Pawan Kalyan Deeksha : మోడీ ఉదాసీనం..ప‌వ‌న్ దీక్ష‌!

విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం ఏపీకి అందాల్సిన ఫ‌లితాలు రాక‌పోగా, ఉన్న‌వాటిని కూడా కేంద్రం లాగేసుకుంటోంది.

  • Written By:
  • Publish Date - December 11, 2021 / 02:52 PM IST

విభ‌జ‌న చ‌ట్టం ప్రకారం ఏపీకి అందాల్సిన ఫ‌లితాలు రాక‌పోగా, ఉన్న‌వాటిని కూడా కేంద్రం లాగేసుకుంటోంది. ఆంధ్రుల హ‌క్కు..విశాఖ ఉక్కు నినాదంతో వ‌చ్చిన విశాఖ స్టీల్ ప్రైవేటు ప‌రం కానుంది. అందుకు సంబంధించిన పేప‌ర్ వ‌ర్క్ మొత్తం దాదాపుగా పూర్త‌యింది. ఆ విష‌యం సీఎం జ‌గ‌న్ కు తెలుసు. అయిన‌ప్ప‌టికీ కేంద్రంపై పోరాటం చేయ‌లేని దుస్థితి. ప్ర‌త్యామ్నాయంగా విశాఖ ఉక్కు వేలంలో పాల్గొని సొంతం చేసుకునే ప్ర‌య‌త్నం చేద్దామంటూ జ‌గన్మోహ‌న్ రెడ్డి ఏపీ ప్ర‌జ‌లకు హామీ ఇవ్వ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.300 రోజులుగా విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కార్మికులు ఉద్య‌మిస్తున్నారు. చుట్ట‌పుచూపుగా రాజ‌కీయ పార్టీల నేతలు వెళ్లి రావ‌డం మిన‌హా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా వాళ్ల‌కు అండ‌గా నిలిచిన సంద‌ర్భాలు త‌క్కువ‌. మీడియా ముఖంగా మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించ‌డం వ‌ర‌కు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌త్యేక ఆంధ్రా కోసం పొట్టిశ్రీరాములు చేసిన దీక్ష మ‌నంద‌రికీ తెలిసిందే. ఆ స్థాయిలో దీక్ష‌ల‌కు దిగ‌కుండా ఆయా పార్టీల నేత‌లు రాజ‌కీయ అస్త్రంగా విశాఖ ఉక్కు ప్రైవేటుక‌ర‌ణ‌ను వాడుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు లేక‌పోలేదు.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు కార్మికుల‌కు అండ‌గా నిలిచారు. గంటా శ్రీనివాసరావులాంటి సీనియ‌ర్ లీడ‌ర్ పార్టీని వీడి కార్మికుల‌ ప‌క్షాన నిలుస్తాన‌ని ప్ర‌క‌టించాడు. కానీ, కార్మికులు గంటా చిత్త‌శుద్దిని విశ్వ‌సించ‌లేదు. దీంతో ఆయ‌న కూడా అట్టీముట్ట‌న‌ట్టు ఉండిపోతున్నాడ‌ని స్థానికులు చెబుతున్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా చంద్ర‌బాబు ఉక్కు ఉద్య‌మాన్ని విశాఖ‌ను దాటించ‌లేక‌పోయాడు.300రోజులుగా కార్మికులు రిలే నిరాహాదీక్ష‌లు చేస్తున్న‌ప్ప‌టికీ ఏపీ వ్యాప్తంగా దాన్ని తీసుకెళ్ల‌డంలో టీడీపీ విజ‌యం సాధించ‌లేక పోయింది.అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మాన్ని ఖండాంత‌రాల‌ను దాటించ‌డానికి టీడీపీ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఆ క్ర‌మంలోనే న్యాయ‌స్థానం టూ దేవ‌స్థానం మ‌హాపాద‌యాత్ర హిట్ అయింది. కోట్లాది రూపాయాల విరాళంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు రైతుల‌కు బాస‌ట‌గా నిలిచారు. ఫ‌లితంగా మూడు రాజ‌ధానుల బిల్లును ఏపీ స‌ర్కార్ వెన‌క్కు తీసుకుంది.
ప్ర‌త్యేక హోదా, రాజ‌ధాని, పోల‌వరం, విశాఖ రైల్వే జోన్, లోటు బ‌డ్జెట్ , వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు ప్ర‌త్యేక ప్యాకేజీ..ఇవీ విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక అంశాలు. వీటితో పాటు 9,10 షెడ్యూల్ లోని ఆస్తుల పంపకం. వీటి మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కేంద్రాన్ని నిల‌దీయ‌లేక‌పోతున్నాడు. తాజాగా విశాఖ రైల్వే జోన్ లేద‌ని పార్ల‌మెంట్ వేదిక‌గా కేంద్రం ప‌రోక్షంగా చెప్పేసింది. దేశంలోని రైల్వే జోన్ల సంఖ్యలో విశాఖ‌ రైల్వే జోన్ ప్ర‌స్తావ‌న ఎక్క‌డా లేదు.

 

రాజ‌ధాని నిర్మాణం ఎండ‌మావిగానే క‌నిపిస్తోంది. కేంద్రం పూర్తిగా రాజ‌ధాని నిర్మాణం నుంచి త‌ప్పుకుంది. పైగా రాజ‌ధాని ఎక్క‌డో చెప్ప‌లేని అగ‌మ్య‌గోచ‌ర ప‌రిస్థితుల్లో ఏపీ ప్ర‌భుత్వం ఉంది. లోటు బ‌డ్జెట్‌, వెనుక‌బ‌డిన ప్రాంతాల‌కు ప్ర‌త్యేక నిధులు అంద‌ని ద్రాక్ష‌గానే ఉంది. ప్ర‌త్యేక హోదాను అటు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటు కేంద్రం ముసిగిన అధ్యాయంగా చేశాయి. దాని కోసం ప్ర‌తిప‌క్షాలు సైతం డిమాండ్ చేయ‌డం మానుకున్నాయి. ప్ర‌జ‌లు కూడా మ‌రిచిపోయే ప‌రిస్థితికి వ‌చ్చారు.
వీట‌న్నింటి మీద పోరాడాల్సిన బాధ్య‌త బీజేపీతో పొత్తు ఉన్న జ‌న‌సేన మీద ఉంది. విశాఖ‌ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ కు వ్య‌తిరేకంగా దీక్ష చేయ‌డానికి ఈనెల 12న ప‌వ‌న్ విశాఖ‌కు వెళుతున్నాడు. ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి సాయ‌త్రం 5 గంట‌ల వ‌ర‌కు దీక్ష చేయ‌నున్నాడు. కేంద్రానికి ఇప్ప‌టికే ఆయ‌న లేఖ రాశాడు. కానీ, స్పంద‌న లేక‌పోవ‌డంతో దీక్ష‌కు పూనుకున్నాడు. ఒక రోజు దీక్ష వ‌ల్ల ఆ పార్టీకి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం చేకూరుతుందేమోగానీ, స‌మ‌స్య‌కు ప‌రిష్కారం ల‌భించ‌దని ఆయ‌న‌కు తెలుసు. ఈ దీక్ష త‌రువాత ఆయ‌నేం చేస్తారో…చూద్దాం.!