Pawan: ఇకపై ‘జగన్’ ను ‘సిబిఐ దత్తపుత్రుడు’ అనే పిలుస్తా – ‘పవన్ కళ్యాణ్’

కౌలు రైతు సమస్యను వైసీపీ ప్రభుత్వం గుర్తించకపోవడం వల్లే జనసేన పార్టీ బయటకు తీసుకొచ్చిందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

  • Written By:
  • Updated On - April 23, 2022 / 10:05 PM IST

కౌలు రైతు సమస్యను వైసీపీ ప్రభుత్వం గుర్తించకపోవడం వల్లే జనసేన పార్టీ బయటకు తీసుకొచ్చిందని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 151 మంది శాసనసభ్యులు, 22 మంది లోక్ సభ సభ్యులు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు నిజంగా కౌలు రైతుల సమస్యలను గుర్తించి పరిష్కారం చూపించి ఉంటే జనసేన పార్టీ రోడ్డు మీదకు వచ్చే పరిస్థితి ఉండేది కాదన్నారు. భారతదేశంలో రైతు ఆత్మహత్యల్లో మన రాష్ట్రం మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉండటం సిగ్గుచేటని అన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు మూడు వేల మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, ప్రతి ఒక్క కుటుంబానికి ఆర్ధిక భరోసా కల్పించేలా జనసేన పార్టీ ముందడుగు వేస్తోందని వెల్లడించారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో రచ్చ బండ నిర్వహించారు. ఆత్మహత్యలకు పాల్పడిన 41 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “భారత దేశంలో 80 శాతం మంది కౌలు రైతులే. మనం తినే ప్రతి మెతుకు వాళ్లు శ్రమతో పండించిందే. అప్పులు చేసి సాగుపై పెట్టుబడులు పెడితే ప్రకృతి విపత్తులు, గిట్టుబాటు ధరలు లేక చేసిన అప్పులు తీర్చలేక నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేవలం మూడంటే మూడు లక్షల అప్పు తీర్చలేక తనువు చాలిస్తున్న వారు ఉన్నారు. కొందరు పొలాల్లో చెట్లకు ఉరివేసుకుంటే, మరికొంతమంది పురుగుల మందులు తాగి చనిపోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల బాధలు వింటుంటే కడుపు
తరుక్కుపోతోంది. పట్టాదారు పాస్ పుస్తకంలో పొరపాట్లు సవరణ కోసం గుంటూరు జిల్లాలో ఒక రైతు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చివరకు ఆత్మహత్యకు పాల్పడటం చాలా బాధ అనిపించింది. ఇలాంటి వాళ్ల బాధలు తీర్చాల్సింది ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.

జనసేన ఎత్తుకుంటేగానీ సమస్య గుర్తురాదా? :
ఎన్నికల ముందు నేటి ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో కౌలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతేనే నిలదీయాల్సి వస్తోంది. ప్రజలు మిమ్మల్ని నమ్మి బలమైన మెజార్టీ ఇస్తే వారి కన్నీరు తుడవాలి కదా? కష్టమొస్తే ప్రజలకు అండగా నిలబడాలి కదా? కన్నీరు తుడవాల్సింది కేవలం పాదయాత్ర సమయంలో కాదు…అధికారంలోకి వచ్చాక వారికీ భరోసా కల్పించాలి. జనసేన పార్టీ ఏ సమస్య అయినా ఎత్తుకుంటే తప్ప ఈ ప్రభుత్వానికి గుర్తురాదా? అధికారం చేతిలో ఉంది.. ప్రజల్ని ఆదుకోండని మేము అడిగితే… వారు అవన్నీ మానేసి దత్తపుత్రుడు, ఆ పుత్రుడు అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇంతవరకు ముఖ్యమంత్రి స్థానానికి మర్యాద ఇచ్చి మాట్లాడాను. ఇకమీదట ఆయన్ని సీబీఐ దత్తపుత్రుడు అని పిలవాలని ఫిక్స్ అయిపోయాం. నన్ను దత్తపుత్రుడు అని పిలిచే వైసీపీ నాయకులకు ఒకటే చెబుతున్నాను.. నేను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుడిని. సమస్య పక్కదారి పడుతుందని నేను సెటైర్లు వేయను కానీ, మంచి స్కీన్ ప్లే రాయగల గట్టి రచయితను నేను సెటైర్ వేస్తే వైసీపీ నాయకులు తట్టుకోలేరు. నరసాపురం ఎం.పి. రఘురామ కృష్ణం రాజు కొన్ని సూచనలు చేశారు. పొరపాటు మాట్లాడారని చెప్పారు. సరి చేసుకుంటాను. అది చర్లపల్లి షటిల్ టీం కాదు చంచల్ గూడ షటిల్ టీం అని చెప్పారు. ఆయన సూచనల ప్రకారం ఇక నుంచి వైసీపీని చంచల్ గూడ షటిల్ టీం అనే పిలుస్తాను.

