AP Reservoirs : జ‌గ‌న్ ఒడిశా మోడ‌ల్ ప్లాన్‌

సాగునీటి ప్రాజెక్టులు, రిజ‌ర్వాయ‌ర్ల‌ నిర్వ‌హ‌ణకు సాంకేతిక‌త‌ను జోడించిన ఒడిశా ప్ర‌భుత్వ మోడ‌ల్ ను ఏపీ స‌ర్కార్ అనుస‌రించ‌డానికి సిద్ధం అయింది

  • Written By:
  • Publish Date - November 27, 2021 / 02:28 PM IST

సాగునీటి ప్రాజెక్టులు, రిజ‌ర్వాయ‌ర్ల‌ నిర్వ‌హ‌ణకు సాంకేతిక‌త‌ను జోడించిన ఒడిశా ప్ర‌భుత్వ మోడ‌ల్ ను ఏపీ స‌ర్కార్ అనుస‌రించ‌డానికి సిద్ధం అయింది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక క‌మిటీ ఇక నుంచి ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌ను ప‌ర్య‌వేక్షించ‌నుంది. ఆటోమేషన్ టెక్నాల‌జీని ప్రాజెక్టుల‌కు అనుసంధానం చేయ‌నుంది. రియ‌ల్ టైం ప్రాతిప‌దిక‌న నీటి ప్ర‌వాహాన్ని అంచ‌నా వేయ‌నుంది. డిశ్చార్జి సామ‌ర్థ్యంతో పాటు అన్ని ర‌కాల చ‌ర్య‌ల‌ను టెక్నాల‌జీకి అనుగుణంగా సీఎస్ ఆధ్వ‌ర్యంలోని క‌మిటీ చూసుకుంటుంది. ఆ మేర‌కు సీఎం జ‌గ‌న్ చిత్తూరు, క‌డ‌ప వ‌ర‌ద‌ల సమీక్ష సంద‌ర్భంగా అధికారుల‌ను ఆదేశించాడు.

ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ తుఫానులు, వ‌ర‌ద‌లు వ‌చ్చిన‌ప్పుడు క్షేత్రాస్థాయికి వెళ్ల‌కుండా ఆటోమెషీన్ టెక్నాల‌జీ ద్వారా రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్ చేస్తున్నాడు. ప్రాణ‌, ఆస్తి న‌ష్టం సంభవించ‌కుండా చాలాసార్లు ప్ర‌జ‌ల్ని కాపాడాడు. ఉత్త‌మ సీఎంగా న‌వీన్ ప‌ట్నాక్ పేరుతెచ్చుకున్నాడు. ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతూ వ‌రుస‌గా ఆయ‌న సీఎంగా గెలుస్తున్నాడు. అందుకే, ఆ రాష్ట్రం అనుస‌రిస్తోన్న ప‌ద్ధ‌తుల‌ను జ‌గ‌న్ అమ‌లు చేయ‌బోతున్నాడు.
వ‌ర‌ద‌ల‌ను నివారించ‌డానికి ఎప్ప‌టికప్పుడు ప్రాజెక్టుల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో అంశాల‌ను స‌మీక్షించాలి. ఆయా సీజ‌న్ల‌లో వ‌ర్ష ప్ర‌భావం, వాతావ‌ర‌ణం మార్పులు, రిజ‌ర్వాయ‌ర్ల‌లోని నిల్వ‌లు త‌దిత‌రాల‌ను గ‌మ‌నించాలి. అవ‌స‌ర‌మైన‌ప్పుడు డిశ్చార్జి సామ‌ర్థ్యాల‌ను పెంచుకోవాలి. కానీ, పుంచా, అన్న‌మ‌య్య ప్రాజెక్టుల డిశ్చార్జి సామ‌ర్థ్యాన్ని గ‌త ప్ర‌భుత్వాలు పెంచ‌లేదు. ఫ‌లితంగా వ‌ర‌ద నీళ్లు చిత్తూరు, క‌డ‌ప జిల్లాలోని గ్రామాల‌ను ముంచెత్తాయి.
భ‌విష్య‌త్ లో ఇలాంటి ప్ర‌మాదాలు రాకుండా సీఎస్ ఆధ్వ‌ర్యంలో ఒక క‌మిటీ ఏర్పాటు అయింది. ఆ మేర‌కు సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నాడు. ఆ క‌మిటీ ఇక నుంచి ప్రాజెక్టుల భ‌ద్ర‌త‌, రిజర్వాయర్లలో నీటిమట్టాలు, వ‌ర్ష‌పు తీవ్ర‌త‌ త‌దిత‌రాల‌ను పర్యవేక్షించ‌నుంది. అందుకోసం ఒడిశా త‌ర‌హాలో కొత్త టెక్నాలజీని ఉప‌యోగించుకోవాల‌ని జ‌గన్ ఆదేశించాడు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. ఆ సంద‌ర్భంగా అధికార యంత్రాంగం, ఆయా ప్రాంతాల్లోని మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ త‌న కార్యాల‌యం నుంచి పరిస్థితిని పర్యవేక్షించాడు. వరద బాధితులకు తక్షణ సాయం అందించేందుకు చర్యలు చేపట్టాడు.
జ‌గ‌న్ ఏరియల్ సర్వే చేశాడు. పింఛా,అన్నమయ్య రిజర్వాయర్‌ల దిగువన ఉన్న గ్రామాలను వరదలపై స‌మీక్షించాడు. పింఛ నీటి విడుదల సామర్థ్యం 58 వేల క్యూసెక్కులు మాత్రమే ఉండగా, ఇన్‌ఫ్లోలు 1.38 లక్షల క్యూసెక్కులకు పైగా ఉంది. అక్కడ నుంచి దిగువ‌న ఉన్న అన్నమయ్య ప్రాజెక్టుకు ఒక్క‌సారిగా నీటి ప్ర‌వాహం రావ‌డంతో గ్రామాలు వ‌ర‌ద ముంపున‌కు గుర‌య్యాయి.
ఇలాంటి ప‌రిస్థితులు భ‌విష్య‌త్ లో రాకుండా ఉండేందుకు ఆటోమెష‌న్ ద్వారా నీటి ప్రవాహాన్ని రియల్ టైమ్ ప్రాతిపదికన పర్యవేక్షించడానికి ఏపీ ప్ర‌భుత్వం సిద్ధం అయింది. అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తోంద‌ని సీఎం జ‌గ‌న్ హామీ ఇచ్చాడు.