హీరోల‌కే..హీరోలు ..సినీ అగ్ర‌జుల కొమ్మువిరిసిన జ‌గ‌న్, కేసీఆర్

ఎన్టీఆర్, ఏఎన్నార్ అగ్రనటులుగా వెలిగిపోతున్న సమయంలోనే కృష్ణ, శోభన్ బాబు కూడా అగ్రనటుల జాబితాలో చేరారు. కృష్ణ తరువాత వచ్చిన కృష్ణంరాజు కూడా మెల్లగా పెద్ద హీరో అనిపించుకున్నారు.

  • Written By:
  • Updated On - September 27, 2021 / 12:51 PM IST

ఎన్టీఆర్, ఏఎన్నార్ అగ్రనటులుగా వెలిగిపోతున్న సమయంలోనే కృష్ణ, శోభన్ బాబు కూడా అగ్రనటుల జాబితాలో చేరారు. కృష్ణ తరువాత వచ్చిన కృష్ణంరాజు కూడా మెల్లగా పెద్ద హీరో అనిపించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ సమకాలీనుడుగా వచ్చిన కాంతారావు కూడా కొన్నాళ్ళు పెద్ద హీరోగానే వన్నెకెక్కారు.
వీరితో సినిమా తీయలేని నిర్మాతలకు చలం, హరనాథ్, బాలయ్య, రమణమూర్తి, శ్రీధర్, చంద్రమోహన్, జగ్గయ్య, రామ్మోహన్ అందుబాటులో దొరికారు. హాస్యనటులే అయినప్పటికీ రాజబాబు, పద్మనాభం సినిమాలను నిర్మించారు. కొన్ని సినిమాల్లో హీరోలుగా నటించారు.
1970 తరువాత దాసరి నారాయణ రావు చాలామంది నటులను పరిచయం చేశారు. మోహన్ బాబు, ఈశ్వర రావు, హరిబాబు, హరిప్రసాద్, నారాయణరావు, రాజా, రాజేంద్రప్రసాద్, మురళీమోహన్ లాంటి డజనుకు పైగా హీరోలు ఉండేవారు. అగ్రహీరోలు దొరకనివారికి వీరు కొంగుబంగారంగా వర్దిల్లారు. వీరి సినిమాలు కూడా శతదినోత్సవాలు చేసుకున్నాయి. వీరిలో ఎవ్వరికీ వారసుల స‌హాయంలేదు. అందరూ హాబీగా స్టేజ్ డ్రామాలు వేసుకుంటూ బ్రతుకుతెరువు కోసం ఉద్యోగమో, వ్యాపారమో చేసుకునేవారు.
1980 తరువాత చిరంజీవి సినిమారంగంలో నిలద్రొక్కుకున్న తరువాత పరిస్థితి మారిపోయింది. 1980 నుంచి 1990 మధ్యలో సుమన్, భానుచందర్, కళ్యాణ్ చక్రవర్తి, హరిన్ చక్రవర్తి, హరీష్, సాయి కుమార్, శివకృష్ణ, రాజశేఖర్ లాంటి హీరోలు వచ్చారు. విజయాలు సాధించారు. సుమన్, రాజశేఖర్ మినహా మిగిలిన అందరూ మాయమయ్యారు. కేవలం నాలుగు సినిమా కుటుంబాల వారసుల కోసం ప్రతిభ కలిగిన యువ హీరోలను నిర్దాక్షిణ్యంగా గెంటేశారు. అవకాశాలు రాకుండా చేశారు. ఒకరో అరో వారితో సినిమాలు తీసినా, థియేటర్స్ దొరక్కుండా చేశారు.
