Site icon HashtagU Telugu

AP Politics : ఎన్నిక‌ల్ని త‌ల‌పిస్తోన్న‌ ప్ర‌చార హోరు

ఏపీ రాష్ట్రంలో ఎన్నిక‌ల హ‌డావుడి క‌నిపిస్తోంది. అధికార, విప‌క్ష పార్టీలు పోటాపోటీగా కార్య‌క్ర‌మాల‌ను రూప‌క‌ల్ప‌న చేసుకుని ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళుతున్నాయి. ప్ర‌స్తుతం టీడీపీ `బాదుడే బాదుడు` పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మిస్తోంది. సీఎం జ‌గ‌న్మోన్ రెడ్డి స‌ర్కార్ పెంచిన ధ‌ర‌లు, ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు బ‌లంగా టీడీపీ తీసుకెళుతోంది. ఆ పార్టీ చీఫ్ చంద్ర‌బాబు ఆయా జిల్లాల‌కు వెళుతూ బాదుడేబాదుడు కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వుతున్నారు. క్యాడ‌ర్ ను ఉత్సాహ‌ప‌రుస్తున్నారు. ఇదే త‌ర‌హాలో జ‌న‌సేన చీఫ్ విడ‌త‌ల‌వారీగా కౌలు రైతుల ఆత్మ‌హత్య‌ల‌పై `రైతు ప‌రామ‌ర్శ‌` యాత్ర‌ను చేస్తున్నారు. పార్టీ సొంత నిధుల నుంచి ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతు కుటుంబీకుల‌కు ఒక ల‌క్ష రూపాయాల ఆర్థిక స‌హాయాన్ని అందిస్తున్నారు. విప‌క్షాల‌కు ధీటుగా ఈనెల 26వ తేదీ నుంచి `సామాజిక భేరి` పేరుతో బ‌స్సు యాత్ర‌కు వైసీపీ శ్రీకారం చుట్ట‌నుంది.

ఇప్ప‌టికే వైసీపీ `గ‌డ‌ప‌ గడపకు` కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తోంది. ఆ పార్టీ చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన డైరెక్ష‌న్ మేర‌కు ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళుతున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం `బాదుడేబాదుడు` కు తోడుగా మహానాడు వేదిక‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పాల‌న‌పై స‌మ‌ర‌భేరి మోగించ‌నుంది. బీజేపీ కూడా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను రాష్ట్రానికి రప్పించి బహిరంగ సభల‌ను నిర్వ‌హిస్తున్నారు. బీజేపీ తరపున నడ్డా జూన్ 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించ‌డానికి ఆ పార్టీ నేత‌లు ప్లాన్ చేస్తున్నారు. రాజమహేంద్రవరం, విజయవాడల్లో స‌భ‌ల‌ను పెట్టించాల‌ని ఆలోచిస్తున్నారు. హోరాహోరీగా సాగుతున్న రాజకీయ ప్రచారాన్ని చూస్తుంటే `ముంద‌స్తు` వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

ప్రధానంగా సంక్షేమ పథకాల కార‌ణంగా జగన్ రెడ్డి పాలనా శైలి పట్ల దిగువ‌స్థాయి ఉత్సాహంగా ఉన్నారని స‌ర్వే సారాంశం. అయినప్పటికీ, సమాజంలోని అనేక వర్గాలు, ప్రధానంగా దిగుమ మ‌ధ్య త‌ర‌గ‌తి, అల్పాదాయ వర్గాలు పట్టణ ఉన్నత వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయ‌ని స‌ర్వేల ద్వారా తెలుస్తోంది. ఆ క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్ర‌తి ఇంటికి వెళ్లి ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. వచ్చే రెండేళ్లలో ప్రభుత్వం పట్ల సానుకూలత పెంచేందుకు వీలుగా ప్రతి ఇంటి నుంచి వ‌చ్చే ఫిర్యాదుల‌ను పరిష్కారించాల‌ని మంత్రులు, శాసనసభ్యులకు ఆదేశించారు.

`గ‌డ‌ప‌గ‌డ‌ప‌`కు వెళుతోన్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల‌కు కొన్ని చోట్ల వ్య‌తిరేక‌త బాహాటంగా ఎదుర‌వుతోంది. సంక్షేమ పథకాల వైఫల్యాలు, ప్రాంత అభివృద్ధిలో లోపాలు, ఇతర సమస్యలపై ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యేల‌పై ప్ర‌జాగ్ర‌హం పెల్లుబుకుతోంది. శాసనసభ్యులు సంయమనం పాటించి ముందస్తు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ పై అసంతృప్తి ప్ర‌జ‌ల్లో ఉంద‌ని స‌ర్వేల సారాంశం. ఆ విష‌యాన్ని గ‌మ‌నించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెంటనే `బాదుడేబాదుడు` అనే కార్య‌క్ర‌మాన్ని రూపొందించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే పార్టీ నేతలు, కార్యకర్తల కోసం మహానాడు మహానాడు నిర్వహించాలని యోచిస్తున్నారు. మహానాడు స‌భ త‌రువాత జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల స‌మ‌ర‌శంఖం పూరించాల‌ని టీడీపీ భావిస్తోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులతో వైఎస్సార్సీపీ సామాజిక భేరి బస్సు యాత్రను ఈనెల 26 వ తేదీ నుంచి ప్రారంభించ‌నుంది.

సామాజిక భేరి పేరుతో బస్సు యాత్ర ఈనెల 26న శ్రీకాకుళం, విజయనగరం, 27న రాజమండ్రి, 27న నరసరావుపేట, 28న అనంతపురంలో బస్సు యాత్ర సంద‌ర్భంగా బహిరంగ సభలు నిర్వహించనున్నారు. బస్సుయాత్ర కోసం ఆదివారం శ్రీకాకుళంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తదితరులు సన్నాహక సమావేశాలు నిర్వహించగా మంత్రులు, వైఎస్సార్సీ నేతలు ఇప్పటికే సమావేశాలు ప్రారంభించారు. ఇంకో వైపు మహానాడు విజయవంతానికి సన్నాహక సమావేశాలను ప్రారంభించిన టీడీపీ, మహానాడు వేదిక‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని మ‌రింత‌గా నిలువ‌రించాల‌ని ప్లాన్ చేస్తోంది. ఇలా అధికార‌, విప‌క్ష పార్టీల ప్ర‌చారం చూస్తుంటే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మ‌రింత వేడెక్కనుంది.