Site icon HashtagU Telugu

Court Sentences Man To Death: ఒంగోలు కోర్టు సంచలన తీర్పు.. దోషికి ఉరిశిక్ష

Suicide Hanging 19

Suicide Hanging 19

జూలై 2021లో తన బంధువైన ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపిన కేసులో ఒక వ్యక్తికి బుధవారం ఒంగోలు కోర్టు (Ongole Court) ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ నిందితుడు డి. సిద్దయ్యను పోక్సో చట్టం, ఐపిసిలోని సంబంధిత సెక్షన్ల కింద దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించారు. గిద్దలూరు మండలం అంబవరం గ్రామ శివారులోని డ్రైనేజీ కాల్వలో 2021 జూలై 8న అదృశ్యమైన బాలిక మృతదేహం ప్లాస్టిక్ సంచిలో లభ్యమైంది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గిద్దలూరు పోలీస్ స్టేషన్‌లో పోక్సో, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ప్రకాశం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మాలిక గార్గ్ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని, సరైన భౌతిక ఆధారాలను సేకరించి నిందితులను వెంటనే అరెస్టు చేయాలని అప్పట్లో పోలీసు అధికారులను ఆదేశించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గిద్దలూరు మండలం అంబవరానికి చెందిన దూదేకుల సిద్ధయ్య 8 జులై 2021లో ఇంటి సమీపంలో ఆడుకుంటున్న కుమార్తె వరుసయ్యే ఏడేళ్ల చిన్నారిని పిలిచి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాలిక భయంతో కేకలు వేయడంతో మంచానికేసి గట్టిగా కొట్టాడు. దీంతో స్పృహ కోల్పోయిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత చిన్నారి చనిపోవడంతో ఆమె మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ సంచిలో చుట్టి గ్రామ శివారులోని తుప్పల్లో పడేసి పారిపోయాడు.

Also Read: Governor Tamilisai: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై పరోక్ష విమర్శలు.. అవి మాత్రమే అభివృద్ధి కాదంటూ..!

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా బుధవారం నిందితుడిని దోషిగా నిర్థారించిన ఒంగోలు రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంఏ సోమశేఖర్ మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. అలాగే.. బాధిత బాలిక తల్లిదండ్రులకు రూ. 10 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ కేసు విచారణలో ప్రతిభ కనబర్చిన అప్పటి దిశ స్టేషన్ డీఎస్పీ ధనుంజయుడు, సీఐ ఎండీ ఫిరోజ్, కోర్టు లైజన్ సిబ్బందిని అభినందించి రివార్డులు అందించారు.