Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

Gudem Village Electrification : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటినా, ఇంకా విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాలు దేశంలో ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Pawan Gudem

Pawan Gudem

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటినా, ఇంకా విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాలు దేశంలో ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని ‘గూడెం’ అనే చిన్న గ్రామం అలాంటిదే. కొండలు, అడవుల మధ్య విసిరేసినట్టు ఉన్న ఈ పల్లె ప్రజలు ఇప్పటి వరకు చీకటిలోనే జీవించారు. రాత్రి వేళల్లో అడవి జంతువుల భయం, రోడ్లు లేకపోవడం, తాగునీటి సమస్యలు ఇవి వారి జీవితంలో భాగంగా మారాయి. అయితే, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో ఆ గూడెం గ్రామంలో తొలిసారిగా విద్యుత్ వెలుగులు వెలిగాయి. కార్తీక పౌర్ణమి రాత్రి ఆకాశంలో వెన్నెల కాంతులు వెలుగుతుండగా, గూడెం ప్రజల ఇళ్లలో విద్యుత్ బల్బులు మెరిసి ఆనందాన్ని నింపాయి.

Pawan Gudem Current2

గతంలో ఎన్నోసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులకు తమ సమస్యను చెప్పినా ఫలితం లేకపోయింది. కానీ ఐదు నెలల క్రితం గ్రామస్తులు పవన్ కల్యాణ్‌ను నేరుగా కలిసి తమ బాధను వివరించారు. “మా ఊరిలో కూడా వెలుగులు రావాలి” అని చేసిన విజ్ఞప్తిని పవన్ గంభీరంగా తీసుకున్నారు. ఆయన వెంటనే అల్లూరి జిల్లా కలెక్టర్‌, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించి, తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 17 కుటుంబాలకు విద్యుత్ అందించేందుకు 9.6 కిలోమీటర్ల పొడవునా అడవి ప్రాంతం గుండా లైన్లు వేయాల్సి వచ్చింది. ఇది సాధారణ పనికాదు – రాతి కొండల మధ్య 217 స్తంభాలను మానవ బలంతో మోసుకెళ్లి స్థాపించాల్సి వచ్చింది. రూ.80 లక్షల ఖర్చుతో ఈ ప్రాజెక్ట్‌ను విద్యుత్ శాఖ యజ్ఞంలా పూర్తి చేసింది. ఈ క్రమంలో కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ పీవీజీటీ పథకం ద్వారా నిధులు సమకూర్చగా, రాష్ట్ర విద్యుత్ శాఖ సాంకేతిక సహకారాన్ని అందించింది.

Pawan Gudem Current

ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన అంశం హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థ. పీఎం జన్మన్ పథకం కింద రూ.10.22 లక్షలతో సోలార్, పవన విద్యుత్ మిశ్రమ వ్యవస్థను గూడెం గ్రామంలో ఏర్పాటు చేశారు. దీని వల్ల గ్రిడ్‌లో సమస్య వచ్చినా, సూర్యశక్తి లేదా గాలిశక్తి ద్వారా నిరంతరాయంగా విద్యుత్ లభిస్తుంది. ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఐదు బల్బులు, ఒక ఫ్యాన్‌ను ఉచితంగా అందించింది. ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తవడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం వల్లే ఇది సాధ్యమైందన్నారు. గూడెం ప్రజలు విద్యుత్ వెలుగులు చూసి హర్షాతిరేకాలతో సంబరాలు జరుపుకున్నారు. “ఇంతకాలం చీకట్లో ఉన్న మా జీవితాల్లో వెలుగు నింపిన పవన్‌గారికి ధన్యవాదాలు” అంటూ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చీకటిలో మునిగిపోయిన గూడెం గ్రామం ఇప్పుడు ప్రకాశవంతమైన పల్లెగా మారి, గిరిజన అభివృద్ధికి కొత్త దీపంలా వెలుగుతోంది.

  Last Updated: 06 Nov 2025, 12:38 PM IST