Site icon HashtagU Telugu

Telugu Bhasha Dinotsavam : తెలుగు భాషను గౌరవించుకుందాం – పవన్ కళ్యాణ్

Telugu Bhasha Dinotsavam

Telugu Bhasha Dinotsavam

నేడు తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి జయంతి (Gidugu Venkata Ramamurthy Jayanti). మనం ప్రతి యేటా ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవం (Telugu Language Day) జరుపుకొంటాము. తెలుగు భాషకు గిడుగు చేసిన సేవలను గౌరవించటానికి.. ఆయన జయంతి నాడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఈ సందర్బంగా ప్రతి తెలుగు వారు తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడుకుంటున్నారు.

దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు చెప్పినా.. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తీ గలవోడా.. అనే వేములపల్లి గీతం ఆలపించిన తెలుగువారి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. దేశంలో 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఈ రోజు సభలు జరిపి, పదోతరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో తెలుగులో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహకాలని, తెలుగు భాషా చైతన్య సమితి లాంటి స్వచ్ఛంద సంస్థలు అందచేస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషి చేస్తున్నారు. తెలుగు భాషలోనే విద్యా బోధన, ప్రజా పరిపాలన కొనసాగాలని తెలుగు నాడు సమితి గత 20 సంవత్సరాల నుండి కృషి చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966వ సంవత్సరంలోలో తెలుగు భాషను రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లోనూ తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. ఇక 2008వ సంవత్సరంలో కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగానూ గుర్తించారు. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష తెలుగు కావడం విశేషం.

ఇక తెలుగు భాషా దినోత్సవం రాజకీయ ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేస్తూ వస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలందరికి విషెష్ అందించారు. దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు భాషాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన మహనీయులను నేడు తలచుకోవడం ద్వారా అమ్మ భాషకు సేవ చేసిన తెలుగు పెద్దలకు కృతజ్ఞతలు చెబుదామని ట్విటర్ వేదికగా చంద్రబాబు తెలిపారు. వారి అడుగు జాడల్లో నడుస్తూ మన భాషను సుసంపన్నం చేసుకుందామన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని ముందు తరాలకు అందించే బృహత్ బాధ్యతను మనం తీసుకుందామన్నారు. అదే వారికి మనమిచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు.

తెలుగు భాషను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. నవతరానికి తెలుగు భాష గొప్పదనాన్ని తెలియజేయాలని కోరారు. ‘ప్రభుత్వ కార్యక్రమాల్లో తెలుగుకు ప్రాధాన్యం కల్పించాలి. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు మాతృభాష విలువ తెలియజేయాలి. తెలుగు తీయదనాన్ని భావితరాలకు అందించాలి. నిత్య వ్యవహారాల్లో తెలుగుకు పట్టం కడితేనే తెలుగు భాషా దినోత్సవానికి సార్థకత’ అని ఆయన పేర్కొన్నారు.

Read Also : Insulin Plant: డయాబెటీస్‌తో బాధ‌పడేవారికి గుడ్ న్యూస్‌.. ఈ మొక్క వాడితే ప్ర‌యోజ‌నాలే..!