PK: అవకాశం ఇవ్వండి… కోట్లమంది కన్నీరు తుడుస్తా – ‘పవన్ కళ్యాణ్’..!

‘రాయలసీమను రతనాలసీమ అనేవారు. సిరులు కురిపించిన నేల అని పిలిచేవారు.

  • Written By:
  • Publish Date - May 9, 2022 / 10:45 AM IST

‘రాయలసీమను రతనాలసీమ అనేవారు. సిరులు కురిపించిన నేల అని పిలిచేవారు. ప్రస్తుత పరిస్థితులు, రాష్ట్రంలోనే అత్యధికంగా కౌలు రైతుల ఆత్మహత్యలు ఇక్కడ చూస్తుంటే బాధేస్తుంది. గుండె తరుక్కుపోతోంది. 18 లక్షల ఎకరాలకు తాగునీరు ఇచ్చే సిద్దేశ్వరం – అలుగు ప్రాజెక్టును ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారు. 70 ఏళ్లుగా ఇక్కడి రైతాంగం కల అది.

నాయకుల తీరుతో విసిగి, వేసారి 2016లో రైతులే ప్రాజెక్ట్ ప్రారంభించినా, దానిని పూర్తి చేయడంలో రాయలసీమవాసులకు అండగా నిలబడటంలో మాత్రం ఏ ప్రభుత్వాలు శ్రద్ధ చూపించలేకపోయాయి. మీరు ఐదు సంవత్సరాలపాటు మాకు అవకాశం ఇవ్వండి. జనసేనకు అండగా నిలబడండి. కచ్చితంగా రాయలసీమను రతనాలసీమ చేసే బాధ్యత నాది.. సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతాంగానికి భరోసా ఇచ్చారు.

జనసేన చేపట్టిన కౌలు రైతుల భరోసా యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లా శిరివెళ్లలో ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. మొదట ఆత్మహత్య చేసుకున్న 128 మంది కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున సాయం చెక్కులు అందించారు. కౌలు రైతుల కుటుంబ కష్టాలను, బాధలను అడిగి తెలుసుకున్నారు. రచ్చబండ ప్రారంభానికి ముందు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య గారి వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించారు.

రచ్చబండ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “రాయలసీమ నుంచి ఎంతోమంది గొప్ప నాయకులు వచ్చారు. ముఖ్యమంత్రిలాంటి అత్యున్నత పదవులు పొందారు. కానీ రాయలసీమ స్వరూపం మాత్రం ఏమాత్రం మారలేదు. నాయకులు బలపడ్డారు తప్పితే ప్రజల జీవితాల్లో ఏ మాత్రం మార్పు లేదు. వారికి అవసరమైతే అద్భుతమైన రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. ప్రజల అవసరాలు మాత్రం ఏ మాత్రం పట్టించుకోరు. ఈ కారణం చేతనే రాయలసీమ వెనకబడిపోయింది. వచ్చే తరంలో ఆలోచన రావాలి. యువతరం ఆలోచించాలి.. మా ప్రాంతం ఎందుకు వెనుకబడిపోయింది అని ప్రశ్నించుకోవాలి. జనసేన పార్టీకి అండగా నిలబడండి. రైతులకు, యువతకు మేం భరోసాతో కూడిన ప్రభుత్వాన్ని అందిస్తాం. నిజాయతీ గల ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిస్తాం.. మీ మద్దతు తో దానిని స్థాపిస్తాం.

రెండు నెలల్లో 25 మంది ఆత్మహత్య:
కరోనా లాక్ డౌన్ కాలంలో రెండు నెలల వ్యవధిలోనే 25 మంది కౌలు రైతులు చనిపోయినట్లు నేను చూసిన వార్తలు నన్ను ఎంతో కదిలించాయి. వారికి ఏదో ఒకటి చేయాలని నా మనసులో బలంగా అనుకున్న. ఫలితంగానే నాకున్న కొద్దిపాటి నిధులు, వనరులతో ఈ మహా ప్రయాణానికి చిన్న అడుగు వేశాను. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆలోచించకుండా శ్రీ దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తితో కౌలు రైతుల కుటుంబాలకు నా వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయాన్ని మెడలు వంచి పొందేలా పోరాటం చేయాలని భావించాను. ఈ ఆలోచనల నుంచి వచ్చినదే కౌలు రైతుల భరోసా యాత్ర అని అన్నారు పవన్.

