Pawan Kalyan: టీడీపీతో పొత్తుకు సిద్ధమే.. ఈసారి వాళ్లే ఒక మెట్టు దిగాలి : పవన్ కళ్యాణ్

  • Written By:
  • Publish Date - June 6, 2022 / 01:35 PM IST

వచ్చే ఎన్నికల్లో అవసరమైతే టీడీపీతో పొత్తుకు సిద్ధమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఇది వన్ సైడ్ లవ్ లా ఉండకూడదని , టీడీపీ కూడా ఒక మెట్టు దిగి రావాలని సూచించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కొన్ని మెట్లు దిగామని ఆయన గుర్తుచేశారు.

మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పొత్తులపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో తమ పార్టీ ఎదుట మూడు ఆప్షన్లు ఉన్నాయన్నారు. “మొదటిది జనసేన, బీజేపీ పొత్తు.. రెండోది జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు.. మూడోది జనసేన ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం అనే మార్గాలు ఉన్నాయి.

భవిష్యత్ సమీకరణాలను బట్టి వీటిలో ఏ ఆప్షన్ ను ఎంచుకోవాలి అనేది నిర్ణయం అవుతుంది. ఇక డిసైడ్ చేసుకోవాల్సింది టీడీపీ, బీజేపీలే” అని పవన్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీని గద్దె దించేందుకు తాము ఇప్పటికే బీజేపీతో కలిసి పనిచేస్తున్నామని, టీడీపీ కూడా తమతో కలవాలని కోరారు. పొత్తుల గురించి పెద్దగా పట్టించుకోకుండా ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

బీజేపీ తో పొత్తు ఉన్నప్పటికీ.. కొంత గ్యాప్ ఏర్పడిన మాట నిజమేనని పవన్ ఒప్పుకున్నారు. కరోనా కారణంగా ఇరు పార్టీలు కలిసి సంయుక్త కార్యక్రమాలు నిర్వహించ లేకపోయామని చెప్పారు. సోమవారం రాజమండ్రి లో బీజేపీ నిర్వహించనున్న “గోదావరి గర్జన” కార్యక్రమం గురించి తనకు సమాచారం లేదన్నారు. ఆ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా పాల్గొంటారని కూడా తనకు తెలియదన్నారు.

మరోవైపు పవన్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు. జనసేన తో బీజేపీ పొత్తు కొనసాగుతుందని చెప్పారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందిస్తూ.. పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పార్టీ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.