Pawan Kalyan: ప‌వ‌న్ బ‌స్సు యాత్ర ఇప్ప‌ట్లో లేన‌ట్టే!

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌స్సు యాత్ర షెడ్యూల్ వాయిదా ప‌డింది. అక్టోబ‌ర్ 5 వ తేదీ నుంచి ఆయ‌న యాత్ర కొన‌సాగాలి.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 01:26 PM IST

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌స్సు యాత్ర షెడ్యూల్ వాయిదా ప‌డింది. అక్టోబ‌ర్ 5 వ తేదీ నుంచి ఆయ‌న యాత్ర కొన‌సాగాలి. ఆ మేర‌కు జన‌సేన కీల‌క లీడ‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. కానీ, అక‌స్మాత్తుగా బ‌స్సు యాత్ర‌ను వాయిదా వేసుకోవ‌డం ఆ పార్టీ క్యాడ‌ర్ ను నిరుత్సాహ‌ప‌రుస్తోంది. వాయిదాకు కార‌ణాల‌ను మాత్రం పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు వెల్ల‌డించ‌లేదు.

ఏక‌బిగిన 6 నెల‌ల పాటు ప్ర‌జ‌ల్లోనే ఉండేలా ప‌వ‌న్ క‌ల్యాణ్ కోసం ప్ర‌త్యేక బ‌స్సును కూడా జ‌న‌సేన రూపొందించింది. భారీ కాన్వాయ్ కోసం కొత్త కార్ల‌ను కొనుగోలు చేసింది. వాటి కొనుగోలుపై రాజ‌కీయ దుమారం కూడా రేగింది. ప్ర‌త్యేక బ‌స్సును రూపొందించిన జ‌న‌సేన ఖ‌రీదైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. తుది రూపాన్ని ఇస్తోన్న స‌మ‌యంలో బ‌స్సు యాత్ర వాయిదా న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఎప్ప‌టి నుంచి యాత్ర‌ను పెట్టాలి? అనే అంశంపై క్లారిటీ ఈనెల‌ 18వ తేదీన జరిగే పార్టీ సమావేశంలో వెల్ల‌డిస్తార‌ని తెలుస్తోంది.

ప్రస్తుతం ప‌వ‌న్ సినిమా షూటింగ్ ల బిజీలో ఉన్నారు. ప‌లు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని పూర్తి చేయ‌డానికి జూన్ నెల వ‌ర‌కు టైమ్ ప‌డుతుంద‌ని తెలుస్తోంది. సినిమాల‌ను పూర్తి చేసుకున్న త‌రువాత ఎన్నిక‌ల వ‌ర‌కు పూర్తి స‌మ‌యాన్ని రాజ‌కీయాల‌కు షెడ్యూల్ చేయాల‌ని జ‌న‌సేన భావిస్తుంద‌ట‌. ఎన్నిక‌ల వ‌ర‌కు బ‌స్సు యాత్ర ఉండేలా షెడ్యూల్ ను ఫిక్స్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

తొలుత‌ అక్టోబర్ 5 విజయ దశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని గతంలో జనసేనాని నిర్ణయించారు. రెండు నెల‌ల‌ క్రితం పవన్ బస్సు యాత్ర గురించి పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ప్రకటన చేసారు. అక్టోబర్ 5 నుంచి పవన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ప్రారంభమవుతుందని చెప్పారు. ఆరు నెలల పాటు ప్రజల్లోనే ఉండేలా జిల్లాల పర్యటన ఉంటుందని వెల్లడించారు. వచ్చే వేసవి వరకు మొత్తం 26 జిల్లాల్లోనూ పర్యటన ఉంటుందని చెప్పుకొచ్చారు. కానీ, దీని పైన కొద్ది రోజులు పార్టీలో చర్చ సాగుతోంది. ముందస్తు ఎన్నికలు ఖాయమనే అంచనాతో జనసేనాని బస్సు యాత్రను ఆ మేర‌కు ప్లాన్ చేశారు.

ప్ర‌స్తుత పరిస్థితులు గ‌మ‌నిస్తే సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేద‌ని జ‌న‌సేన గ్ర‌హించింద‌ట‌. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఒక వేళ అక్టోబ‌ర్ 5వ తేదీ నుంచి బస్ యాత్రను ఆరు నెలల పాటు చేసిన‌ప్ప‌టికీ ఎన్నిక‌ల‌కు ముందుగానే ముగుస్తుంది. అందుకే, ఎన్నిక‌ల వ‌ర‌కు ఏక‌బిగిన యాత్ర ఉండేలా ప్రారంభించాల‌ని షెడ్యూల్ ను అడ్జ‌స్ట్ చేశార‌ని తెలుస్తోంది.