AP Politics: జ‌గ‌న్ మీద ప‌వ‌న్ `ఆడిట్‌` అస్త్రం

`సోష‌ల్ ఆడిట్` అనేది ఒక సామాజిక బాధ్య‌త‌. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కంపెనీలు సామ‌ర్థ్యాన్ని అంచ‌నా వేయ‌డానికి ఆ ప్ర‌క్రియ‌ను అనుస‌రిస్తుంటాయి

  • Written By:
  • Updated On - October 31, 2022 / 01:23 PM IST

`సోష‌ల్ ఆడిట్` అనేది ఒక సామాజిక బాధ్య‌త‌. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు కంపెనీలు సామ‌ర్థ్యాన్ని అంచ‌నా వేయ‌డానికి ఆ ప్ర‌క్రియ‌ను అనుస‌రిస్తుంటాయి. వాస్త‌వంగా ప్ర‌భుత్వం చేసే ప్ర‌తి ప‌ని మీద సామాజిక త‌నిఖీ ఉంటుంది. ప్ర‌జాక్షేత్రంలో సామాజిక త‌నిఖీలు చేసిన‌ట్టు రికార్డులను అధికారులు క్రియేట్ చేస్తారు. కానీ, క్షే త్ర‌స్థాయి త‌నిఖీలు ఎక్క‌డా క‌నిపించ‌వు. ఆ ప‌ని చేయ‌డానికి జ‌న‌సేన రంగంలోకి దిగింది. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ ఏర్పాటు చేసిన ప‌వ‌న్ ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై సామాజిక త‌నిఖీ అస్త్రాన్ని సంధిస్తున్నారు.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల మ‌ధ్య జ‌రిగిన లావాదేవీలపై అప్ప‌ట్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ మేధావుల‌తో ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీని ఏర్పాటు చేశారు. ఆ క‌మిటీలో లోక్ స‌త్తా జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ‌, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ , ఇత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఉన్నారు. కేంద్రం ఇచ్చింది ఎంత‌? రాష్ట్రం ఖ‌ర్చు చేసింది ఎక్క‌డ‌? అనే అంశాన్ని నిగ్గుతేల్చ‌డానికి జ‌న‌సేనాని ఆనాడు ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీని న‌మ్ముకున్నారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్ర‌భుత్వం నిర్మించిన జ‌గ‌న‌న్న కాల‌నీలు, టిడ్కో ఇళ్లకు సంబంధించి సామాజిక త‌నిఖీలు చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. ఆ మేర‌కు ఆదివారం మంగ‌ళ‌గిరిలో జ‌రిగిన పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీలో తీర్మానించారు.

Also Read:   Chandrababu: ఒకే ఒక్క‌డు! ఒంట‌రి పోరాటం!!

ప్రస్తుతం `జ‌న‌వాణి` కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోన్న ప‌వ‌న్ మొత్తం 26 జిల్లాల్లోనూ రాబోవు రోజుల్లో నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో సామాజిక త‌నిఖీల‌ను చేయాల‌ని పీఏసీ తీర్మానించింది. న‌వంబ‌ర్ 12, 13, 14 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక త‌నిఖీలు నిర్వ‌హించాల‌ని ఆ పార్టీ భావిస్తోంది. అందు కోసం ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఇంజ‌నీర్లు, నిర్మాణ రంగంలోని నిపుణులు, సీనియ‌ర్ ఆడిట‌ర్లు, సామాజిక వేత్త‌ల‌తో క‌మిటీలు ఏర్పాటు చేయ‌నున్నారు. వాళ్లు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి సామాజిక త‌నిఖీల‌ను నిర్వ‌హిస్తారు. వాస్తవంగా ప్రభుత్వం రికార్డ్ ప్ర‌కారం సామాజిక త‌నిఖీలు నిర్వ‌హించిన‌ట్టు ఉంటుంది. ఆ రిపోర్టును తాజాగా జ‌న‌సేన చేసే సామాజిక త‌నిఖీ రిపోర్ట్ ల‌ను బేరీజు వేస్తారు. ఫ‌లితంగా ప్ర‌జ‌ల‌కు ఎంత వ‌ర‌కు ప్ర‌భుత్వం న్యాయం చేసింద‌నే అంశాన్ని బ‌య‌ట‌కు తీయ‌డానికి జ‌న‌సేనాని సిద్దం అయ్యారు.

175 నియోజకవర్గాల నుంచి సామాజిక త‌నిఖీల నివేదికలు తెప్పించుకుని పవన్ కల్యాణ్ అధ్య‌య‌నం చేస్తారు. ఆ త‌రువాత తుది నివేదిక‌ను మీడియా వేదిక‌గా విడుద‌ల చేయ‌డానికి ఆ పార్టీ ప్ర‌ణాళిక‌ను రెడీ చేసింది. శాస్త్రీయ‌బ‌ద్ధంగా జగన్ మోహన్ రెడ్డి ప్ర‌భుత్వ అవినీతి, అక్ర‌మాలు, అవ‌క‌త‌వ‌క‌ల‌ను నిరూపించ‌డానికి ప‌వ‌న్ ప‌క్కా ప్ర‌ణాళిక‌తో దూకుడుగా వెళుతున్నారు. సామాజిక త‌నిఖీల ద్వారా ప్ర‌జ‌ల్లో విప్ల‌వాత్మ‌క ఆలోచ‌న వ‌స్తుంద‌ని ప‌వ‌న్ యోచిస్తున్నారు. ఎంత వ‌ర‌కు ఆయ‌న ప్లాన్ ఫ‌లిస్తుందో చూడాలి.

Also Read:  PK: ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు.. జగన్ కు సాయం చేయకుంటే బాగుండేది..!!