`త్యాగానికి ఇక సిద్ధంగా లేం, రెండుసార్లు తగ్గాం..ఇక తగ్గేదెలె..` అంటూ పవన్ స్పీచ్ లోని డైలాగుల చుట్టూ ఏపీ రాజకీయాన్ని వ్యూహాత్మంగా జనసేన తిప్పుతోంది. జనసేనలోని కొందరు లీడర్లు 50-50 గేమ్ ను మొదలు పెట్టారు. అంతేకాదు, పవన్ తొలి రెండున్నరేళ్లు సీఎం ఇవ్వాలని మీడియా వేదికలపై డిమాండ్ పెడుతున్నారు. మహానాడు విజయవంతం తరువాత ఇప్పటి వరకు ఎలాంటి `పొత్తు` సంకేతం సానుకూలంగా టీడీపీ నుంచి లేదు. అయినప్పటికీ పవన్ ఏదో వ్యాఖ్య చేయడం దాని మీద మైండ్ గేమ్ అడుతోంది జనసేన. దీంతో ప్రజల్లో చులకన అవుతున్నామన్న భావన టీడీపీలో కలుగుతోంది. అందుకే, నష్ట నివారణ చర్యలు చేపట్టడానికి సిద్దం అవుతోంది.
జనసేన లీడర్లు పొత్తు అంశంపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పటికీ టీడీపీ వైపు నుంచి మౌనం మాత్రమే సమాధానంగా ఉంది. పవన్ ఆడుతోన్న గేమ్ ను గమనిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో తగ్గినట్టు పవన్ ఫోకస్ చేస్తున్నారు. వాస్తవంగా 2019 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్ట్ లు, బీఎస్పీ పార్టీతో కలిసి జనసేన పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో 120 చోట్ల డిపాజిట్లు రాకపోగా రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. కానీ, త్యాగం చేసినట్టు పవన్ చెప్పడం ఎవరికీ అర్థం కావడంలేదు. ఇక 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ నిర్మాణం ఎక్కడా లేదు. కేవలం రిజిస్ట్రర్ అయిన పార్టీ గా మాత్రమే గుర్తింపు ఉండేది. కొన్ని సభల్లో మాత్రమే మోడీ, చంద్రబాబుతో పవన్ కనిపించారు. దాన్ని కూడా త్యాగం కింద పవన్ చెబుతున్నారు.
పల్లకీలు ఇక మోయం అంటూ పవన్ టీడీపీతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. అంటే, ఇప్పటి వరకు టీడీపీ పల్లకీ మోసినట్టు ఆయన. పరోక్షంగా అంగీకరిస్తున్నారు. ఇక పల్లకీలు మోయమని ఖరాఖండిగా చెబుతున్నారు. అంటే, సీఎం పదవిని ఆయన ఆశిస్తున్నారు. పైగా చంద్రబాబు నాయుడు అందుకు సహకరించాలని కోరుతున్నారు. అత్తారింటికి దారేది తరహాలో పవన్ రాజకీయ దారి వెతుక్కుంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆయన ఒక్కో వేదికపై ఒక్కో రకంగా పొత్తుల గురించి ప్రస్తావిస్తున్నారు. దీంతో ప్రధాన పార్టీలు పవన్ ట్రాప్ లో పడిపోయాయి. ఎన్నికలు ఎప్పుడు వస్తోయో ఇతిమిద్దంగా తెలియనప్పటికీ పొత్తులతో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం పనవ్ చేస్తున్నారు. ఆయన ట్రాప్ లో వైసీపీ, టీడీపీ పడిపోవడంతో పబ్లిక్ మూడ్ అంతటా జనసేన వైపు తిరిగింది. కాబోయే సీఎం పవన్ అనే స్థాయికి ఆ ప్రచారాన్ని తీసుకెళ్లడంలో జనసేన సక్సెస్ అయింది.
సేమ్ టూ సేమ పవన్ టీడీపీపైన ఆడిన మైండ్ గేమ్ ను జనసేనపై ప్రజాశాంతి పార్టీ మొదులు పెట్టింది. అంతేకాదు, పవన్ కు 1000 కోట్ల రూపాయాల బంపరాఫర్ ను కూడా పాల్ ఇచ్చారు. జనసేన పార్టీని వీడి ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానం అందించారు. ప్రజాశాంతి పార్టీ మినహా ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పవన్ గెలవడని శాపం పెట్టారు. దీంతో ఒక్కసారిగా ప్రజాశాంతి పార్టీ వైపు ఏపీ ప్రజల చూపు మళ్లింది. పైగా కాబోయే ప్రధాని పాల్, కాబోయే ఏపీ సీఎం పవన్ అంటూ సోషల్ మీడియా పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. ఫలితంగా జనసేనపై పాల్ ఆడిన గేమ్ చాలా వరకు సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. పరస్పరం పొత్తు రూపంలో ట్రాప్ వేసుకుంటూ ఏపీలోని రాజకీయ పార్టీలు రాష్ట్ర సమస్యలను నాన్ సీరియస్ గా తీసుకోవడం గమనార్హం.
