Site icon HashtagU Telugu

Pawan Kalyan: రుయా దయనీయ ఘటనకు ‘జగన్’ ప్రభుత్వమే కారణం – ‘పవన్ కళ్యాణ్’

Pawan Kalyan

Pawan Kalyan

తిరుపతి రుయా ఆసుపత్రిలో చోటు చేసుకున్న దయనీయ ఘటన అమానవీయమైనది. కడప జిల్లా చిట్వేలుకి చెందిన నరసింహ కుమారుడు జసవ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ రుయాలో చనిపోయాడు. ఉచిత అంబులెన్స్ సేవలు ఆపేయడం వల్ల నరసింహ తన బిడ్డ మృతదేహాన్ని తీసుకువెళ్ళడానికి పడిన కష్టం, వేదన దృశ్యాలు చూశాను. ప్రైవేటు అంబులెన్సు ఆపరేటర్లు డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వలేక.. చనిపోయిన తొమ్మిదేళ్ళ బిడ్డను భుజంపైన వేసుకొని 90 కి.మీ.

బైక్ మీద వెళ్లిన ఆ ఘటన కలచి వేసిందని అన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. బిడ్డను కోల్పోయిన నరసింహ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనకు విధుల్లో ఉన్న ఓ వైద్యుణ్ణి సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకొంటోంది. డ్యూటీలో ఉండే మెడికల్ ఆఫీసర్స్ వైద్యం చేయాలా? అంబులెన్సులు పురమాయించాలా? ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగం పటిష్టం చేయకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ ఒక్క ఘటనే కాదు – రుయా ఆసుపత్రిలోనే కరోనా సమయంలో ఆక్సిజన్ లేకపోవడంతో 30 మంది మృత్యువు బారినపడ్డారు. కడప రిమ్స్ లో విద్యుత్ కోతలతో పిల్లలు మృతి చెందారు.

వరుసగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యపరమైన మౌలిక సదుపాయాలు కొరత గురించే నర్సీపట్నంలో ప్రభుత్వ వైద్యులు డా. సుధాకర్ బలంగా మాట్లాడితే వేధించారు. ఆ వేదనతోనే ఆ డాక్టర్ చనిపోయారు. ఈ సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తున్నాయి. ప్రభుత్వ తీరు వల్లే మాఫియా జులుం చూపిస్తోంది. ఎక్కడో వెనకబడ్డ రాష్ట్రాల్లో రుయాలో చోటు చేసుకున్న ఘటనలు గురించి చదివే వాళ్ళం.

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా చోటు చేసుకుంది. ప్రభుత్వం వైద్య రంగం మీద ఏపాటి శ్రద్ధ చూపుతుందో తెలుస్తోంది. కన్నవారి కడుపు కోత అర్థం చేసుకోలేని స్థితికి ఆసుపత్రుల చుట్టూ ఉండే మాఫియాలు తయారయ్యాయి. వాటిపైనా, వారిని పెంచి పోషిస్తున్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.