తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం (Tirumala Laddu Issue) ఫై సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గత రెండు వారాలుగా తిరుమల లడ్డు వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం లడ్డు కల్తీ ఫై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీ జరిగినట్టు తేలిన నెయ్యి ట్యాంకర్‌ను అనుమతించలేదని టీటీడీ చెబుతోందని, కానీ ఏపీ సీఎం (AP CM Chandrababu Naidu) చేసిన ప్రకటన దీనికి భిన్నంగా ఉండడం ఏంటని ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా సీఎం ఎలా ప్రకటన చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే విచారణ కోసం సిట్‌ని ఏర్పాటు చేసిన తరువాత కూడా సీఎం మీడియా ముందు ప్రకటనలు ఎందుకు చేశారని నిలదీసింది. ”ప్రాథమిక స్థాయిలో నాణ్యత పరీక్షలు (Quality Tests) పాస్ కాకపోతే ట్యాంకర్ లోపలికి అనుమతించబోమని టీటీడీ చెబుతోంది. అయితే కల్తీ జరిగిందని చెబుతున్న శాంపిళ్లను ఎక్కడ నుంచి సేకరించారు..? తిరస్కరించిన ట్యాంకర్ నుంచి సేకరించారా..? నెయ్యి కల్తీ జరిగినట్లైనా ఆధారాలు చూపించండి. అసలు కల్తీ జరిగిన నెయ్యిని లడ్డూ తయారీకి ఉపయోగించినట్టు ఎలా తెలిసింది? నెయ్యిని ల్యాబ్‌కి ఎప్పుడు టెస్ట్‌లకు పంపారు? అన్నింటికంటే ముఖ్యంగా తయారైన లడ్డూలను టెస్టింగ్ (Testing)కి పంపారా..? లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా..?” అని సూటిగా ప్రశ్నించింది. అలాగే ఈ కేసులో రాజకీయ జోక్యం (Political Interfearance)పై కూడా అత్యున్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ” కల్తీ జరగలేదని వారెప్పుడూ (సుప్రీంకోర్టు) చెప్పలేదు. వాళ్ల ముందున్న సమాచారం ఆధారంగా ఆ వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నా. కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చెప్పలేదు కదా. తేదీ విషయంలో మాత్రమే కాస్త కన్ఫ్యూజన్ ఉందని అన్నారు. అయితే ప్రసాదం విషయంలో మాత్రమే కాదు.. గత ఐదేళ్లలో ఇలాంటి ఉల్లంఘనలు చాలా జరిగాయి. మా ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటుంది. గత 5- 6 ఏళ్లుగా ఏదో ఒక అపవిత్రం జరుగుతోంది. దాదాపు 219 ఆలయాలను అపవిత్రం చేశారు. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇది కేవలం ఒక ప్రసాదం గురించి కాదు.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ముందుకు తీసుకువెళ్లాలనే ఈ ప్రాయశ్చిత్త దీక్ష. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు చాలా అవసరం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. నేను ఈ దీక్షను పూర్తి చేసిన తర్వాత, రేపు దీనిపై డిక్లరేషన్ చేస్తాం” అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తిరుమలకు వెళ్తున్నారు. ఆయన చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష రేపటితో ముగుస్తుంది. ఈ క్రమంలో పవన్ తిరుమలకు వెళ్లి అక్కడ దీక్ష విరమించి..శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Read Also : Vanitha Vijayakumar : నాల్గో పెళ్లికి సిద్దమైన ప్రముఖ నటి..