మూడు పార్టీల పొత్తు ముచ్చట కొలిక్కి రానుంది. మూడోసారి కలిసిన చంద్రబాబు (Chandrababu), పవన్ (Pawan Kalyan) మధ్య భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగి ఉంటుంది. రెండు రోజుల క్రితం జాతీయ ఛానల్ కు చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మోడీ విజన్ ను ప్రశంసించారు. విధాన పరంగా ఇద్దరం ఒకటే అనే సంకేతం ఇచ్చారు. అంటే, బీజేపీ తో కలిసి నడిచేందుకు టీడీపీ సిద్ధం అయింది. అందుకు బలం చేకూరేలా ఏపీ బీజేపీ జగన్ ప్రభుత్వంపై చార్జిషీట్ అంటూ పోరాటానికి తెరతీసింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రజినీకాంత్ విజయవాడ వచ్చిన మరుసటి రోజే చంద్రబాబు, పవన్ భేటీ జరిగింది. అంటే ఏదో ఊహించని ఎత్తుగడ బీజేపీ, టీడీపీ,జనసేన మధ్య జరుగుతుంది. టీడీపీ, జనసేన కలిసి నడవడానికి అంతర్గతంగా ఫిక్స్ అయింది. కానీ , బీజేపీ ని కలుపుకొని పోవాలి అనే దానిపై తీవ్ర కసరత్తు జరుగుతుంది. ఆ ప్రయత్నం చివరకు వచ్చినట్టు కనిపిస్తుంది. అందుకు నిదర్శనం గత వారం బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ దేవధర్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకోవచ్చు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచడం బీజేపీ, వైసీపీ మధ్య ఎలాంటి సంబంధం లేదనడానికి నిదర్శనం అంటూ ఆయనవ్యాఖ్యానించారు. ఈ పరిణామాలను గమనిస్తే బీజేపీ , టీడీపీ, జనసేన జత కట్టెలా కనిపిస్తుంది. ఆ క్రమంలో గౌరవ ప్రదమైన సీట్ల కోసం పవన్ శనివారం చంద్రబాబు ఇంటికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఇటీవల టీడీపీ, బీజేపీలను ఒకతాటిపైకి తెచ్చే లక్ష్యంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన జరిగింది. రెండ్రోజులు హస్తినలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పలువురు బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను బీజేపీ పెద్దలకు వివరించే ప్రయత్నం చేశారు.జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి పోటీచేయాలని గతంలో జనసేనాని బీజేపీ పెద్దల దృష్టి తీసుకెళ్లారు. వైసీపీకి వ్యతిరేకంగా తాము బలంగా పోరాడతామని ప్రతిపక్షాలు సంకేతాలు వస్తున్నాయి. జేపీ నడ్డాతో భేటీ అయిన తరువాత పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని ప్రకటించారు. కాని పొత్తుల విషయంలో మేలు చేసే నిర్ణయం ఉంటుందని గతంలోనే పవన్ చెప్పారు. ఈ భేటి విషయంపై పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో చర్చించారా .. లేదా అన్న విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read: Arvind Kejriwal: రెజ్లర్లకు సీఎం కేజ్రీవాల్ మద్దతు.. మహిళలను వేధించే వారిని ఉరితీయాలంటూ ఫైర్
హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం భేటి అయ్యారు. ఈ మధ్య కాలంలో వీరిద్దరి భేటీ జరగటం ఇది మూడోసారి. ఓసారి బెజవాడలోని హోటల్ లో.. ఆ తర్వాత హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంట్లోనే సమావేశం జరిగింది. దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ వీళ్లిద్దరు సమావేశం కావటం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఉంటుందా లేదా.. పొత్తు ఉంటే ఎన్ని సీట్లకు అనే అంశాలపై టీడీపీ, జనసేన పార్టీల్లో ఆసక్తికర డిస్కషన్ కు తెర తీసింది. ఎర్రగొండపాలెం ఘటనపై చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో రజనీ కాంత్ చేసిన వ్యాఖ్యలు ఇద్దరి భేటీ మధ్య చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.
టీడీపీ వైపు బాలినేని?
మరో ఆసక్తి కర అంశం కూడా రాజకీయాల్లో బాగా సీనియర్ గా ఉన్నవాళ్లు చెబుతున్నారు. అదేమంటే ,మాజీ మంత్రి బాలినేని టీడీపీలోకి వస్తారని టాక్. ప్రకాశం జిల్లాలోని మూడు రిజర్వ్ స్థానాలతో పాటు ఆ జిల్లా మంత్రిగా అవకాశం రాబోవు రోజుల్లో ఇవ్వాలని కండిషన్ పెట్టారని సమాచారం. ఆ లైజనింగ్ పవన్ ద్వారా చంద్రబాబుతో బాలినేని నడుపుతున్నారని విశ్వసనీయ సమాచారం. ఇటీవల పవన్ తో ఏదో ఒక అంశం మీద బాలినేని టచ్ లో ఉంటున్నారు. ఇటీవల బాలినేని మైత్రి మూవీస్ లో పెట్టుబడులు పెట్టారని జనసేన కార్పొరేటర్ ఆరోపించారు. దానిపై పవన్ నిజాలు చెప్పాలని బాలినేని విజ్ఞప్తి చేసారు. తాడేపల్లి కోటరికి పూర్తిగా దూరంగా ఉంటున్న బాలినేని ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని ఆయన వర్గీయుల్లోని చర్చ. ఆ క్రమంలో పవన్ ద్వారా డీల్ కోసం ప్రయత్నం జరుగుతుందని తెలుస్తుంది. అందుకే అత్యవసరంగా చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారని వినికిడి. మొత్తం మీద జగన్ ప్రభుత్వాన్నీ దించడానికి ఏదో జరుగుతుంది. ఆ క్రమంలో పొత్తులు, జగన్ వర్గీయులను ఆకర్షించటం చంద్రబాబు, పవన్ భేటీ వెనుక ఉన్న ఎజెండాగా భావిస్తున్న వాళ్ళు అనేకులు.