Pawan Kalyan : ప‌వ‌న్ ‘లేటెస్ట్‌ ఆప్ష‌న్’ వెనుక కేసీఆర్‌!

`ప్ర‌జ‌ల‌తోనే పొత్తు..` అంటూ జ‌న‌సేనాని ప‌వ‌న్ చేప్పిన ఈక్వేష‌న్ వెనుక కేసీఆర్ పెట్ట‌బోయే బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగ‌డ ఉంద‌నే టాక్ న‌డుస్తోంది. అందుకే, ఆయ‌న గ‌తంలో తీసుకున్న మూడు ఆప్ష‌న్లు కాకుండా ప్ర‌త్యామ్నాయ ఆప్ష‌న్ ఎంచుకున్నార‌ని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - June 21, 2022 / 08:00 AM IST

`ప్ర‌జ‌ల‌తోనే పొత్తు..` అంటూ జ‌న‌సేనాని ప‌వ‌న్ చేప్పిన ఈక్వేష‌న్ వెనుక కేసీఆర్ పెట్ట‌బోయే బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగ‌డ ఉంద‌నే టాక్ న‌డుస్తోంది. అందుకే, ఆయ‌న గ‌తంలో తీసుకున్న మూడు ఆప్ష‌న్లు కాకుండా ప్ర‌త్యామ్నాయ ఆప్ష‌న్ ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న బీజేపీ తో దాదాపు క‌టీఫ్ అనే సంకేతం ప‌వ‌న్ ఇచ్చారు. అంటే, కేసీఆర్ దిశ‌గా జ‌న‌సేనాని అడుగులు వేస్తున్న‌ట్టు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో న‌డుస్తోన్న ప్ర‌చారం.

దేశ వ్యాప్తంగా ప్ర‌త్యామ్నాయ ఎజెండా ఉండాల‌ని కేసీఆర్ భాస్తున్నారు. ప్ర‌జ‌ల ప‌క్షాన నిలిచేందుకు ప్ర‌త్యామ్నాయ ఎజెండాను రూపొందించ‌డానికి మేధావుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. అంతేకాదు, ప్ర‌శాంత్ కిషోర్ లాంటి రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తోనూ త‌ర‌చూ భేటీ అవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీని విలీనం చేయ‌డం ద్వారా బీఆర్ ఎస్ పార్టీని స్థాపించాల‌ని అడుగులు వేస్తున్నారు. ద‌స‌రా కు అటూఇటుగా పార్టీని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మంత్రి మ‌ల్లారెడ్డి అక్టోబ‌ర్ 2న కొత్త పార్టీని కేసీఆర్ ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు. స‌రిగ్గా ప‌వ‌న్ కూడా ద‌సరా త‌రువాత ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డానికి సిద్దం అవుతున్నారు. అటు కేసీఆర్ ఇటు ప‌వ‌న్ ఇద్ద‌రూ కొత్త పంథాలో రాజ‌కీయాన్ని న‌డిపేందుకు `ద‌స‌రా` ముహూర్తాన్ని పెట్టుకున్నారు.

ద‌క్షిణ భార‌త దేశంపై ఉత్త‌ర‌భార‌త నేత‌లు ఆధిప‌త్యం కొనసాగిస్తున్నార‌ని ప‌లుమార్లు ప‌వ‌న్ స్లోగ‌న్ వినిపించారు. జ‌ల్లిక‌ట్టు సంద‌ర్భంగా బ‌లంగా ఆ నినాదాన్ని జ‌న‌సేనాని అందుకున్నారు. ఆ త‌రువాత జ‌రిగిన 2019 ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ప్ర‌తికూల‌ ఫ‌లితాల కార‌ణంగా బీజేపీతో క‌లిసి న‌డుస్తున్నారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లను త‌ర‌చిచూస్తే రాబోవు రోజుల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసే అవ‌కాశం లేక‌పోలేదు. ఢిల్లీ పెత్త‌నంపై ప‌లుమార్లు ప్ర‌శ్నించిన ప‌వ‌న్ బీఆర్ఎస్ పార్టీతో చేతులు క‌లిపినా ఆశ్చ‌ర్యం లేదు. పైగా ద‌క్షిణ భార‌త‌దేశంలోని సినిమా స్టార్ల మీద ఎక్కువ‌గా కేసీఆర్ దృష్టి పెట్టారు. ఆ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ప్ర‌కాష్ రాజ్ ఫాంహౌస్‌ భేటీల్లో కీల‌కంగా ఉన్నారు. త‌మిళ‌నాడు కు చెందిన హీరో విజ‌య్ తో ఇటీవ‌ల కేసీఆర్ స‌మావేశం అయ్యారు. టాలీవుడ్‌, కోలీవుడ్, శాండిల్ వుడ్ హీరోలు, న‌టుల‌ను క‌లుపుకుని వెళ్లాల‌ని కేసీఆర్ మాస్ట‌ర్ ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. ఆ కోణం నుంచి ఆలోచిస్తే, ప‌వ‌న్ కు రాబోవు రోజుల్లో కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చే అవ‌కాశం లేక‌పోలేదు.

