Pawan Kalyan: ఎక్కడ సమస్యలు వస్తే అక్కడ నిలబడతా – జనసేనాని

విశాఖపట్నం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, నిర్వాసితులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు

  • Written By:
  • Publish Date - October 31, 2021 / 11:50 PM IST

విశాఖపట్నం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, నిర్వాసితులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. అయితే ఈ ఉద్యమానికి పలు రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి.ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రవేటీకరణకు వ్యతిరేకంగా పలు సందర్భాలు ఆయన మాట్లాడారు. తాజగా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి ప్రత్యక్షంగా ఆయన రంగంలోకి దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ ఈ రోజు జనసేన ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.

స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంఘీభావం ప్రకటించారు. ఈ రోజు విశాఖపట్నంలో విశాఖ ఉక్కు- ఆంద్రుల హక్కు అంటూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు,నిర్వాసితులు హాజరైయ్యారు. నాయకుడు,కవి ఎప్పుడూ కార్మికుల వైపే నిలబడాలని శ్రీశ్రీ రాసిన నేను సైతం కవితను పవన్ కళ్యాణ్ చదివి వినిపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై వైసీపీ ప్రభుత్వం వారంలోగా స్పందించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం ప్రభుత్వం అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని…దీని కోసం వారంలోగా గడువు ఇస్తున్నానని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ డెడ్లైన్ విధించారు. చట్టసభల్లో మాట్లాడాల్సిన నేతలు మౌనంగా ఉంటే ఏం లాభమని…వైసీపీ మాటలకు అర్థాలు వేరులే అంటూ ఎద్దేవా చేశారు. చెప్పినమాటకు తూట్లు పొడవటమే వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సంకల్పమని…వైసీపీ మాటలన్నీ ఆచరణలోకి రాని మాటలేనని తెలిపారు.. ఉక్కు పరిరక్షణకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఉక్కు ప్రైవేటీకరణ వద్దని అమిత్షాను కోరానని… కేంద్రాన్ని అడిగేముందు రాష్ట్ర పాలకులను బాధ్యులను చేయాలన్నారు. విశాఖ ఉక్కు ఎవరి భిక్ష కాదని.. కార్మికుల పోరాటం వల్లే అనేక పరిశ్రమలు మిగిలాయన్నారు. సమస్యలు వస్తే నిలబడతా.. పారిపోయే వ్యక్తిని కానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.కార్మికుల పక్షాన నిలబడలేని జన్మ వృథానేనని… స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ నిర్ణయం బాధేసిందన్నారు. మౌలిక సదుపాయాల రంగానికి ఉక్కు పరిశ్రమ కీలకమన్నారు పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు వైసీపీ స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అజెండాను భుజాన వేసుకుని పవన్ కళ్యాణ్ వచ్చారని..స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందన్న పవన్ వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు. స్థిరత్వంలేని పవన్ మాటలకు విలువ లేదని…. దమ్ము, ధైర్యం ఉంటే ఈ పోరాటం ఏదో ఢిల్లీలో కేంద్రంపై చేయండని సవాల్ విసిరారు.స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం అయితే పవన్ విమర్శలు వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపైనా చేస్తుండటం విడ్డూరంగా ఉందన్నారు.దేశాన్ని దృష్టిలో పెట్టుకుని పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని మోడీ తీసుకున్నారని గతంలో మీరు చేసిన వ్యాఖ్యల సంగతేంటని పవన్ని ప్రశ్నించారు.పవన్ వ్యాఖ్యల వీడియోను మీడియా ముందు ప్రదర్శించిన ఎమ్మెల్యే అమర్నాథ్… ఈ మాటలు మట్లాడినట్టు మీకైనా గుర్తుందా పవన్ కల్యాణ్…అంటూ చురకులంటించారు. ఆరోజు మాట్లాడింది తప్పు అని పవన్ లెంపలేసుకుని, క్షమాపణలు చెప్పి మళ్ళీ పోరాటం అంటే బాగుండేదన్నారు. పవన్ ప్రసంగం విశాఖ ఉక్కుకు మద్దతుగా లేదు… కేంద్రంలోని బీజేపీకి మద్దతుగా ఉందని ఎద్దేవా చేశారు.దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు.. 9 నెలల తర్వాత బయటకు వచ్చి పవన్ పోరాటం చేస్తారంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు.