KA Paul Sensational Comments ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన శాపం వల్లే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవుని భయంతో బతకాలని హెచ్చరించారు. కవిత కూడా ‘బీ-టీమ్’గా మారుతున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా తనకు 200 కోట్ల మంది అభిమానులున్నారని, తనను అంతం చేయాలని చూసినవారు దారుణంగా చనిపోయారని పాల్ తెలిపారు.
- పవన్ కళ్యాణ్‌పై కేఏపాల్ సంచలన వ్యాఖ్యలు
- తాను ప్రార్థన చేస్తే చనిపోతావ్ అంటూ శాపనార్థం
- గతంలో వైఎస్ కూడా అలాగే చనిపోయారంటూ
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ కళ్యాణ్ జాగ్రత్త.. నేను ఒక్క ప్రార్థన చేస్తే రాజశేఖర్‌రెడ్డిలా చనిపోతావు’ అన్నారు. తన శాపం కారణంగానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2009 ఆగస్టులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తన చారిటీ సంస్థలకు చెందిన 14 బ్యాంకు అకౌంట్‌లను మూసివేసిందని చెప్పుకొచ్చారు. తాను ఉపవాసం ఉండి కన్నీళ్లతో సెప్టెంబర్ 1న ప్రార్థన చేశానని.. సెప్టెంబర్ 2న వైఎస్సార్ హెలికాప్టర్ కూలిపోయిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 58 కేసులు పెడితే 57 వీగిపోయాయన్నారు.. అప్పటి ఒక్క కేసు కూడా త్వరలో క్లీన్ చిట్ వస్తుందన్నారు.
ఏపీ, తెలంగాణ సీఎంలకు వార్నింగ్
‘తెలంగాణను పాలిస్తుంది ఎవరు.. రేవంత్ రెడ్డా లేక చంద్రబాబా.. చంద్రబాబు చెప్పిందే రేవంత్ చేస్తున్నారు. మీ గుండెలు ఆగిపోకముందే, మీకు యాక్సిడెంట్లు అవ్వకముందే దేవుని భయంతో బతకండి. లేదంటే సర్వనాశనం తప్పదు’ అంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కూడా టార్గెట్ చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతారని తాను ముందే చెప్పానన్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీకి, షర్మిల కాంగ్రెస్‌కు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎఆర్‌ఎస్‌కు అమ్ముడుపోతారని కూడా తాను ముందే చెప్పానన్నారు. ఇప్పుడు కవిత కూడా ఎవరికో ఒకరికి ‘బీ-టీమ్’గా మారుతున్నారని ఆరోపించారు.. ఆమె ఓ ప్యాకేజ్ స్టార్ అన్నారు. ప్రజాశాంతి పార్టీలో ఎప్పటి నుంచో నమ్మకంగా ఉన్న ప్రభాకర్‌ను పార్టీ ‘నేషనల్ కోఆర్డినేటర్’గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
వాళ్లంతా నాకు 30 రోజుల్లో క్షమాపణలు చెప్పాలి
ప్రపంచవ్యాప్తంగా తనకు 200 కోట్ల మంది అభిమానులు ఉన్నారని చెప్పుకొచ్చారు పాల్. ప్రధాని మోదీ వంటి ప్రముఖులు కూడా తనను గౌరవిస్తారన్నారు. తనను అంతం చేయాలని చూసినవారు దారుణంగా చనిపోయారని.. తన దేవుడి శక్తి ముందు ఎవరూ నిలబడలేరు అన్నారు. వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాత్రికి రాత్రే ఒక దొంగలా కిడ్నాప్ చేయించారని పాల్ ఆరోపించారు. ఈ పరిణామాలపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రపంచమంతా శాంతిని కోరుకుంటుందని, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా అమెరికాలో చర్చలు జరిగాయని పాల్ తెలిపారు. తాను శాంతి కోసం ప్రార్థిస్తున్నానని, గద్దర్ చనిపోలేదని, అతన్ని చంపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని, 30 రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేఏ పాల్ హెచ్చరించారు.
