Site icon HashtagU Telugu

PK On Budget: ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసే ప్రయత్నం – పవన్ కళ్యాణ్…!!

ఉత్పాదక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశ ప్రగతిని ముందుకు తీసుకువెళ్లే విధంగా కేంద్ర బడ్జెటును బి.జె.పి. ప్రభుత్వం రూపకల్పన చేయడం ఆశావహ పరిణామం. అయితే ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు, పోలవరం ప్రాజెక్ట్ వంటి అంశాలు చోటుచేసుకోకపోవడం కొంత నిరాశను కలిగించింది. అయితే అభివృద్ధి చెందిన దేశాలతో మన భారతదేశం పోటీ పడే విధంగా ఒక గొప్ప దార్శనికతను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోందని చెప్పడం అతిశయోక్తి కాదు. దీనికి కారణం కాలానుగుణంగా మారుతున్న సాంకేతికతను దేశంలో ప్రవేశపెట్టడానికి సంకల్పించిన ప్రయత్నాలు మంచి ఫలితాన్ని అందిస్తాయని జనసేన భావిస్తోంది. ప్రధానమంత్రి గతిశక్తి బహుళార్ధక పధకం దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇచ్చే విధంగా ఉంది. ముఖ్యంగా డిజిటల్ కరెన్సీ, డిజిటల్ బ్యాంకింగ్ కారణంగా వ్యాపార వ్యవహారాలు, నగదు లావాదేవీల్లో పారదర్శకత పెరిగి అవకతవకలు తగ్గే అవకాశం ఉంది. డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు కారణంగా దేశ సాంకేతిక అవసరాలు తీర్చగల మంచి ప్రమాణాలు కలిగిన టెక్కీలు రూపొందుతారు. ప్రాంతీయ భాషలలో విద్య బోధన కోసం 200 టి.వి.చానళ్ళు ప్రారంభించడానికి సంకల్పించడం ప్రాంతీయ భాషలలో విద్యార్జన చేయాలనుకునే వారికి మేలు కలిగిస్తుంది. రక్షణ రంగం బడ్జెట్ 12% పెంచడం మన దేశ భద్రతరీత్యా అవసరమే. రక్షణ ఉత్పత్తుల్లో మనం స్వావలంబన సాధించే విధంగా ప్రణాళికలు సిద్ధపరచడం ముదావహం.
గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఎన్నో కష్టనష్టాలు చవిచూస్తున్నాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా కాపాడిన వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వడం రైతన్నలకు భరోసా కల్పించడంగా జనసేన భావిస్తోంది. ఆధునిక వ్యవసాయం దిశగా వేసే అడుగుల వేగం పెరిగిందని అవగతమవుతోంది. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు, అద్దె ప్రాతిపదికన రైతులకు వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను అందించడం, వ్యవసాయ స్టార్టప్ లకు ప్రోత్సాహకాలు వంటివి వ్యవసాయ రంగానికి..

తద్వారా రైతులకు ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. అయితే 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని గత బడ్జెట్లో ప్రకటించిన ప్రభుత్వం ఆ హామీకి ఎంత చేరువ అయ్యారో ఈ బడ్జెట్లో ప్రస్తావించి ఉంటే బేరీజు వేసుకోడానికి వీలుండేది. సేంద్రీయ ప్రకృతి సేద్యానికి ప్రాధ్యానం ఇవ్వడం శుభ పరిణామం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవుల పెంపకం గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావించిన విషయాలు ప్రయోజనకరమైనవే. పర్వతమాల ప్రాజెక్ట్ ద్వారా పర్వత ప్రాంతాలలో పర్యావరణహితమైన అభివృద్ది దిశగా చేపట్టే కార్యక్రమాలు, పర్యాటక రంగం కోసం ఎనిమిది రోప్ వేల నిర్మాణం మంచి ఆలోచన. తద్వారా గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
ప్రజలకు వ్యక్తిగత ప్రయోజనాలు ఈ బడ్జెట్లో లేనప్పటికీ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కావాలని జనసేన కోరుకుంటోంది. ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు కొత్తగా కల్పిచాలని ఈ బడ్జెట్లో పేర్కొనడాన్ని జనసేన స్వాగతిస్తోంది. అదేవిధంగా రాష్ట్రాలకు లక్ష కోట్ల రూపాయలతో నిధి, అదేవిధంగా 50 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా లక్ష కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్రాలు తీసుకునే అవకాశం రాష్ట్రాలకు మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉంటుంది.
ప్రజలపై కొత్తగా పన్నుల భారం వేయకుండా బడ్జెటును రూపొందించిన గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని బి.జె.పి.ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఆర్ధిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని జనసేన పార్టీ అభినందిస్తోంది.
అయితే ఆదాయపు పన్ను పరిమితిని ఈసారి బడ్జెట్లో పెంచుతారని ఎదురుచూసిన ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక కేటాయింపులు చేసి ఉంటే బాగుండేదని జనసేన భావిస్తోంది.

Exit mobile version