నష్టపరిహారంలో కూడా కుల వివక్షతేనా?
జనసేన కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాలో చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు రూ. 7 లక్షల నష్టపరిహారం ఇస్తున్నారు. ఇస్తున్న నష్టపరిహారంలో కూడా కుల వివక్ష చూపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ కౌలు రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా చేతులు దులుపుకుంటున్నారు.

వైసీపీ నేతలకు సంస్కారం లేదా?
తూర్పుగోదావరి జిల్లాలో ఒక వైసీపీ ఎమ్మెల్సీ అయితే ఏదో తన సొంత జేబులో డబ్బులు ఇచ్చినట్లు రూ. 7 లక్షలను గాల్లో ఊపుతూ బాధిత కుటుంబానికి ఇస్తున్నాడు. ఇలా చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని అవమానించడం పద్ధతి కాదు. అలాగే రూ. 7 లక్షలు ఇచ్చాం కాళ్లకు మొక్కండి అని చెప్పడం సంస్కారం కాదు. వైసీపీ నేతలకు సంస్కారం లేదా? అయినా రూ. 50 వేలకు మించి విత్ డ్రా చేయకూడదని నిబంధనలు చెబుతుంటే ఈయన మాత్రం రూ. 7 లక్షలు ఎలా విత్ డ్రా చేశారు? నాయకులే ఇలా సంస్కారహీనులుగా తయారైతే ఇక ఆ పార్టీ క్యాడర్ ఎలా ఉంటుందో ఊహించుకోవాలి.

ఆ హామీ ఏమైందని నిలదీయండి:
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ వరి పండని చోట కూడా అక్కడి రైతాంగం వరి పండిస్తుంటే.. మనం మాత్రం జీవనదులు ఉండి కూడా రైతు ఆత్మహత్యలను నిలువరించ లేకపోతున్నాం. రైతుల ఆత్మహత్యలు ఆపే విధంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలి. అధికారంలోకి వస్తే రైతు భరోసా పథకం కింద రూ. 13,500 ఇస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. కేంద్రం ఇస్తున్న రూ. 6 వేలతో కలిపి రూ. 13,500 ఇస్తున్నారు. వైసీపీ ఇచ్చిన హామీ ప్రకారం అర్హుడైన ప్రతి రైతు ఖాతాలో రూ. 19,500 జమ కావాలి. రైతుకు రావాల్సిన ఆ ఆరువేల రూపాయలు ఏమయ్యాయని ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. జగన్ రెడ్డిలా నాకు లక్షల కోట్ల ఆస్తి లేదు.. సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు. అలా ఉండుంటే చనిపోయిన ప్రతి కౌలు రైతుకు రూ. 7 లక్షలు నా సొంత డబ్బులే ఇచ్చేవాడిని. ఎవరో వస్తారు ఏదో చేస్తారని నమ్మేవాడిని కాదు. నా వంతు నేను ఏం చేయగలనో అది చేస్తాను.

