న్ మాత్రం ఢిల్లీ బీజేపీతో పొత్తు ఉంద‌ని చెప్పిన విష‌యం విదిత‌మే. అంటే, ఏపీ, తెలంగాణ బీజేపీతో లేద‌ని అనుకోవాలా? అంటే దానిపై క్లారిటీ లేదు. తెలంగాణ బీజేపీ ఎప్పుడో జ‌న‌సేన పార్టీని దూరంగా పెట్టింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి కూడా జ‌నసేన పార్టీని రానివ్వ‌లేదు. తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ జ‌న‌సేన పార్టీతో క‌లిసి మాట్లాడేందుకు కూడా అయిష్టంగా ఉన్నారు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీని క‌లుపుకుని పోవ‌డానికి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ బండి స‌సేమిరా అంగీక‌రించలేదు. అదే ఒర‌వ‌డి నాగార్జున సాగ‌ర్‌, హుజూర్ న‌గ‌ర్‌, హుజూరాబాద్ ఎన్నిక‌ల్లోనూ కొన‌సాగింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీకి జ‌న‌సేన మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించింది. కానీ, గులాబీ నేత‌లు ఎక్క‌డా జ‌న‌సేన పార్టీని ప‌ట్టించుకోలేదు. అంటే, తెలంగాణ రాష్ట్రంలో జ‌న‌సేన పార్టీ ప‌రిస్థితి ఏమిటో అర్థం చేసుకోవ‌చ్చు.

ఏపీలోనూ బీజేపీ పార్టీ పెద్ద‌గా జ‌న‌సేన పార్టీని ప‌ట్టించుకోవ‌డంలేదు. తాజాగా అమ‌రావ‌తి రైతుల కోసం చేసిన బీజేపీ యాత్ర‌లోనూ జ‌నసైన్యం క‌నిపించ‌లేదు. అంత‌కు ముందు జ‌రిగిన బ‌ద్వేల్ , ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లోనూ ఆ రెండు పార్టీలు దూరంగా ఉన్నాయి. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీకి అవ‌మానం జ‌రిగిన‌ప్ప‌టికీ స‌ర్దుకొని క‌లిసి న‌డిచింది. అయిన‌ప్ప‌టికీ అక్క‌డ డిపాజిట్లు బీజేపీ, జ‌నసేన ఉమ్మ‌డి అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ‌కు ద‌క్క‌లేదు. దీంతో జ‌న‌సేన బ‌లం ఏమిటో బీజేపీకి అర్థం అయింది. ఆనాటి నుంచి పూర్తిగా దూరంగా పెడుతూ వ‌స్తోంది. తాజాగా భీమ‌వ‌రంలో జ‌రిగిన అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ప‌వ‌న్ కు అవ‌మానం జ‌రిగిన‌ట్టే. ఆహ్వానం అందింద‌ని ఆ పార్టీ చెబుతున్న‌ప్ప‌టికీ చిరంజీవి రూపంలో దానికి అర్థం లేకుండా పోయింది. రాష్ట్ర‌ప‌తి ముర్ముకు మ‌ద్ధ‌తు విష‌యంలోనూ జ‌న‌సేన పార్టీ ఉన్న‌ట్టు బీజేపీ భావించ‌లేదు. ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్న‌ప్ప‌టికీ ఆ విష‌యాన్ని బీజేపీ ప‌ట్టించుకోలేదు. ప్ర‌త్యేకంగా టీడీపీతో స‌మావేశం అయిన ముర్ము పొత్తులో ఉన్న జ‌న‌సేన పార్టీని ఏ మాత్రం గుర్తించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

`ఆజాదీ కా అమృత‌మ‌హోత్స‌వ్` వేడుక‌ల‌కు వివిధ పార్టీ చీఫ్ లు, సెల‌బ్రిటీలు, వివిధ రంగాల్లోని ప్ర‌ముఖుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఆహ్వానించింది. ఆశ్చ‌ర్య‌క‌రంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ కు ఎలాంటి ఆహ్వానం ల‌భించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీ సీఎం జ‌గ‌న్‌, ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుల‌కు ఆహ్వానం ల‌భించ‌డంతో పాటు ప్ర‌త్యేకంగా బాబుతో మోడీ ఏకాంతంగా మాట్లాడారు. ఒక‌రు లంచ్ మ‌రొక‌రు డిన్న‌ర్ కు. మోడీతో హాజ‌ర‌య్యారు. బీజేపీతో పొత్తుతో ఉన్న ప‌వ‌న్ ఆచూకి కూడా అక్క‌డ లేదు. అంటే, బీజేపీ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇస్తోన్న ప్రాధాన్య‌త ఏమిటో అర్థం అవుతోంది. అంతేకాదు, తొలి రోజుల్లో విలీనం కోసం జాతీయ పార్టీ ఒత్తిడి తీసుకొస్తుంద‌ని ప‌వ‌న్ చెప్పిన మాట‌ల‌ను గుర్తు చేసుకుంటే దూరానికి కార‌ణం అదేనా? అనే సందేహం క‌లుగుతోంది. ప్రస్తుతం జ‌న‌సేనా పార్టీకి గుర్తింపు లేదు. కేవ‌లం రిజిస్ట్రేష‌న్ అయిన పార్టీగా మాత్ర‌మే గుర్తిస్తున్నారు. తాజాగా ఎన్నిక‌ల క‌మిష‌న్ గ్లాసు గుర్తును ఉప ఎన్నిక‌ల్లో స్వ‌తంత్రుల‌కు కేటాయించింది. బీజేపీ అధిష్టానం ఎందుకు జ‌న‌సేన పార్టీని దూరంగా పెడుతుంది? అనేది కూడా ఎవ‌రికీ అర్థం కావ‌డంలేదు. ఆ క్ర‌మంలో రాబోవు రోజుల్లో బీజేపీ మ‌ద్ధ‌తు లేకుండా జ‌న‌సేన అడుగులు ఎలా ప‌డ‌తాయ‌న్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.