2000 సంవత్సరం వచ్చేనాటికి కేవలం నందమూరి కుటుంబం, అక్కినేని కుటుంబం, దగ్గుబాటి కుటుంబం, ఘట్టమనేని కుటుంబం, మెగా కుటుంబం మాత్రమే సినిమారంగంలో హీరోలుగా చలామణీ అయ్యే పరిస్థితి నెలకొంది. ఉదయ్ కిరణ్, తరుణ్, వరుణ్ సందేశ్ లాంటి కొందరు హీరోలుగా వచ్చి విజయాలు సాధించినా వారు త్రొక్కివేయబడ్డారు. పైన చెప్పిన కుటుంబాల వారసులకు డైలాగులు చెప్పడం రాకపోయినా, చింపాంజీ ముఖాలే అయినా, డాన్స్ రాకపోయినా వారిని జనం చూసేంతవరకూ సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అగ్రహీరోలుగా చలామణి అవుతున్న కొందరు హీరోల ముప్ఫయి ఏళ్ళక్రితం నటించిన సినిమాలు చూస్తే, వారి నటన, హావభావాలు చూసి విరగబడి నవ్వుతాము. అయినా మనమీదకు బలవంతంగా రుద్ది రుద్ది “మీరు నటులా మహాప్రభో” అనిపించేట్లు చేశారు.
ఒక కుటుంబలో ఒక వారసుడు విఫలమైతే, అతడిని నిర్మాతను చేసి అతని తమ్ముడిని రుద్దుతారు. ఆ రకంగా హీరోలు అయినవారున్నారు. ఈవీవీ సత్యనారాయణ కొడుకులు ఇద్దరు వచ్చారు. వారికి అగ్ర స్టేటస్ వచ్చిందా? కోదండరామిరెడ్డి కొడుకు, బ్రహ్మానందం కొడుకు, సాలూరి కోటి కొడుకు, బెల్లంకొండ సురేష్ కొడుకు, ఎంవిఎస్ రాజు గారి కొడుకు, గీతాంజలి కొడుకు, ఎస్వీఆర్ మనుమడు, రాఘవేంద్రరావు కొడుకు, ఆది, పినిశెట్టి, ఇంకా ఎందరో…ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కారణం? ఆ నాలుగైదు కుటుంబాలవారు మరొక కుటుంబం నుంచి సినిమా రంగానికి రానివ్వరు. వచ్చినా తొక్కేస్తారు. తమ కుటుంబంలోని కోతుల్లాంటి వారిని సైతం నలకూబరులని ప్రచారం చేయిస్తారు. వచ్చిన తొలిరోజుల్లో చూస్తేనే వాంతి వచ్చేట్లుండే ఒక మన్మధుడి ఇద్దరు కొడుకులు గత పదేళ్లుగా విశ్వయత్నాలు చేస్తున్నా ఒక్క హిట్ కొట్టలేకపోయారు. మరొక అగ్ర హీరో కొడుకులు ఇద్దరూ పదిహేనేళ్లనుంచి తన్నుకుంటున్నా హిట్ రాలేదు. ఎన్టీఆర్ తరువాత అంత గొప్పగా డైలాగులు చెబుతాడని పేరున్న వాళ్ళ నాన్న సంపాదించిన వందలకోట్లు తగలేసి ఇక విరమించినట్లున్నారు. అయినా సరే, మీడియా వారిని ఆకాశానికి ఎత్తేస్తుంది. వారు మహానటులైనట్లు భజనలు చేస్తుంది. శర్వానంద్, నాని లాంటి సెకండ్ గ్రేడ్ హీరోలు గొప్ప హిట్లు ఇచ్చినా అస్సలు ఒక్క వ్యాసం కూడా వారిగూర్చి వ్రాయరు. వారి పుట్టినరోజులు వారి వారి ఇంటివరకే పరిమితం.
ఈ రకంగా సినిమారంగం మొత్తాన్ని గుప్పిట పట్టి, ఇతరులకు అవకాశాలు లేకుండా చేసి, వేలకోట్లు సంపాదించి, పిల్లికి కూడా బిచ్చం పెట్టని పిసినారులుగా అసహ్యించుకోబడుతున్న హీరోలు…ఈరోజు “ప్లీజ్..ప్లీజ్…ప్లీజ్..మమ్మల్ని బతికించండి, దయదలచండి” అని బహిరంగంగా ముఖ్యమంత్రులను అడుక్కుతింటుంటే…వహ్వా…ఇన్నాళ్లకు వీళ్ళ కొమ్ములు విరిచి పొగరు దించే ముఖ్యమంత్రులు ఒకరికి ఇద్దరు వచ్చారు అని ఆనంద‌ప‌డుతోన్న వాళ్లు టాలీవుడ్లో ఎందరో ఉన్నారు. కీప్ ఇట్ అప్ సీఎం సార్స్…!