Site icon HashtagU Telugu

AP Politics : `డేంజ‌ర్` పాలి`ట్రిక్స్` లో ఉత్త‌రాంధ్ర‌

Pawan Botsa

Pawan Botsa

క్ష‌ణ‌క్ష‌ణం అక్క‌డ ఉత్కంఠ‌. ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఉంటాయోన‌ని ఆందోళ‌న‌. ఊపిరి స‌ల్ప‌నంత‌గా గంద‌ర‌గోళం. ఇలాంటి ప‌రిస్థితి ఎక్క‌డో కాదు, ఒక‌ప్పుడు ప్ర‌శాంతంగా ఉండే ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో నెల‌కొంది. దానికి కార‌ణం ప్ర‌ధాన పార్టీల నిర్ణ‌యాలు, అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ చేస్తోన్న మ‌హాపాద‌యాత్ర వెర‌సి ఉత్త‌రాంధ్రలో నివురుగ‌ప్పిన నిప్పులా రాజ‌కీయం ఉంది. అక్కడి పోలీసులు నిద్ర‌లేని రాత్రులు గడిపేలా చేస్తోంది,

తెల్ల‌వారితే జ‌న‌సేనాని ప‌వ‌న్ విశాఖ‌ప‌ట్నంకు వెళుతున్నారు. అక్క‌డ ఆ పార్టీ నాయ‌కులు, వ‌లంటీర్ల‌తో భేటీ కానున్నారు. ఆ మేర‌కు ప‌దో తేదీన ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ట్వీట్ట‌ర్ వేదిక‌గా దానికి ప్ర‌చారం పెద్ద ఎత్తున చేశారు. ఈనెల 15, 16, 17 తేదీల్లో ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ అయింది. స‌రిగ్గా ఈనెల 15వ తేదీన‌ విశాఖ కేంద్రంగా వైసీపీ వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ధ‌తుగా గ‌ర్జ‌న స‌భ‌ను పెట్టింది. అందుకే, ప‌వ‌న్ షెడ్యూల్ ను మార్చుకోవాల‌ని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ హిత‌వు పలికారు. ప్ర‌తిగా గ‌ర్జ‌న ఎవ‌రికోసం అంటూ ప‌వ‌న్ ట్వీట్ల వ‌ర్షాన్ని కురిపిస్తున్నారు. ఫ‌లితంగా హై టెన్ష‌న్ ఉత్త‌రాంధ్ర కేంద్రంగా నెల‌కొంది.

వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తుగా ఈ నెల 15న విశాఖ గ‌ర్జ‌న పేరిట ఓ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్న‌ట్లు విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌క‌టించారు. ఆ రోజున విశాఖ‌లోని అంబేద్క‌ర్ విగ్ర‌హం నుంచి వైఎస్సార్ విగ్ర‌హం వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హించేలా షెడ్యూల్ ఖ‌రారు చేశారు. ఆ ర్యాలీకి స‌మాంత‌రంగా ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలు చేప‌ట్టాల‌ని పిలుపునివ్వ‌డం మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతోంది. మూడు రోజుల పాటు (ఈ నెల 15, 16, 17 తేదీల్లో) ప‌వ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల 16న విశాఖ‌లో జ‌న‌వాణిని నిర్వ‌హిస్తారు. ఆ త‌రువాత ఉత్త‌రాంధ్ర‌కు చెందిన పార్టీ ముఖ్య నేత‌ల‌తో భేటీ కానున్నారు. జనసేన భవిష్యత్తు కార్యాచరణపై పవన్‌ కల్యాణ్ పార్టీ నాయకులకు, శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

విశాఖ గర్జనను డైవర్ట్ చేయడానికే పవన్ విశాఖలో పర్యటిస్తున్నారని వైసీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఇదంతా తెర వెనుక చంద్రబాబు న‌డిపిస్తోన్న పాలిటిక్స్ గా భావిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర స‌రిహ‌ద్దుల్లోకి ఈనెల 15వ తేదీ నాటికి మ‌హాపాద‌యాత్ర కూడా చేరుకుంటుంది. ఇప్ప‌టికే గోదావరి జిల్లాల‌కు చేరిన అమరావ‌తి రైతుల పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డానికి వైసీపీ క్యాడ‌ర్ ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇక ఉత్త‌రాంధ్ర జిల్లాల‌కు చేరిన వెంట‌నే వికేంద్ర‌క‌ర‌ణ‌కు మ‌ద్ధ‌తుగా ఏర్ప‌డిన జేఏసీ అమ‌రావ‌తి రైతుల యాత్ర‌ను డైరెక్టుకు అడ్డుకోవ‌డానికి సిద్ధం అయింది. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండాల‌ని అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి మహాపాద‌యాత్ర ఒక వైపు, మూడు రాజ‌ధానుల‌కు అండ‌గా జేఏసీ ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా ర్యాలీలు ఇంకో వైపు ప‌వ‌న్ ఉత్త‌రాంధ్ర జిల్లాల ప‌ర్య‌ట‌న వెర‌సి అడుగడుగునా టెన్ష‌న్ నెల‌కొంది.

జ‌న‌సేనాని విశాఖ ప‌ర్య‌ట‌న కోసం ఆ పార్టీ క్యాడ‌ర్ ప్లెక్సీల‌ను ఏర్పాటు చేసింది. వాటిని వికేంద్ర‌క‌ర‌ణ జేఏసీ, వైసీపీ క్యాడ‌ర్ సంయుక్తంగా రాత్రికిరాత్రి తొల‌గించ‌డం జరిగింది. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రిస్తారా? విశాఖ గ‌ర్జ‌న స‌భ‌ను నిలువ‌రిస్తారా? స‌మాంత‌రంగా రెండింటీని అనుమ‌తిస్తూ అమ‌రావ‌తి మ‌హాపాద‌యాత్ర‌ను ఆపేస్తారా? అనేది సందిగ్ధంగా ఉంది.