Pawan Kalyan: పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ.. ఏం మాట్లాడారంటే?

ఏపీలో పొలిటికల్ హీట్ మొదలైంది. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు.

  • Written By:
  • Publish Date - January 8, 2023 / 06:25 PM IST

Pawan Kalyan: ఏపీలో పొలిటికల్ హీట్ మొదలైంది. నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ లోని తన నివాసంలో పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు నాయుడు మీడియా ముందుకు వచ్చారు. సమావేశంలో ఇద్దరూ జీవో నెంబర్ 1 గురించి చర్చించినట్లుగా తెలిపారు. ఏది ఎప్పుడు చేయాలో రాజకీయ పార్టీలకు వ్యూహాలుంటాయని, పొత్తులపై ఇప్పుడు చర్చించలేదని తెలిపారు.

ఎన్నికలకు ముందుగా పొత్తులపై చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజకీయ పార్టీలు ఏకం కావాలని చంద్రబాబు నాయుడు సూచించారు. పార్టీల మనుగడ ఉంటేనే పొత్తులు ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో అసెంబ్లీలో తాను మాట్లాడేందుకు లేస్తే ఆయన కూర్చోని వినేవాడని, తాను సీఎంగా ఉన్న టైంలో అలాంటి సంస్కారమే ఉండేదని తెలిపారు.

అయితే జగన్ మాత్రం ఓ సైకోలా వ్యవహరిస్తూ గత నాలుగేళ్లుగా తనను అనేక రకాలుగా అవమానించారని తెలిపారు. జగన్ ను ఎదుర్కొనేందుకు అందరూ కలిసి ప్రయత్నిస్తున్నామన్నారు. చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కంటే జగన్ అంత గొప్పోడు ఏం కాదని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఏం చేయాలో అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కష్టపడుతామన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ కంటే అనేక భయంకర పరిస్థితులు వాటిల్లాయని, ఎమర్జెన్సీలో కూడా రాత్రి పూట పోలీసులు గోడలు దూకి వచ్చేవారు కాదని, కానీ జగన్ పాలనలో రాత్రిల్లు కూడా పోలీసులు గోడదూకి వచ్చి అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొత్తులపై ఇప్పుడేమీ చర్చించలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై, దాని ఆగడాలపై చర్చించామని, ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ భేటీ అయ్యామని అన్నారు. జీవో నంబర్1 విషయమై న్యాయపోరాటమా, ప్రజా పోరాటమా, వీధి పోరాటం చేయాలా అనే విషయమై ఇద్దరం మాట్లాడుకున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.