PK Reaction: ఉద్యోగులకు పవన్ అండ

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్

  • Written By:
  • Updated On - February 4, 2022 / 02:15 PM IST

ఉద్యోగుల పీఆర్సీ పై ఎట్టకేలకు జనసేనని పవన్ స్పందించాడు. రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెప్పడంతో ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదని ప్రకటన చేసాడు. ఒక ఉద్యోగి కుమారునిగా ఉద్యోగుల బాధలు తెలుసని..న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన విడుదల చేసిన ప్రకటన ఇది..

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ విధానం రద్దు చేస్తాం… ఏ ప్రభుత్వం చేయని విధంగా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చిన వైసీపీ ఇప్పుడు మాట తప్పింది. ఆనాడు ఉద్యోగులకు హామీ ఇచ్చిన నాయకులు ఈనాడు మాట మార్చడం సబబు కాదు. అధికారంలోకి రావడానికి ఒక మాట, అధికారంలోకి వచ్చాకా మరో మాట మాట్లాడం మోసపూరిత చర్యగానే జనసేన భావిస్తోంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెరగాలి, కానీ అందుకు విరుద్దంగా జీతాలు తగ్గించడం ఉద్యోగులను వంచనకు గురి చేయడమే. మండుటెండలో నిలబడి లక్షలాది మంది ఉద్యోగులు నిరసన తెలపడం చాలా బాధ కలిగించింది. ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసిన పాపానికి వందల మందిని అరెస్టులు చేయడం, లాఠీ చార్జ్ చేయడం దురదృష్టకరం. ప్రతి ఉద్యోగీ పి.ఆర్.సి. ద్వారా జీతం పెరుగుతుందని భావిస్తారు. అందుకు అనుగుణంగా పిల్లల చదువుల ఖర్చు, ఇతర ఖర్చులకు ఒక బడ్జెట్ వేసుకుంటారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఉద్యోగుల బాధలు తెలుసు. ఈ రోజున వైసీపీ నాయకుల ఆదాయం మూడు రెట్లు పెరిగితే, ఉద్యోగుల జీతాలు 30 శాతం తగ్గాయి. అధికారంలోకి వచ్చేందుకు సిపిఎస్ రద్దు చేస్తాం, జీతాలు పెంచుతాము అన్నారు. ఇప్పుడు అడిగితే అప్పుడు తగిన అవగాహన లేకుండా చెప్పాం అని అంటున్నారు. ఇది కచ్చితంగా ఉద్యోగులను మోసపుచ్చడమే.
• ఉద్యోగులను చర్చల పేరుతో అవమానించారు
వివిధ శ్లాబులుగా ఉన్న హెచ్ఆర్ఏను రెండు శ్లాబులకు కుదించడం వల్లే ఒక్కొక్కరికీ రూ.5 వేలు నుంచి రూ. 8 వేలు వరకు జీతం తగ్గిందని ఉద్యోగులు చెబుతున్నారు. దీనిపై ఉద్యోగులు పలుసార్లు విన్నవించుకున్నారు. సంబంధిత మంత్రులు కానీ, అధికారులు కానీ పట్టించుకోకపోవడం, చర్చలకు పిలిచి అర్ధరాత్రి వరకు వెయిట్ చేయించడం, అవమానించేలా మాట్లాడం వల్లే ఈ రోజు లక్షలాది మంది ఉద్యోగులు రోడ్లు మీదకు వచ్చారు. ఉద్యోగులను చర్చల పేరుతో పిలిచి అవమానించారు. ఉద్యోగుల నిరసనకు కారణం ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే.
ఒక ప్రభుత్వ ఉద్యోగి కుమారుడిగా ఉద్యోగుల కష్టాలు నాకు బాగా తెలుసు. దీని గురించి ముందే స్పందిద్దామని అనుకున్నాను కానీ, ప్రభుత్వంతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నాయకులు వేరే రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయదలుచుకోలేదని చెప్పడంతో ఒక అడుగు వెనక్కి తగ్గాను. ఉద్యోగులు అడిగినప్పుడు మాత్రం కచ్చితంగా మద్దతు ఇవ్వాలని మా పార్టీ నాయకులకు కూడా చెప్పాను. జనసేన నాయకులకు, శ్రేణులకు, జన సైనికులకు కూడా చెబుతున్నాం… ఉద్యోగులకు మద్దతుగా ఉండాలని.

సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలి

వైసీపీ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఉద్యోగులు, ఎన్.జి.ఓ.లు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు తమ డిమాండ్ల కోసం సమ్మెకు సన్నద్ధం అవుతున్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం సుహృద్భావ వాతావరణంలో చర్చలు చేపట్టాలి. ఉద్యోగులను అవమానించేలా, రెచ్చెగొట్టేలా మాట్లాడకూడదు. వారి న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలి. ఉద్యోగుల నిరసనకు జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది.