Site icon HashtagU Telugu

AP Law and Order: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు రాజకీయ బాసుల మాటకు తలొగ్గవద్దు – ‘పవన్ కళ్యాణ్’

pawan kalyan

pawan kalyan

నేరాలకు పాల్పడేవారికి వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకొంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేం అని అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వ్యవహార శైలి, ఆ హత్య తానే చేశానని ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఒప్పుకొన్న తరవాత కూడా అధికారులు అతని పట్ల అత్యంత గౌరవమర్యాదలు కనబరిచిన తీరు చూస్తే విస్మయం కలుగుతోంది. సామాన్యుల పట్ల కూడా ఇంతే సహృదయత కనబరుస్తారా? ఈ విధమైన తీరుకి పోలీసుల కంటే వారిపై ఆధిపత్యం చలాయిస్తున్న రాజకీయ బాసులే కారణం. కోడి కత్తి కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదు అన్నవారే ఇప్పుడు ఆ శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారు.

కోడి కత్తి కేసు పురోగతి ఏమిటో తెలియదు. పులివెందులలో వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారం గుండె పోటు నుంచి గొడ్డలి పోటు వరకు వెళ్లింది. ఇప్పటికీ సాగుతున్న విచారణలో అసలు దోషులెవరో తేలలేదు. ఇవే కాదు – సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసిన గిరీష్ బాబు అనే ఎస్సీ యువకుడిపై అధికార పార్టీ వేధింపులకు దిగింది. అందుకు పోలీసులను వాడుకోవడంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి పోలీసు అధికారి కాలర్ పట్టుకొని దుర్భాషలాడినా పోలీసులు మౌనం వహించాల్సి వచ్చింది. భీమవరం నియోజకవర్గంలోని మత్స్యపురి గ్రామంలో విజయోత్సవాలు చేసుకొంటున్న జనసేన సర్పంచ్, వార్డు సభ్యుల ఇళ్లపై అధికార పార్టీ తెగబడి దాడులు చేసింది.

పలమనేరులో వైసీపీ నేత చర్యలకు మిస్బా అనే పదో తరగతి బాలిక స్కూలుకు దూరమై ఆత్మహత్య చేసుకొంది. మట్టి తవ్వకాలు అడ్డుకొన్న గుడివాడ ఆర్.ఐ.పై దాడి చేసినా ఏ చర్యలూ లేవు. సోషల్ మీడియాలో పోస్టింగుల పేరుతో జనసేన కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఈ రాష్ట్రంలో దాడి చేసినా, హత్యలు చేసినా, అత్యాచారాలు చేసినా ఏం జరగదు అనే ధైర్యం నేరస్తులకు కలగడానికి కారణం- పాలకుల వైఖరే. కోడి కత్తి కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో అసలు నేరస్తులను పట్టుకొని చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించి ఉంటే, నేరం చేసేవాళ్ళకు పోలీసులపై చులకన భావన, ఏమీ కాదులే అనే ధైర్యం వచ్చి ఉండేవా?
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను వైసీపీ పాలకుల నుంచి ఏమీ ఆశించలేం. వారికే చిత్తశుద్ధి ఉంటే- హత్య చేశాను అని ఒప్పుకొన్న ఎమ్మెల్సీపై ఈపాటికే పార్టీపరంగాను, పెద్దల సభ నుంచి పంపేలా చర్యలకు ఉపక్రమించేవారు. కాబట్టి పోలీసు అధికారులే బాధ్యత తీసుకొని రాజకీయ బాసుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా శాంతిభద్రతల పరిరక్షణలో స్వతంత్రంగా వ్యవహరించాలి. అప్పుడే ప్రజలకు పోలీసు వ్యవస్థపై, చట్టాలపై విశ్వాసం కలుగుతుంది అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.