PK On Corona:కరోనా తీవ్రతరమవుతోంది… అప్రమత్తత అవశ్యం – పవన్ కళ్యాణ్

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా బారిన పడుతున్న సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సమాచారం మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం.

Published By: HashtagU Telugu Desk
pawan kalyan

pawan kalyan

దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరోనా బారిన పడుతున్న సంఖ్య దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న సమాచారం మీడియా ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. దేశంలో నిన్న ఒక్క రోజే లక్ష 80 వేల మందికి కరోనా సోకినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అంతకు ముందు రోజు ఆ సంఖ్య లక్ష 59 వేలుగా ఉందంటే మహమ్మారి వేగంగా విస్తరిస్తోందని అందరూ గమనించాలి. ఆంధ్ర ప్రదేశ్ లో 12వందలకు పైగా, తెలంగాణలో 15వందలకు పైగా కేసులు నమోదయ్యాయి అని తెలిసింది.
చూస్తుండగానే కరోనా సోకిన వారు మన చుట్టూ పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా యాక్టీవ్ కేసులు 7.23 లక్షలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పిన క్రమంలో మనమందరం అప్రమత్తంగా ఉండి ఈ మహమ్మారిని పారద్రోలుదాం. వైద్య నిపుణులు సూచనలు అందరం అనుసరించాలి. భౌతిక దూరాన్ని పాటించడంతోపాటు ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా ఇంటి నుంచి బయటకు వెళ్ళవలసివచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ వాడండి. అందుబాటులో ఉంటే డబుల్ మాస్క్ ధరించండి. విందులు, సమావేశాలు వంటి వాటిని కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడం ఉత్తమం. రాబోయే సంక్రాంతిని కూడా కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోడానికి ప్రయత్నించండి. ఇప్పటి వరకు టీకా తీసుకొనేవారు తప్పనిసరిగా టీకా వేయించుకోండి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలతో కరోనా ఉధృతాన్ని కొంతవరకు తగ్గించుకోగలం.
ముఖ్యంగా జన సైనికులకు నా విన్నపం… మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కరోనాతో ఆపదలో ఉన్నవారిని ఎప్పటిలాగే ఆదుకోండి. ఈ క్రమంలో మీరు సైతం అత్యంత జాగ్రత్తలు పాటించండి.
కరోనా సెకండ్ వేవ్ లో మందులు, ఆక్సిజన్ దొరకక ప్రజలు అల్లాడిపోయారు. ఎందరినో ఆ సమయంలో మనం కోల్పోయాం. ఈసారి అటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవలసిందిగా తెలుగు రాష్ట్రాలలోని ప్రభుత్వాలను కోరుతున్నాను. ప్రభుత్వాలు తక్షణమే అప్రమత్తం కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

  Last Updated: 19 Jan 2022, 07:34 PM IST