Site icon HashtagU Telugu

Vangaveeti Radha : రెక్కీ’ రాధా మ‌రో కోణం.!

Vangaveeti Radha

Vangaveeti Radha

స్వ‌ర్గీయ వంగ‌వీటి రంగా చ‌రిష్మా విజ‌య‌వాడ మీద ప్ర‌త్యేక మార్క్ ను వేసింది. ఆ మార్క్ రంగా హ‌త్య త‌రువాత కృష్ణా జిల్లా వ్యాప్తంగా విస్త‌రించింది. కాల‌క్ర‌మంలో కాపు సామాజిక‌వ‌ర్గానికి రోల్ మోడ‌ల్ గా వంగ‌వీటి ఫ్యామిలీ నిలిచింది. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం నేప‌థ్యం ఉన్న‌ప్ప‌టికీ స‌మ‌కాలీన రాజ‌కీయాల‌కు అనుగుణంగా రాణించ‌డంలో మాత్రం రంగా వార‌సుడు రాధా తడ‌బ‌డుతున్నాడు.స్వ‌త‌హాగా మృధు స్వ‌భావి వంగ‌వీటి రాధా. బ‌య‌ట నుంచి చూసే వాళ్ల‌కు మాత్రం క‌ఠినంగా క‌నిపిస్తాడు. కాస్త వైరాగ్యం..కొంత ఆధ్యాత్మిక‌త‌..మ‌రికొంత పెద్ద‌రికం క‌లిబోసిన రాధా మ‌న‌స్త‌త్వం గురించి సమీపంగా ఉండే వాళ్ల‌కు మాత్ర‌మే బోధ‌ప‌డుతుంది. ప్ర‌త్య‌ర్థుల‌పైన‌, మీడియాలోని ఒక వ‌ర్గం మీద ఎప్పుడూ నిప్పులు క‌క్కుతూ ఉంటాడు. ఫెరోషియ‌స్ గా దూరం నుంచి చూసే వాళ్ల‌కు క‌నిపిస్తుంటాడు. కానీ, మాన‌వీయంగా రాధా ఆలోచిస్తుంటాడ‌ని ఆయ‌న స‌హ‌చ‌రులు, అభిమానులు చెబుతుంటారు.

Also Read : పొలిటిక‌ల్ బాంబ్ రెడీ! ‘రెక్కీ’ ర‌హ‌స్యం!!

స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో దూకుడుగా రాధా వెళ్ల‌లేక‌పోవ‌డానికి ఆర్థిక బ‌ల‌హీనత ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని అనుచరులు చెబుతుంటారు. చ‌రిష్మా, కుటుంబ నేప‌థ్యం బ‌లంగా రాధాకు ఉంది. అయిన‌ప్ప‌టికీ వ్యాపారాలు, ప‌రిశ్ర‌మ‌లను ఏర్పాటు చేయ‌లేదు. బినామీగా ఏ కంపెనీలోనూ వాటాలు తీసుకోలేదు. ఆర్థిక ప‌ర‌మైన లావాదేవీల విష‌యాల్లో జోక్యానికి దూరంగా ఉంటాడు. సెటిల్మెంట్లు అంటే రాధాకు అస‌లు గిట్ట‌దు. ఇంకొక‌రి సొమ్మును ఆశించే మ‌న‌స్త‌త్వం కాద‌ని స‌న్నిహితులు చెబుతుంటారు. ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో కూడా డ‌బ్బు సంపాద‌న మీద దృష్టి పెట్ట‌లేద‌ని ఆయన వ‌ర్గీయుల స‌మాచారం. పూర్వం నుంచి వ‌చ్చిన ఆస్తుల ద్వారా వ‌స్తోన్న రాబ‌డికి అనుగుణంగా నిరాడంబ‌ర‌ జీవితాన్ని రాధా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌. ఇది ఆయ‌న‌లోని రెండో కోణంగా అనుచ‌రులు చెబుతుంటారు.సామాజికంగా బ‌ల‌మైన లీడ‌ర్ అయిన‌ప్ప‌టికీ మిగిలిన అంశాల్లో రాధా వెనుక‌బ‌డ్డాడు. దీంతో ఆయా రాజ‌కీయ పార్టీలు పెద్దగా ప్రాధాన్య‌త ఇవ్వ‌డానికి ముందుకు రాలేదు. అందుకే, కాంగ్రెస్‌, ప్ర‌జారాజ్యం, వైసీపీ, టీడీపీ..ఇలా పార్టీల‌ను ఆయ‌న మార్చేశాడు. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న్ను ఫోక‌స్ చేయ‌డానికి ఆ పార్టీ ఆచితూచి అడుగు వేస్తోంది. ఆయ‌న కూడా కొన్ని కార్య‌క్ర‌మాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నాడు. చంద్ర‌బాబు ఇంటి మీద వైసీపీ దాడి చేసిన‌ప్పుడు మాత్ర‌మే క‌నిపించాడు. ఆ త‌రువాత ఇటీవ‌ల జ‌రిగిన విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఒక‌టి రెండు చోట్ల పాల్గొన్నాడు. అంత‌కు మించి టీడీపీలో కీల‌క లీడ‌ర్ గా ఎద‌గలేక‌పోయాడు.

Also Read  : Delhi Confidential : జ‌గ‌న్ కు ‘సాయి’ పోటు!?

దేవినేని, వంగ‌వీటి కుటుంబాల మ‌ధ్య ఆధిప‌త్య పోరు చాలా కాలం విజ‌య‌వాడ కేంద్రంగా న‌డిచింది. ఇరు కుటుంబాల‌కు బ‌ల‌మైన సామాజిక నేప‌థ్యం ఉన్న కార‌ణంగా ఎక్క‌డా త‌గ్గ‌కుండా రాజ‌కీయాల‌ను న‌డిపారు. ఇటీవ‌ల ఆ రెండు కుటుంబాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణ లేదు. హ‌ఠాత్తుగా `రెక్కీ` అంశాన్ని రాధా తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. గుణ‌ద‌ల బ్యాచ్ ప్ర‌మేయంపై రాధా అనుచ‌రులు అనుమానిస్తున్నారు. ఫ‌లితంగా విజ‌య‌వాడ ఒక్క‌సారి ఉలిక్కి ప‌డింది. దీంతో ఏపీ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింది.ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న 1+1ఉన్న గ‌న్ మెన్ల భ‌ద్ర‌త‌ను 2+2 సెక్యూరిటీగా మార్చేసింది. సీఎం జ‌గ‌న్ కూడా రాధా చెప్పిన `రెక్కీ` అంశంపై ప్ర‌త్యేక ఆదేశాల‌ను ఇచ్చాడ‌ని మంత్రి కొడాలి నాని వెల్ల‌డించాడు. ఆ క్ర‌మంలో డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ రంగంలోకి దిగాడు. రంగా వర్ధంతి సభలో వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవ‌డానికి సిద్ధం అయ్యాడు. రాధా వ్యాఖ్య‌ల‌పై విచార‌ణ‌ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీని ఆదేశించాడు. `రెక్కీ` వెనుక ఉన్న అస‌లు గుట్టును బ‌య‌ట‌పెట్టాల‌ని ఏపీ పోలీస్ ఛాలెంజ్ గా తీసుకుంది. ఇలాంటి ప‌రిణామాల న‌డుమ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ చురుగ్గా ఉండాల‌ని రాధా సంసిద్ధం అవుతున్నాడ‌ట‌. సో..రాధా రెండో కోణం ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version