ఇటీవ‌ల సినిమా వేడుకల్లోనూ ప‌వ‌న్, మంత్రి కేటీఆర్ ఒకే వేదిక‌పై క‌నిపిస్తూ ప‌ర‌స్ప‌రం ప్ర‌శంస‌లు కురిపించుకోవ‌డం చూశాం. భార‌తదేశంలోనే బ‌ల‌మైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న హీరో ప‌వ‌న్ అంటూ కీర్తించారు కేటీఆర్. తెలంగాణ‌లో అద్భుత‌మైన పాల‌న కొన‌సాగుతుంద‌ని ప‌వ‌న్ కీర్లించ‌డాన్ని గ‌మ‌నిస్తే క‌ల్వ‌కుంట్ల కుటుంబం, ప‌వ‌న్ ను ద‌గ్గ‌ర‌కు తీస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. బీమ్లా నాయ‌క్ సినిమా విడుద‌ల కు ముందుగా ఏపీ ప్ర‌భుత్వం టిక్కెట్ల ఆన్ లైన్ విధానం, ధ‌ర‌ల నియ‌త్ర‌ణ బిల్లు తీసుకొచ్చింది. ఆ స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం బీమ్లా నాయ‌క్ సినిమా టిక్కెట్ల ధ‌ర‌లు పెంపు, బెనిఫిట్ షోలు వేసుకోవ‌డానికి అవ‌కాశం ఇచ్చింది. రాజ‌కీయంగా మ‌హ‌బూబన‌గ‌ర్, హైద‌రాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీఆర్ఎస్ పార్టీకి జ‌న‌సేన మ‌ద్థ‌తు ఇచ్చింది. ఒక‌ప్పుడు ప‌వ‌న్ ఎవ‌రో తెలియ‌దంటూ సెటైర్లు వేసిన కేసీఆర్ ఇప్పుడు ఆయ‌న గురించి మాట్లాడుతున్నారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే జాతీయ స్థాయి ప్ర‌త్యామ్నాయం కోసం ఏర్పాటు కానున్న బీఆర్ఎస్ పార్టీ ని మ‌రో ఆప్ష‌న్ గా ప‌వ‌న్ ఎంచుకుంటారేమో..అనే అనుమానం రాక‌మాన‌దు.

సామాజిక ఈక్వేష‌న్ ప‌రంగానూ ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల కేసీఆర్ సామాజిక‌వ‌ర్గం ఓట్లు ఉన్నాయి. జ‌న‌సేనాని ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం, కేసీఆర్ సామాజిక‌వ‌ర్గం ఓట్లు క‌లిస్తే కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు న‌ల్లేరుమీద న‌డ‌క‌నే స‌రికొత్త స‌ర్వే రిపోర్ట్ పీకే ఇచ్చిన‌ట్టు తెలంగాణ భ‌వ‌న్ వ‌ర్గాల వినికిడి. గ‌తంలో కేసీఆర్ విశాఖ‌, తిరుప‌తి, అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌నల సంద‌ర్భంగా ఏపీ ప్ర‌జ‌ల నుంచి సానుకూల స్పంద‌న క‌నిపించింది. పైగా 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల తరువాత నుంచి ఏపీ ఎన్నిక‌ల‌పై ప‌రోక్షంగా కేసీఆర్ ప్ర‌భావం ఉంది. టీఆర్ఎస్ పార్టీని తెలుగు రాష్ట్ర స‌మితిగా మార్చుతామ‌ని ఒకొనొక సంద‌ర్భంలో కేటీఆర్ ప్ర‌స్తావించారు. అంతేకాదు, భీమ‌వ‌రం నుంచి పోటీ చేస్తాన‌ని కూడా చ‌మ‌త్కారంగా అన్నారు. ఇలాంటి ప‌రిణామాల‌న్నింటినీ ఒక‌చోట చేర్చి చూస్తే ఏపీలోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి జ‌న‌సేన పార్టీని ఒక సాధనంగా కేసీఆర్ భావిస్తున్నార‌ని అనుకోవ‌డంలో త‌ప్పులేదేమో!