రూ.7 లక్షలు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు:
ఎన్.జి.రంగా, అల్లూరి సుబ్బారెడ్డి, రామిరెడ్డి, కుప్పుస్వామి లాంటి రైతాంగ ఉద్యమాలు నడిపిన నాయకులు ఉన్న గొప్ప నేలలో జరుగుతున్న ఆత్మహత్యలు కలిచి వేస్తున్నాయి. నంద్యాల ఆర్.ఎస్.ఆర్.ఏ.కి చెందిన 100 ఎకరాల అద్భుతమైన నేల కబ్జా అవుతుంటే దానిని సమర్ధంగా తిప్పికొట్టి న్యాయపోరాటం చేసిన కర్నూలు జిల్లా రైతుల చైతన్యం గొప్పది. రైతు కన్నీరు ఏ ప్రభుత్వానికి మంచిది కాదు. దీనిని గుర్తుంచుకోవాలి. ఒక రాజకీయ పార్టీని నడిపిస్తున్న నేనే కార్యకర్తల కోసం రూ.ఐదు లక్షల ప్రమాద బీమా చేయించి ఇస్తుంటే, ఈ ప్రభుత్వానికి కౌలు రైతులకు రూ.ఏడు లక్షలు ఇవ్వడానికి చేతులు రావడం లేదు. తమకు కావలసిన వారికి కొంత మొత్తం ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. చావు మీద రాజకీయం చేసే మనస్తత్వం నాది కాదు. అధికారం కోసం అర్రులు చాచను. సామాజిక, రాజకీయ అసమానతలు లేకుండా రైతులందరికీ న్యాయం జరగాలి అన్నదే నా అభిలాష. అమ్మ పెట్టా పెట్టదు… అడుక్కు తిననివ్వదు అన్నట్లు రైతు భరోసా యాత్ర లో ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు మాకు తోచినంత సాయం చేయాలని మేం భావిస్తే, బాధితులను సైతం వైసిపి గ్రామ,మండల, నియోజకవర్గ నాయకులు బెదిరింపులకు పాల్పడటం సిగ్గుచేటు. వైసిపి నాయకులు ఎన్ని ఆటంకాలు కలిగించినా మేం కౌలు రైతులను ఆదుకునేందుకు కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా కౌలు రైతుల భరోసా యాత్రను రాష్ట్రవ్యాప్తంగా పూర్తి చేస్తాం.

రాష్ట్రంలో రైతులకు అన్ని సమస్యలే:
రైతు భరోసా డబ్బులు ఇస్తున్నామని ప్రకటనలు తప్పితే రైతులకు సంబంధించిన సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వం ఆలోచించడం లేదు. నకిలీ విత్తనాలు, ఎరువులు వల్ల రైతులుకు దిగుబడి రావడం లేదు. దిగుబడి వచ్చినా దానికి సరైన గిట్టుబాటు ధర లేదు. ఎలాగోలా పండించిన పంటను ప్రభుత్వానికి అమ్మినా సకాలంలో డబ్బులు వస్తాయనే నమ్మకం లేదు. కర్నూలు మసూరి బియ్యం అంటే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. ఈ బియ్యానికి మద్దతు ద్వారా రూ.18వందలు వస్తే రైతుకు గిట్టుబాటు అవుతుంది. అయితే ప్రభుత్వం కేవలం రూ.900 మాత్రమే ఇస్తుంది. మార్కెట్ యార్డుల్లో, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారీ వ్యవస్థ పేరుకుపోయింది. సరైన ధర రానివ్వరు.. రైతులు బయట అమ్ముకొనివ్వరు. ఇన్ని సమస్యల నడుమ సతమతమవుతున్న రైతు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మార్కెట్ యార్డుల్లో దళారీ వ్యవస్థను జనసేన ప్రతిఘటిస్తుంది. ప్రభుత్వాన్ని స్థాపించిన వెంటనే ఆత్మ హత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల బాధ్యతను ప్రభుత్వం తరఫున తీసుకుంటాం. వారికి అండగా నిలబడే ఖచ్చితమైన నిర్ణయం ఉంటుంది.

వైసీపీ మాట తప్పడంపై ప్రశ్నిస్తున్నాం:
కర్నూలు జిల్లాలోని కొణిదెల గ్రామం ఇంటిపేరుగా ఉన్న వ్యక్తిని. మీరు నా ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టినా, రోజుకు ఒకరితో కావాలని బూతులు తిట్టించినా, మానసిక అత్యాచారాలకు పాల్పడినా నా పోరాట పంథాలో ఎలాంటి మార్పు ఉండదు. పోరాట స్ఫూర్తిని నిలువెల్లా నింపుకొన్న వ్యక్తిని. వైసీపీ ప్రభుత్వం మీద మాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు. కేవలం మీ పాలసీలు, మీరు తీసుకునే నిర్ణయాలు, మాట తప్పుతున్న అంశాల మీదనే మేం మాట్లాడతాం. వాటినే ప్రశ్నిస్తాం. కౌలు రైతుల విషయంలో మాట మార్చారు. అలాగే మద్య నిషేధ విషయంలోనూ మాట మార్చారు. మద్యం నిషేధిస్తాం అని చెప్పి విచ్చలవిడిగా మద్యం అమ్మిస్తున్నారు. వీటి గురించి మాట్లాడిన ప్రశ్నించినా మీరు సమాధానం చెప్పకుండా బూతులు తిట్టిస్తారు. ఇది మాత్రమే మీకు తెలిసిన విద్య. దీనిని ప్రజలు గమనిస్తున్నారు. ఇదే పంథా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో మీకు 15 సీట్లు కూడా వచ్చే అవకాశమే లేదు. గుర్తు ఉంచుకోండి.

బాధ్యతగలవాళ్లు మాట్లాడే మాటలేనా?… తల్లి పెంపకమే తప్పు అంటారా?:
రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతోంది. రోజుకో అత్యాచార ఘటనలు మనసును బాధ పెడుతున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఆడ పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పి పరిస్థితి వచ్చింది. వీటిపై దృష్టి నిలిపి, శాంతిభద్రతలను అదుపులోకి తీసుకు రావాల్సిన ప్రభుత్వం బాధితులకు అండగా నిలబడాల్సిన ప్రజాప్రతినిధులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. తల్లి పెంపకం బాగా లేకుంటేనే అఘాయిత్యాలు జరుగుతాయని బాధ్యతగల పదవుల్లో ఉన్నవారు మాట్లాడడం అత్యంత బాధాకరం.. హేయం. ఆడ బిడ్డల కన్నీళ్లు తుడవలేని అధికారం ఎందుకు? కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి అనే విద్యార్థిని కి కనీస న్యాయం చేయలేని ప్రభుత్వ తీరు మీద పోరాడిన వ్యక్తిగా నాకు రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలు తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. దీనిపై వైసీపీ పాలకులు అనవసర చర్చలు పక్కనపెట్టి.. అఘాయిత్యాలు అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలి. దీనిపై ప్రశ్నిస్తూనే ఉంటా. మీ అందరి జీవితాల కోసం బాధ్యత తీసుకున్న వ్యక్తిని. ముఖ్యమంత్రి పదవి లభిస్తే మరింత బాధ్యతగా దానిని నిర్వర్తిస్తాను.

ముస్లింలకు పూర్తి అండగా నిలబడతాం:
రంజాన్ కోసం ఇఫ్తార్ విందులు ఇచ్చి… టోపీలు పెట్టుకొని ఫోటోలకు ఫోజ్ లు ఇవ్వడం కాదు… కచ్చితంగా జనసేన ప్రభుత్వంలో మైనారిటీలకు సముచిత స్థానం ఇస్తాం. వారికి అన్ని విధాలా అండగా ఉంటాం. ముస్లింల అభివృద్ధి కోసం పటిష్టమైన ప్రణాళిక రచిస్తాం. వైసిపికి గత ఎన్నికల్లో నిలబడి వారికి పనిచేసిన మైనార్టీలు సైతం ఇప్పుడు విసుగు చెందుతున్నారు. ప్రతి పనికి ప్రజాప్రతినిధులకు లంచాలు ఇచ్చుకోలేక బాధపడుతున్నారు. ఏ పని అవడం లేదని వేదన చెందుతున్నారు. ఖచ్చితంగా మైనారిటీల సంక్షేమానికి, ఉద్యోగాలకు, భవిష్యత్తుకు జనసేన అండదండలు ఉంటాయి.

