జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటన ఖరారైంది. అక్టోబర్ 5 నుంచి పవన్ బస్సుయాత్ర షురూ కానుంది. మంగళగిరిలో జరిగిన ఐటీ విభాగం సదస్సు సందర్భంగా జనసేనాని బస్సు యాత్ర తేదీని పార్టీ పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జనసేన ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు. అందులో భాగంగానే ముందుగానే ప్రజల మధ్యకు వెళ్లి.. ఎన్నికల సమయానికి రాష్ట్ర వ్యాప్త పర్యటన పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా.. అక్టోబర్ 5వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.
అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడం ద్వారా క్యాడర్‌ను బలోపేతం చేయాలని జనసేన భావిస్తోంది. గతంలోనే దీని పై నిర్ణయం తీసుకున్నప్పటకీ ఆ తరువాత అనేక దశల్లో ఈ యాత్ర నిర్వహణ పైన చర్చలు చేసారు. ఇప్పుడే యాత్ర ప్రారంభిస్తే ఎన్నికల సమయం వరకు ఎలా కొనసాగించాలనే అంశంపై చర్చించారు. పలు దఫాలుగా చర్చించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ఈ యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 2014లో టీడీపీకి మద్ధతిచ్చిన జనసేన గత ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగి ఒక్క సీటుకే పరిమితమైంది.
ఈ సారి పొత్తులతోనే వెళ్లాలని పవన్ భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే మూడు ఆప్షన్లు పెట్టుకున్నారు. అయితే పవన్ చెప్పిన ఆప్షన్స్‌పై టీడీపీ ఇప్పటి వరకూ స్పందించలేదు. మరోవైపు ఒంటరిగా ఎన్నికలకు వెళితే పరిస్థితి ఏంటనే దానిపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్ళడంపైనే దృష్టి పెడితే మంచిదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో బస్సు యాత్రను మొదలుపెడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఐటీ విభాగానికి పలు కీలక సూచనలు చేశారు.
పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీ వింగ్ కీలకమని తెలిపారు. ఐటీ వింగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరే విధంగా పనిచేయాలని సూచించారు. ప్రస్తుత రాజకీయాల్లో సోషల్ మీడియానే కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మరోవైపు బస్సుయాత్ర తేదీ ఖరారవడంతో పార్టీ క్యాడర్‌లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటి వరకూ పలుసార్లు ప్రజల్లోకి వచ్చినా మధ్యమధ్యలో సినిమా షూటింగ్స్ కోసం విరామం తీసుకుంటూ పవన్ రాజకీయాలు చేస్తున్నారు. దీనిపై విమర్శలు కూడా ఎదుర్కొంటున్న జనసేనాని ఇక ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్ళకుంటే వచ్చే ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించే అవకాశం ఉండదని చాలా మంది విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో బస్సుయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు ప్రజల్లోకి తమ ఆశయాలను తీసుకెళ్ళనున్నట్టు తెలుస్తోంది.