క్లైమాక్స్ కు జ‌న‌సేన‌, బీజేపీ `పొత్తు` ఆట

జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య చెడిందా? స‌మ‌న్వ‌యం లోపించిందా? ఆ రెండు పార్టీలు వేర్వేరు ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నాయా? బ‌ద్వేల్ అభ్య‌ర్థిత్వం రూపంలో ఇరు పార్టీలు విడాకులు తీసుకున్న‌ట్టేనా?..అంటే ఔను విడిపోవ‌‌డానికి ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని ప‌రిణామాలు చెబుతున్నాయి.

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:20 PM IST

జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య చెడిందా? స‌మ‌న్వ‌యం లోపించిందా? ఆ రెండు పార్టీలు వేర్వేరు ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నాయా? బ‌ద్వేల్ అభ్య‌ర్థిత్వం రూపంలో ఇరు పార్టీలు విడాకులు తీసుకున్న‌ట్టేనా?..అంటే ఔను విడిపోవ‌‌డానికి ఎక్కువ అవ‌కాశాలున్నాయ‌ని ప‌రిణామాలు చెబుతున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న‌ప్ప‌టి నుంచి పెద్ద‌గా క‌లిసి పోరాడిన సంద‌ర్భాలు లేవు. ప్ర‌స్తుతం ఉన్న వైసీపీ ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై బీజేపీ, జ‌న‌సేన ఒక వేదిక‌ను పంచుకోలేదు. పొత్తు అనేదానికి అర్థం లేకుండా పోయింది. విలువ ఇవ్వ‌న‌ప్ప‌టికీ ఇంత‌కాలం జ‌న‌సేనాని ఓపిక ప‌ట్టారు. ఇక క‌టీఫ్ చెప్ప‌డానికి సిద్ధం అవుతున్నార‌ని పార్టీ అంత‌ర్గ‌త వ‌ర్గాల టాక్.

బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌ల నోటిషికేష‌న్ వెలువ‌డిన రోజు ప‌వ‌న్ స్పందించారు. అభ్య‌ర్థిని అక్క‌డ పోటీ పెట్ట‌మ‌ని రాజ‌మండ్రి శ్ర‌మ‌దానం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన వేదికపై ఆ మేర‌కు ప్ర‌క‌టించారు. ఏక‌ప‌క్షంగా జ‌న‌సేనాని చేసిన ప్ర‌క‌ట‌న‌గా బీజేపీ భావించింది. బ‌ద్వేల్ బ‌రిలోకి బీజేపీ అభ్య‌ర్థిని దింపుతామ‌ని ఆ పార్టీ ఏపీ విభాగం వెల్ల‌డించింది. అందుకోసం న‌లుగురు అభ్య‌ర్థుల పేర్ల‌ను ప‌రిశీలిస్తోంది. ఎవ‌రో ఒక‌ర్ని బ‌రిలోకి దింపాల‌ని యోచిస్తోంది. బీజేపీ బ‌లం ఎంతో తేల్చుకోవ‌డానికి బ‌ద్వేల్ ను గ్రౌండ్ గా భావిస్తోంది. వాస్త‌వంగా జ‌న‌సేన మంగ‌ళ‌గిరిలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి స‌మావేశం త‌రువాత బీజేపీ చీఫ్ సోము వీర్రాజు, ప‌వ‌న్ క‌లిశారు. వాళ్లిద్ద‌రి మ‌ధ్యా బ‌ద్వేల్ అంశం ఖ‌చ్చితంగా చ‌ర్చ‌కు వ‌చ్చి ఉండాలి. జ‌న‌సేన అభ్య‌ర్థిని పెట్టాల‌ని బీజేపీ సూచించింద‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కానీ, హ‌ఠాత్తుగా ప‌వ‌న్ మాత్రం బ‌ద్వేల్ ఉప పోటీకి దూరమ‌ని తెగేసి చెప్పారు. దీంతో పొత్తు ధ‌ర్మం రాజ‌కీయ దూమారంలో క‌లిపిపోయింది.
ఇటీవ‌ల జ‌రిగిన తిరుప‌తి పార్ల‌మెంట్ ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా అభ్య‌ర్థిత్వం విష‌యంలో ఇరు పార్టీల మ‌ధ్య దూరం పెరిగింది. జన‌సేన అభ్య‌ర్థిని అక్క‌డ నుంచి బ‌రిలోకి దింపాల‌ని తొలుత భావించింది. ఆ మేర‌కు అభ్య‌ర్థిత్వం కోసం క‌స‌ర‌త్తు కూడా చేసింది. కానీ, హ‌ఠాత్తుగా బీజేపీ ఏపీ ఇంచార్జి బాంబ్ పేల్చాడు. బీజేపీ అభ్య‌ర్థి తిరుప‌తి పార్ల‌మెంట్ కు పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించాడు. ఆ ప‌రిణామాన్ని జ‌న‌సేన త‌ట్టుకోలేక పోయింది. కొన్ని రోజుల త‌రువాత పొత్తు ధ‌ర్మాన్ని పాటించాల‌ని జ‌న‌సేనాని ఇచ్చిన పిలుపు మేర‌కు స్థానిక లీడ‌ర్ల బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యారు. ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ర‌త్న‌ప్ర‌భ‌ను తిరుప‌తి లోక్ స‌భ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ బ‌హిరంగ స‌భ‌, రోడ్డు షో ను నిర్వ‌హించారు. ర‌త్న‌ప్ర‌భ గెలుపు కోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డాడు. కానీ, డిపాజిట్ల‌ను సాధించ‌లేక‌పోయాడు. దీంతో ఇరు పార్టీల పొత్తు విక‌టించింద‌ని స్ప‌ష్టం అయింది.
తాజాగా సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ అంశంపై రిప‌బ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేదిక మీద ప‌వ‌న్ స్పందించాడు. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని దూకుడుగా విమ‌ర్శించాడు. ప్ర‌తిగా వైసీపీ మంత్రులు ప‌వ‌న్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ఆ స‌మ‌యంలో పొత్తు ధ‌ర్మాన్ని పాటించైనా బీజేపీ నేత‌లు మ‌ద్ద‌తు తెల‌ప‌లేదు. వైసీపీ స‌ర్కార్ చేస్తోన్న ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కాషాయ‌ద‌ళం గ‌ళం జోడించ‌లేదు. పైగా శ్ర‌మ‌దానం కార్య‌క్రమంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన నిర్వాకాన్ని కూడా బీజేపీ త‌ప్పుబ‌ట్ట‌లేదు. ఇదంతా మ‌న‌సులో పెట్టుకున్న జ‌న‌సేన బ‌ద్వేల్ ఉప పోరుకు బీజేపీ నిర్ణ‌యానికి భిన్నంగా దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది.

వైసీపీ ఎమ్మెల్యే వెంక‌ట‌సుబ్బ‌య్య హ‌ఠాత్మ‌ర‌ణంతో బ‌ద్వేల్ ఉప ఎన్నిక వ‌చ్చింది. అక్క‌డ వెంక‌ట స‌బ్బ‌య్య స‌తీమ‌ణికి వైసీపీ టిక్కెట్ ను ఖ‌రారు చేసింది. సంప్ర‌దాయంగా వ‌స్తోన్న ప‌ద్ధ‌తి ప్ర‌కారం జ‌న‌సేన పోటీకి దూరంగా ఉంది. అదే బాట‌న టీడీపీ కూడా ఎన్నిక‌కు దూరంగా ఉండాలని నిర్ణ‌యం తీసుకుంది. బీజేపీ మాత్రం అభ్య‌ర్థిని పెట్ట‌డానికి ఇదే స‌రైన స‌మ‌యంగా భావిస్తోంది. అటూ టీడీపీ ఇటు జ‌న‌సేన బ‌రిలో లేక‌పోవ‌డంతో భారీగా ఓట్ల‌ను పొందొచ్చ‌ని బీజేపీ ఎత్తుగ‌డ‌. ఏపీలో త‌మ స‌త్తా ఏమిటో చూపించ‌డానికి ఇంత‌కంటే మ‌రో అవ‌కాశం రాద‌ని అంచ‌నా వేస్తోంది. కానీ, స‌హ‌జ మిత్రునిగా ఉన్న జ‌న‌సేన‌కు గుడ్ బై చెప్ప‌డానికి కూడా సిద్ధం అవుతోంది. సో..ఇలాంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే, బీజేపీ,జ‌న‌సేన విడాకులకు టైం ద‌గ్గ‌ర ప‌డింద‌న్న‌మాట‌.