రాజకీయాల్లో పౌరుషాలు ఉండవు.. వ్యూహాలు మాత్రమే ఉంటాయి:
వైసిపి నాయకులు ఏమైనా అంటే సింహం సింగిల్ గా వస్తుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు. మేము ఎవరితో పొత్తులు పెట్టుకోవాలో, ఎలా రాజకీయాలు చేయాలో మీరు నేర్పుతారా..? మీరు ఏం చేయాలో మేం నిర్దేశిస్తాం అప్పుడు చేస్తారా? ముందు మీ అతి తగ్గించుకోండి. రాజకీయాల్లో పౌరుషాలు ఉండవు. కేవలం వ్యూహాలు మాత్రమే ఉంటాయి. 1977 ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా భావసారూప్యత భిన్నంగా ఉన్న అన్ని పార్టీలు కలిశాయి. విజయం సాధించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న వైసిపి దారుణాలు, చేస్తున్న మోసాలకు విసిగిపోయిన ప్రజలు ఓటును చీల్చకూడదు అన్నదే నా ఉద్దేశం. తటస్త నాయకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రస్తుత ప్రభుత్వ తీరు మీద బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఏదైనా విమర్శలు చేస్తే కులాలకు చెందిన నాయకులతో తిట్టిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలకు బలంగా బదులు ఇవ్వగలను. అయితే దానివల్ల ప్రయోజనం సున్నా. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో మా ప్రయాణం కొనసాగుతోంది. పౌరుషాలు, పంతాలకు వెళ్ళను. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వారికి అవసరమైన ప్రభుత్వాన్ని అందిస్తాం. వ్యక్తిగత ప్రయోజనాలు పక్కనపెట్టి ప్రజల కోసం సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించాలి అన్నదే జనసేన లక్ష్యం.

వచ్చే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. నన్ను ఆశీర్వదించండి:
వచ్చే ఎన్నికలకు జనసేన పార్టీ ప్రజల అండతో సిద్ధంగా ఉంది. ఎన్నికలు ముందస్తుగా వచ్చిన ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నాం. 151 ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చినా ప్రజల కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ విభజన దగ్గర నుంచి రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోంది. దీనిని మాట్లాడేందుకు నాయకులకు భయం. ఎలాంటి భయం లేకుండా నేను మాట్లాడుతుంటే, వీళ్లకు ఎందుకు భయాలు..? రాయలసీమ అభివృద్ధికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది. పొత్తుల విషయం, ఇతర విషయాలు ఏ మాత్రం రహస్యంగా చేసే పద్ధతి ఉండదు. అంతా పారదర్శకంగా ప్రజాక్షేత్రంలోనే ముందుకు వెళ్తాం. 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినా ఫెయిల్ అయిన ప్రభుత్వం ఇది. మద్యం ద్వారా వస్తున్న గణనీయమైన డబ్బులను వచ్చే ఎన్నికల్లో ఓటుకు నోటు పంచుకోవడానికి వైసీపీ నేతలు దాచుకుంటున్నారు. నాకు ఏ పార్టీ మీద వ్యక్తిగత ఆపేక్ష లేదు. ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చి ప్రజలు బాగుండాలన్నదే నా ఆకాంక్ష. దీనిపై బిజెపి జాతీయ నాయకులకు తెలియజేస్తా. వారి సమ్మతి తీసుకొనే ముందుకు వెళ్తాం. అధికారం ఇస్తే కొన్ని కోట్లమంది కన్నీళ్లు తుడుస్తా. నన్ను ఆశీర్వదించండి. ప్రజల తరఫున పోరాడే బలం ఇవ్వండి. ఏటా లక్ష మంది యువతకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి.. వారు పదిమందికి ఉపాధి కల్పించేలా చూసే అద్భుతమైన ఆలోచనలు జనసేన పార్టీ వద్ద ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మరెన్నో ప్రణాళికలతో ముందుకు వస్తాం. ఖచ్చితంగా ప్రజల మద్దతు కూడగడతామని.. ప్రజా పోరాటాలతో ముందుకు వెళ్తామ”ని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.