Site icon HashtagU Telugu

TDP Palnadu : పుల్లారావు స‌త్తాకు `ప‌ల్నాడు` ప‌రీక్ష‌

Pulla Rao

Pulla Rao

ఏపీ టీడీపీ ఒంగోలు కేంద్రంగా నిర్వ‌హించిన మ‌హానాడు మ‌రుపురానిది. ఆ రోజు నుంచి టీడీపీ దూకుడుగా వెళుతోంది. కొత్త‌ జిల్లాలను కేంద్రంగా చేసుకుని మినీ మ‌హానాడుల‌ను నిర్వ‌హిస్తూ క్యాడ‌ర్ కు నూతనోత్సాహాన్ని చంద్ర‌బాబు నింపుతున్నారు. తాజాగా ప‌ల్నాడు కేంద్రంగా మినీ మ‌హానాడును నిర్వ‌హించడానికి తేదీల‌ను టీడీపీ ప్ర‌క‌టించింది. ఒంగోలు మ‌హానాడును మించేలా విజ‌య‌వంతం చేయాల‌ని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.

మహానాడు విజయవంతానికి ప‌ల్నాడు జిల్లా కేంద్రాన్ని ఈసారి టీడీపీ ఎంచుకుంది. ఆ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అక్క‌డి నాయ‌కులు, కార్యకర్తలు పట్టుదలతో కృషి చేసి కదం తొక్కాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. ఈనెల 12, 13, 14 తేదీల్లో మహానాడు జ‌ర‌గ‌నుంది. ప‌ల్నాడు జిల్లాలోని న‌ర్స‌రావుపేట వేదిక‌గా ఈనెల 12వ తేదీన నరసరావుపేట వేదికగా మహానాడును పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌డానికి టీడీపీ సిద్దం అయింది.

న‌ర్స‌రావుపేట పార్ల‌మెంట్ ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల లీడ‌ర్ల‌తో ఈనెల 13వ తేదీన చిల‌క‌లూరిపేట కేంద్రంగా స‌మీక్షా స‌మావేశం జ‌ర‌గ‌నుంది. గుంటూరు జిల్లాలోని పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలలో `బాదుడే బాదుడు` కార్యక్రమం ఈనెల 14వ తేదీ నిర్వ‌హించ‌బోతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట వేదికగా లక్షన్నర నుంచి 2 లక్షల మందిని త‌ర‌లించ‌డం ద్వారా మ‌హానాడును విజ‌య‌వంతం చేయాల‌ని టీడీపీ ప్ర‌య‌త్నం చేస్తోంది.

మొత్తం మీద మూడు రోజుల పాటు గుంటూరు, ప‌ల్నాడు కేంద్రంగా టీడీపీ హ‌డావుడి చేయనుంది. ఆ మ‌హానాడు ద్వారా గుంటూరు జిల్లాపై టీడీపీకి ఉన్న బ‌లం ఏమిటో నిరూప‌ణ చేయాల‌ని భావిస్తోంది. మాజీ మంత్రి పుల్లారావు ఈ మ‌హానాడు విజ‌య‌వంతాన్ని భుజాన వేసుకున్నార‌ని తెలుస్తోంది. గ‌త మూడేళ్లుగా ఆయ‌న పార్టీ కార్య‌క్ర‌మాల్లో పెద్ద‌గా చురుగ్గా పాల్గొన‌లేదు. ఇటీవ‌లే మ‌ళ్లీ యాక్టివ్ అయ్యారు. టీడీపీ ప్ర‌భుత్వం ఉన్న‌ప్పుడు గుంటూరు కేంద్రంగా చ‌క్రం తిప్పిన ఆయ‌న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయిన త‌రువాత వ్యూహాత్మ‌క దూరం పాటించారు. ఇప్పుడు క్యాడ‌ర్ ఆయ‌న వెంట ఏ మాత్రం న‌డుస్తుందో చూడాలి.