Paritala Family: ధ‌ర్మ‌వ‌రం మాదేనంటున్న పరిటాల కుటుంబం..అస‌లు ఇంత‌కీ అక్క‌డ ఏం జ‌రుగుతోంది..?

  • Written By:
  • Updated On - March 10, 2022 / 12:47 PM IST

అనంత‌పురం జిల్లాలో రాజ‌కీయాలు రంజుగా మారాయి. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ ఈ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించ‌గా.. గ‌త ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. రాష్ట్ర రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకున్న దివంగ‌త నేత ప‌రిటాల ర‌వీంద్ర కుటుంబం ఇక్క‌డ రాజ‌కీయంగా బ‌లంగా ఉంది. జిల్లాలో ప‌రిటాల కుటుంబానికి జ‌నంతో మంచి స‌త్సంబంధాలు ఉన్నాయి. ప‌రిటాల రవి మ‌ర‌ణానంత‌రం ఆయ‌న స‌తీమ‌ణి ప‌రిటాల సునీత రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేశారు.

అప్ప‌టి ఉప ఎన్నిక‌ల్లో గెలిచారు. ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల్లో ఆమె రాప్తాడు నుంచి విజ‌యం సాధించారు. గ‌త ప్ర‌భుత్వంలో ఆమె మంత్రిగా ప‌ని చేశారు. అయితే ప‌రిటాల కుటుంబం నుంచి రాజ‌కీయ వార‌సుడిగా 2019లో ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ప‌రిటాల శ్రీరామ్ వ‌చ్చారు. ఆ ఎన్నిక‌ల్లో రాప్తాడు నుంచి మాజీ మంత్రి ప‌రిటాల సునీత త‌న‌కొడుకు కోసం సీటుని త్యాగం చేశారు. రెండు సీట్లు ఆశించిన‌ప్ప‌టికీ అధిష్టానం నిర్ణ‌యంతో సునీత త‌న కుమారుడిని బ‌రిలోకి దింప‌గా ఓట‌మిపాలైయ్యారు.

తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక అనంత‌పురం జిల్లాలో పార్టీ నాయ‌కులు చాలామంది అధికార పార్టీలోకి, బీజేపీలోకి వెళ్లారు. ఇందులో ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌రుపున పోటీ చేసిన గోనుగుంట్ల సూర్య‌నారాయ‌ణ(సూరి) బీజేపీలోకి వెళ్లారు. అయితే ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు ఉండ‌టంతో ఆయ‌న కేసులు నుంచి త‌ప్పించుకోవ‌డానికి బీజేపీలోకి వెళ్లార‌ని నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లు చ‌ర్చించుకుంటున్నారు.

అయితే అప్ప‌టినుంచి ధ‌ర్మ‌వ‌రంలో టీడీపీ ఇంచార్జ్ గా ప‌రిటాల శ్రీరామ్ ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న ధ‌ర్మ‌వ‌రం నుంచి పోటీ చేస్తార‌ని.. ఆయ‌న త‌ల్లి సునీత రాప్తాడు నుంచి పోటీ చేస్తారంటూ ప‌రిటాల అభిమానులు, టీడీపీ కార్య‌క‌ర్త‌లు చెబుతున్నారు. అయితే తాజాగా ఓ మీడియాలో టీడీపీలోకి మ‌ళ్లీ మాజీ ఎమ్మెల్యే సూర్య‌నారాయ‌ణ వ‌స్తున్నార‌ని..ఆయ‌నే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ధ‌ర్మ‌వ‌రం నుంచి పోటీ చేస్తున్నారంటూ క‌థ‌నాలు వ‌చ్చాయి.

దీనిపై మాజీమంత్రి ప‌రిటాల సునీత‌, శ్రీరామ్ స్పందించారు. పార్టీని విడిచి వెళ్లిన‌వారికి ఇక ఛాన్స్ లేద‌ని..ధ‌ర్మ‌వ‌రం నుంచి ప‌రిటాల కుటుంబం పోటీ చేస్తుంద‌ని తేల్చి చెప్పారు. ధ‌ర్మ‌వ‌రంలో గ‌త మూడేళ్లుగా పార్టీని బ‌లోపేతం చేస్తూ అధిష్టానం పిలుపునిచ్చిన కార్య‌క్ర‌మాల‌న్నింటినీ పరిటాల శ్రీరామ్ విజ‌య‌వంతం చేస్తున్నారు. ధ‌ర్మ‌వ‌రం టీడీపీ అభ్య‌ర్థిగా శ్రీరామ్ , రాప్తాడు నుంచి ప‌రిటాల సునీత‌ను బ‌రిలోకి దింపాల‌నే ఆలోచ‌న‌లో అధిష్టానం ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రి చివ‌రి నిమిషంలో అధినేత చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.