సుదీర్ఘ ప్రయాణం కూడా ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుందని నమ్మేవాడిని.. కనుకే నా వంతుగా రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చాను. నన్ను నమ్మి చాలా మంది మా పార్టీ నాయకులు డొనేషన్లు ఇస్తున్నారు. వాటిని ప్రత్యేక బ్యాంకు ఎకౌంటులో వేస్తాము. మీరిచ్చిన సొమ్ము ఎవరికి వెళ్లిందో మీకు తెలిసేలా చర్యలు తీసుకుంటాం. నేను కర్మఫలాన్ని నమ్ముతాను. పదవి రాకుంటే ప్రజల దాసుడిగా పనిచేస్తాను. పదవి వస్తే పదవితో కూడిన దాసుడిగా పని చేస్తాను. రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలు మరింత పెరిగే పరిస్థితి ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరియా, ఎరువులు, పురుగు మందుల ధరలు భారీగా పెరగనున్నాయని వార్తలు వస్తున్నాయి. రష్యా నుంచే మనం దాదాపు 40 శాతం ఎరువులను దిగుమతి చేసుకుంటాం. ఈ యుద్ధ పరిస్థితుల వల్ల గత ఏడాది రూ. 500 ఉన్న యూరియ బస్తా, ఇప్పుడు రూ. 1200 కు చేరుకుంది. ఎరువుల ధరలు దాదాపు మూడింతలు పెరిగే అవకాశం ఉంది. దీనిపై వ్యవసాయశాఖ, రెవెన్యూ అధికారులు రైతులకు అర్ధమయ్యే విధంగా దిశానిర్దేశం చేయాలి. వైసీపీ ప్రభుత్వం కూడా మా సూచనలు విజ్ఞతతో తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడి ఎత్తేశారు. డబ్బులు కట్టిన రైతులకు కూడా పరికరాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది.

99 సార్లు యుద్ధం వద్దు అనుకుంటాను…! 100 సారి మాత్రం…:
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వికలాంగురాలైన ఆడబిడ్డను దారుణంగా అత్యాచారం చేశారు. ఆడబిడ్డ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదు. వైసీపీ దారుణమైన పాలనతో పోలీస్ వ్యవస్థ కూడా విసిగిపోతోంది. టీఏ, డిఏలు ఇవ్వడం లేదు. ఖాకీ డ్రెస్ విలువ పోయేలా పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు. ఇలాంటి పాలన మారాలంటే యువత బాధ్యత తీసుకోవాలి. వాళ్లు బాధ్యత తీసుకోకపోతే సమాజంలో మార్పు రాదు. నిన్న 20 మంది వైసీపీ గుండాలు జనసైనికులపై దాడులు చేశారు. కౌలు రైతుల సమ్యలు తీర్చడం చేతకాదు కానీ మా వాళ్లపై మాత్రం దాడులు చేయడానికి సంసిద్ధంగా ఉంటారు. నేను వాళ్లకు ఒకటే చెబుతున్నాను… 99 సార్లు సమస్యను శాంతియుతంగానే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. కాదు కూడదని విర్రవిగితే మాత్రం దానిని ఏ పద్దతిలో చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇంకోసారి జనసైనికులపై దాడులు చేస్తే మాత్రం మర్యాదగా ఉండదు.

అధికారం ఇచ్చింది బ్రాందీ షాపులు పెట్టుకోవడానికా??
వైసీపీ ప్రభుత్వం దృష్టిలో అభివృద్ధి అంటే సారా దుకాణాలు, చికెన్, మటన్ షాపులు పెట్టడం మాత్రమే.. అవి పెట్టుకోవడానికా మీకు అధికారం ఇచ్చింది? ఈ మధ్య ఇదే జిల్లాలో జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి 40 నుంచి 50 మంది చనిపోయారు. ఒక నాయకుడు నా దగ్గరకు వచ్చి వైసీపీ మద్యం తాగితే మూడు నెలల్లో చనిపోతారు. కల్తీ సారా తాగితే మూడు రోజుల్లో చనిపోతారని చెప్పాడు. ఆయన మాటలు నిజమే అనిపించాయి. మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం విచ్చలవిడిగా అమ్ముతూ, పిచ్చి పిచ్చి బ్రాండ్లు మార్కెట్లోకి దింపి అమ్ముతున్నారు. అధికారంలోకి రాగానే రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఏమైంది? ప్రజలు బాధల్లో ఉంటే సంతోషంగా ఉండలేను. అందుకే రెండు చోట్ల ఓడిపోయినా నిలబడే ఉన్నాను. మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీకు మరో అవకాశం వస్తోంది. 2024లో బాగా ఆలోచించి ఓట్లు వేయండి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓటు వేయండి. దీనిపై ప్రజలందరూ ఆలోచించాలి. వైసీపీ ప్రభుత్వ హయాంలో మీకు జరిగిన గొప్ప మేలు ఏంటి అనేది మీకు మీరే ప్రశ్నించుకోండి.. మీ అంతరాత్మకు సమాధానం చెప్పండి. మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఎవరిని ఎన్నుకోవాలో నిర్ణయించుకోవాల”న్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.