ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) సోదరుడు రామ్మూర్తి మృతి (Ramamurthy Naidu Died)పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి మరణ వార్త నన్ను కలచివేసింది. సోదర వియోగంతో బాధపడుతున్న చంద్రబాబు నాయుడుకి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నా. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో ఉన్నందున రామ్మూర్తి అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నా. నారా రోహిత్, ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
నారా రామ్మూర్తి నాయుడి హఠాన్మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన గుండెపోటు కారణంగా కన్నుమూయడంతో నందమూరి, నారా కుటుంబాలు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాయి. మహారాష్ట్ర పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు సోదరుడి వార్త తెలియగానే వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. అలాగే మంత్రి నారా లోకేశ్ తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో చంద్రబాబు , నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు కుటుంబసభ్యులు, తెలుగుదేశం పార్టీ ప్రముఖులు నివాళులు అర్పించారు. రేపు ఉ.5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని రేణిగుంట ఎయిర్పోర్టుకు తరలించనున్నారు. అక్కడి నుంచి నారావారిపల్లెకు తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. పితృ వియోగంతో శోకసంద్రంలో మునిగిపోయిన హీరో నారా రోహిత్ ను తన పెద్దనాన్న, ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శించారు. రామ్మూర్తి కుమారులైన గిరీశ్, రోహిత్లను హత్తుకుని ధైర్యం చెప్పారు. మరోపక్క రామ్మూర్తికి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన AIG ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం రామ్మూర్తి నాయుడు మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థించినట్లు ప్రకటన విడుదల చేశారు. 1952లో జన్మించిన రామ్మూర్తి నాయుడు నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ్మ దంపతుల రెండో కుమారుడు. చంద్రబాబు కు తమ్ముడు. రామ్మూర్తి నాయుడికి భార్య ఇందిర, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరు నటుడు రోహిత్, మరొకరు నారా గిరీష్. 1994లో రామ్మూర్తి నాయుడు చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది 1999 వరకు ప్రజలకు సేవలందించారు. అనంతరం ఆయన అనారోగ్యంతో రాజకీయాల నుంచి విరామం తీసుకున్నారు. రీసెంట్ గా నారా రోహిత్ ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రతినిధి-2లో హీరోయిన్ గా నటించిన సిరి లేళ్లను (Siri Lella) రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ నిశ్చితార్థానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఇంకా నారావారి ఫ్యామిలీ, అలాగే నందమూరి కుటుంబసభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు.
రోహిత్ తన ప్రేమ విషయాన్నీ ముందుగా పెద్దమ్మ భువనేశ్వరికి చెప్పినట్లు ఆ మధ్య వార్తలు బయటకు వచ్చాయి. రోహిత్ ప్రేమ విషయం తెలిసిన తర్వాత… భువనేశ్వరి పెళ్లి పెద్దగా మారారని నారా, నందమూరి కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. శిరీష కుటుంబ సభ్యులతో ఆవిడ స్వయంగా మాట్లాడి ఈ సంబంధం కుదిర్చారట. చంద్రబాబు, భువనేశ్వరి ఆశీస్సులతో నోవాటెల్ హోటల్ లో కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. డిసెంబర్ లో పెళ్లి వేడుక జరపాలని అనుకున్నారు కానీ ఇప్పుడు తండ్రి మరణంతో రోహిత్ శోకసంద్రంలో పడిపోయాడు.