AP Politics: టీడీపీ వైపు పవన్,బీజేపీలోకి జూనియర్?

జూనియర్ చుట్టూ రాజకీయాన్ని రక్తికట్టించడానికి బీజేపీ ప్లాన్ చేసింది.

  • Written By:
  • Publish Date - September 5, 2022 / 12:27 AM IST

జూనియర్ చుట్టూ రాజకీయాన్ని రక్తికట్టించడానికి బీజేపీ ప్లాన్ చేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా, జూనియర్ భేటీని మళ్ళీ తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూవీర్రాజు రాజేశారు. ఆయనకు ఉన్న క్రేజ్ ను వాడుకుంటామని వీర్రాజు ప్రకటించారు. దీంతో జనసేనాని మీద పరోక్షంగా బీజేపీ రాజకీయ గురి పెట్టినట్టు అయింది.
‘రాజకీయాలు కొంత మందే కాదు, అందరూ చేస్తారు’ అంటూ పరోక్షంగా పవన్ రాజకీయ అడుగులపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్య చేసారు. దీని ద్వారా కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ పొత్తుల్లో భాగంగా టీడీపీతో కలవాలని చేస్తున్న ప్రకటనలకు కౌంటర్ పడినట్టు అయింది. టీడీపీకి దూరంగా ఉండాలని బీజేపి భావిస్తోందని, పవన్ కళ్యాణ్ తిరిగి టీడీపీతో పొత్తు దిశగా ప్రకటన చేస్తే అప్పుడు అధికారికంగా స్పందిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఇదే సమయంలో సోము వీర్రాజు యాక్టర్లు కానివారు ఎవరని ప్రశ్నించారు. దీని ద్వారా పవన్ కళ్యాణ్ పోతే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడనే సంకేతాలు ఇచ్చారు. సోము వీర్రాజు వ్యాఖ్యలతో ఇటీవల అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ లోకి ఆహ్వానించారా? జూ ఎన్టీఆర్ అందుకు సిద్దమేనా ?అనే మరో చర్చ మొదలైంది.

జూనియర్ ఎన్టీఆర్ సేవలను తెలంగాణలో – ఏపీలో ఎక్కడ వినియోగించుకుంటారని ప్రశ్నించగా, ఆయనకు ప్రజాదరణ ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడే వాడుకుంటామని వీర్రాజు తేల్చి చెప్పారు. పరోక్షంగా ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుంటామంటూ సోము స్పష్టం చేసారు. ఇదే సమయంలో మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసారు.

చంద్రబాబుతో తమ వైఖరిలో మార్పు లేదన్నారు. కుటుంబ పార్టీలకు తమ పార్టీ దూరంగానే ఉంటుందని వెల్లడించారు. పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఈ విషయం స్పష్టం చేసిందన్నారు.జనసేనతో తమ పొత్తు ఉంటుందని చెబుతూనే పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేయటం ఇప్పుడు రాజకీయంగా సంచలనానికి కారణమవుతోంది. తాము పవన్ కళ్యాణ్ తో కలిసే ఉన్నామని చెప్పారు. బీజేపీ ఎంపీలు జీవీఎల్ నర్సింహా రావు, తెలంగాణ ఎంపీ లక్ష్మణ్ సైతం అమిత్ షా – జూ ఎన్టీఆర్ మధ్య రాజకీయంగా చర్చ జరిగిందని వెల్లడించారు. మాజీ మంత్రి కొడాలి నాని సైతం జూనియర్ సేవలను బీజేపీ దక్షణాది రాష్ట్రాల్లో ప్రచారం కోసం వినియోగించుకొనే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో సోము వీర్రాజు తాము జూనియర్ ఎన్టీఆర్ సేవలు వినియోగించుకుంటామని చెప్పటం సంచలనం కలిగిస్తుంది. దీనిపై పవన్ కళ్యాణ్ ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.ఈ వ్యాఖ్యలపై తారక్ ఇప్పటికైనా స్పందిస్తారా?.లేక మరి కొంత కాలం ఈ సస్పెన్స్ కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి.