Janasena BJP Alliance in AP : జ‌న‌సేన‌కు దారేది!

బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరును ప్ర‌క‌టించ‌నున్నారా?

  • Written By:
  • Publish Date - March 12, 2022 / 12:30 PM IST

బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరును ప్ర‌క‌టించ‌నున్నారా? బీసీ నాయ‌కుల‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తారా? ఆ రెండు పార్టీల మ‌ధ్య ఏకాభిప్రాయం ఉందా? తెలుగుదేశం పార్టీతో జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటుందా? ఇలాంటి ఎన్నో అంశాలు జ‌న‌సేన పార్టీ చుట్టూ తిరుగుతున్నాయి. ఈనెల 14వ తేదీన ఆవిర్భావ స‌భ‌లో ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు రానున్నాయ‌ని అభిమానులు ఆస‌క్తిగా చూస్తున్నారు.ఏపీ పోలీసుల‌ నుంచి ఎట్టకేల‌కు ఆవిర్భావ వేడుక‌ల‌కు జ‌న‌సేన అనుమ‌తి పొందింది. మంగ‌ళ‌గిరి ప‌రిధిలోని ఇప్ప‌టం గ్రామ పొలాల్లో పార్టీ వేడుక‌లు జ‌రుపుకోవ‌డానికి ఏర్పాట్ల‌ను చేస్తోంది. ఆ పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ఏర్పాట్ల‌ను చూస్తున్నాడు. ఆవిర్భావ వేడుక‌ల పోస్ట‌ర్ ను నాదెండ్ల ఆవిష్క‌రించాడు. గుబురు గ‌డ్డంతో కార్య‌క‌ర్త‌ల‌ను నుద్దేశించి మాట్లాడే ప‌వ‌న్ ఫోటోతో ఉన్న పోస్ట‌ర్ ఫ్యాన్స్ ను అల‌రిస్తోంది. ఈ వేడుక‌ల ద్వారా రాబోవు ఎన్నిక‌లకు ప‌వ‌న్ దిశానిర్దేశం చేసే అవ‌కాశం ఉంది. అందుకే, మునుప‌టి వేడుక‌ల కంటే ఈసారి భిన్నంగా `బీమ్లానాయ‌క్ ` ప్ర‌సంగం ఉంటుంద‌ని క్యాడ‌ర్ భావిస్తోంది.రాజ్యాధికారం కోసం పొత్తు ఎత్తుగ‌డ‌లు చాలా ముఖ్యం. ఆ దిశ‌గా 2019 ఎన్నిక‌ల్లోనూ ప‌వ‌న్ న‌డిచాడు. వామ‌ప‌క్షాలు, బీఎస్పీతో పొత్తుపెట్టుకుని ఆ ఎన్నిక‌ల‌కు వెళ్లాడు. చేగువీరా, కాన్షీరాం భావ‌జాలాన్ని 2019 ఎన్నిక‌ల్లో బ‌లంగా వినిపించాడు. కానీ, ఆయ‌న రెండు చోట్ల‌ ఓడిపోవ‌డంతో పాటు చాలా చోట్ల డిపాజిట్లు జ‌న‌సేన‌కు ద‌క్క‌లేదు. జ‌న‌సేన కూట‌మి సుమారు 4శాతం ఓట్లతో స‌రిపెట్టుకుంది. వెంట‌నే వ్యూహాన్ని మార్చుకున్న ప‌వ‌న్ నేరుగా ఢిల్లీ వెళ్లి అదే ఏడాది బీజేపీతో జ‌త‌క‌ట్టాడు. హిందూధ‌ర్మం కోసం, హిందువుల ప‌క్షాన ఉంటానంటూ ఒక్క‌సారిగా లెఫ్ట్ నుంచి రైట్‌కు మ‌ళ్లాడు. గ‌త మూడేళ్లుగా బీజేపీ భావ‌జాలం వెంట న‌డుస్తున్నాడు. కానీ, బీజేపీ మాత్రం ఆయ‌న‌కు ఇస్తోన్న ప్రాధాన్య‌త నామ‌మాత్ర‌మే.

తిరుప‌తి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో సంప్ర‌దింపులు జ‌ర‌ప‌కుండానే ర‌త్న‌ప్ర‌భ‌ను అభ్య‌ర్థిగా బీజేపీ ప్ర‌క‌టించింది. బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ధ‌తు ఇవ్వ‌డానికి జ‌న‌సేన నిరాక‌రించింది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీతో చాలా చోట్ల పొత్తు పెట్టుకుని జ‌నసేన వెళ్లింది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌ను తెలంగాణ బీజేపీ దూరంగా పెట్టింది. హుజూర్ న‌గ‌ర్‌, నాగార్జున సాగ‌ర్ , హుజూరాబాద్‌ ఎన్నిక‌ల్లో బీజేపీకి దూరంగా జ‌న‌సేన ఉంది. హైద‌రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అడ‌గ‌కుండానే జ‌న‌సేన మ‌ద్ధ‌తు ఇచ్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ చేస్తోన్న కార్య‌క్ర‌మాల‌కు జ‌న‌సేన దూరంగా ఉంటుంది. ఎవరికి వారే ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల‌పై ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఒకే వేదిక‌పై నుంచి బీజేపీ, జ‌న‌సేన చేసిన కార్య‌క్ర‌మాలు ఏపీలో చాలా త‌క్కువ‌. తెలంగాణ‌లో ఉమ్మ‌డిగా చేసిన ప్రోగ్రామ్ లు మ‌చ్చుకు కూడా క‌నిపించ‌వు.ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోమువీర్రాజు మాత్రం బీజేపీ, జ‌న‌సేన ఉమ్మ‌డి సీఎం అభ్య‌ర్థి ప‌వ‌న్ అంటూ తిరుప‌తి ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా ప్ర‌క‌టించాడు. ఆ త‌రువాత బీజేపీ అధికారంలోకి వ‌స్తే బీసీల‌ను సీఎం చేస్తుంద‌ని వెల్ల‌డించాడు.ఆ రెండు స్టేట్ మెంట్ల‌లో ఏది నిజ‌మో ఎవ‌రికీ తెలియ‌డంలేదు. ప‌లుమార్లు ఢిల్లీ వెళ్లిన ప‌వ‌న్ కు మోడీ, అమిత్ షా అపాయిట్మెంట్ లు ల‌భించ‌లేదు. కేవ‌లం బీజేపీ అధ్య‌క్షుడు న‌డ్డాను మాత్రం క‌లుసుకుని వెనుతిరిగిన సంద‌ర్భాలు అనేకం. పార్టీ విలీనం కోసం ఒక జాతీయ పార్టీ ఒత్తిడి తీసుకొస్తుంద‌ని క్యాడ‌ర్ కు ఒకానొక సంద‌ర్భంలో ప‌వ‌న్ సంకేతం ఇచ్చిన సంద‌ర్భాన్ని విన్నాం. ఇలాంటి ప‌రిస్థితుల న‌డుమ ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీకి జ‌న‌సేన ద‌గ్గ‌ర‌గా నడుస్తోంది. ఆ రెండు పార్టీల ఉమ్మ‌డి శ‌త్రువుగా జ‌గ‌న్ మారాడు. ఆ శ‌తృత్వం సినిమా టిక్కెట్ల ధ‌రల‌ త‌గ్గింపు త‌రువాత మ‌రింత పెరిగింది.


ఉమ్మ‌డి శ‌త్రువు జ‌గ‌న్ ను ఎదుర్కోవ‌డానికి టీడీపీ, జ‌న‌సేన పొత్తు పెట్టుకునే అవ‌కాశం ఉంద‌ని ఇటీవ‌ల బాహాటంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. వ‌న్‌ సైడ్ ల‌వ్ గురించి చంద్ర‌బాబు ప్ర‌స్తావించాడు. జ‌న‌సేన‌తో పొత్తుకు సానుకూలంగా ప‌లువురు టీడీపీ లీడ‌ర్లు స్పందించారు. టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన ఆఫీస్ కు వెళ్లాడు. ఇలాంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన ఏపీ బీజేపీ ఇటీవ‌ల జ‌న‌సేన‌ను లైట్ గా తీసుకుంది. బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య క‌టీఫ్ అంటూ ప్రచారం జ‌రిగింది. కానీ, ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత బీజేపీని వ‌దులుకుని జ‌న‌సేన వెళ్ల‌డానికి ఉండే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయి. స‌హజ మిత్రునిగా ఉన్న జ‌గ‌న్ ను శ‌త్రువుగా బీజేపీ భావించే ప‌రిస్థితి లేదు. ఇలాంటి ఈక్వేష‌న్స్ న‌డుమ‌ జ‌న‌సేన 2019 ఎన్నిక‌ల త‌ర‌హాలో బీఎస్పీకి బ‌దులుగా ఆప్ తో పొత్తు పెట్టుకునే అంశంపై చ‌ర్చిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆప్‌, టీడీపీ, జ‌న‌సేన పొత్తు హిట్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు జ‌న‌సేన అభిమానులు లెక్కిస్తున్నార‌ట‌. ఒక‌ప్పుడు ఆప్ పొత్తు కోసం లోక్ స‌త్తా ప్ర‌య‌త్నం చేసిన విఫ‌లం అయింది. ఇప్పుడు జ‌నసేన ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఆప్ అధినేత కేజ్రీవాల్ పొత్తుకు సై అనే ఛాన్స్ త‌క్కువ‌. ఒంటిరిగా వెళ్ల‌డానికి ఎక్కువ‌గా కేజ్రీ ప్లానింగ్ ఉంటుంది. లేదంటే భావ‌సారూప్య‌త ఉన్న చిన్న పార్టీల‌తో పొత్తు పెట్టుకుంటాడు. జ‌న‌సేన 2019లో చేగువీరా, కాన్షీరాం భావ‌జాలంను న‌మ్ముకుంది. ఇప్పుడు మోడీ భావ‌జాలం ఆ పార్టీని న‌డిపిస్తోంది. ఇది, ఆప్ భావ‌జాలానికి పూర్తి విరుద్ధమైన‌ది. సో..తెలుగుదేశం మిన‌హా జ‌నసేన పొత్తును ప్రేమిస్తోన్న పార్టీలు దాదాపుగా లేవని చెప్పొచ్చు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఈనెల 14న ప‌వ‌న్ ఎలాంటి దిశానిర్దేశం చేస్తాడో చూద్దాం.!